
నేషనల్ లెవెల్ ఎగ్జామ్, లక్షల్లో అభ్యర్ధులు, బోలెడు సిలబస్ అన్నింటికి మించి లాక్‌డౌన్ ఎఫెక్ట్.. కోచింగ్ సెంటర్లు, కాలేజీలు అన్నీ బంద్. అంతా ఆన్‌లైన్ ప్రిపరేషన్.. ఈ గందరగోళంలో ర్యాంక్ కొట్టేదెలా?.. టాపర్‌గా నిలిచేదెలా?..ఇది స్టూడెంట్స్‌కు పెద్ద సవాలే.. ఈ అనిశ్చితి తొలగకముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్స్ రీషెడ్యూల్‌ను విడుదల చేసింది. పరీక్ష రాసేందుకు 50 రోజుల గడువు ఉంది. ఈ టైమ్‌లో ఒత్తిడికి లోనవకుండా.. ప్రిపరేషన్ కొనసాగించడానికి సబ్జెక్ట్ ఎక్స్‌ఫర్ట్స్ అందిస్తున్న స్టడీ ప్లాన్…
ఎగ్జామ్ డేట్ .. జులై 26
కంపేరిటీవ్ స్టడీ ఫర్ బయాలజీ
నీట్ ఎగ్జామ్‌లో బయాలజీది మేజర్ పార్ట్. ఎక్కువ వెయిటేజీ ఉన్నందున ఈ సబ్జెక్ట్ కు తగిన సమయం కేటాయించాలి. క్వశ్చన్ పేపర్‌లో ఫస్ట్ బయాలజీ సబ్జెక్టును పూర్తి చేయాలి. కాన్సెప్టులు, నిర్వచనాలు, తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. చదివేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ , ఈజీ టాపిక్స్, కఠినమైనవి ఇలా.. షార్ట్ లిస్ట్ చేసుకుని ప్రిపేరవ్వాలి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకుని చదివితే బయాలజీలో మంచి స్కోర్ సాధించవచ్చు. దాదాపు 90శాతం ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జువాలజీలో ఏనిమల్ కింగ్‍డమ్, వర్గీకరణ, శాస్ర్తీయ నామాలు, లక్షణాలు వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలి. మానవుని శరీర ధర్మ శాస్ర్తం, ఎకాలజీ, జెనెటిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది. ఎనిమేలియా, ప్లాంటే వర్గాల టాపిక్‍లను చదవాలి. జీవుల ఉమ్మడి లక్షణాలు చదివితే ప్రత్యేక లక్షణాలు కలిగిన జీవులపై వచ్చే ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయవచ్చు. బయోటెక్నాలజీ, అప్లైడ్ బయాలజీలను బాగా అధ్యయనం చేయాలి. కణజాల వర్ధనం, కిణ్వనం, జెనెటిక్ ఇంజినీరింగ్ వంటి వాటినుంచి నిత్యజీవితంతో సంబంధం ఉన్న ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. బోటనీ, జువాలజీ రెండింటిలో కామన్‍గా ఉండే టాపిక్ కణజీవశాస్ర్తం. కణం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు, కణాంగాలు, కణ చక్రం, కణ విభజన వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. బయాలజీలో జీవశాస్ర్త వర్గీకరణ, సజీవ ప్రపంచం, కణ విభజన, ఫోటో సింథసిస్, పుష్పించే మొక్కల కణ నిర్మాణం, వృక్ష రాజ్యం, అనువంశికత, అనువంశిక సూత్రాలు, లైంగిక ప్రత్యుత్పత్తి, పర్యావరణ సమస్యలు, జీవపరిణామం వంటి టాపిక్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. గత ప్రశ్నా పత్రాల్లో కూడా వీటినుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
ప్లానింగ్ ఫర్ ఫిజిక్స్
ఫిజిక్స్ సిలబస్‌ను మొత్తం 45నుంచి 50 రోజులకు ఒక్కో యూనిట్‌ను కనీసం మూడు రోజులు చదివేలా ప్లాన్ చేసుకోవాలి. పరీక్షకు 10 రోజుల ముందే రివిజన్ కంప్లిట్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడు ఎలాంటి కన్‌ప్యూజన్ ఉండదు. ఈ టైమ్‌లో కొత్త టాపిక్స్ జోలికి పోకుండా ఉండడం బెటర్. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ను ప్రాక్టీస్ చేయాలి. సిలబస్‌లో ఇంపార్టెంట్ టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. కైనమాటిక్స్ లో డిస్‍ప్లేస్‍మెంట్, యాక్సిలరేషన్, యావరేజ్ వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ వంటి కాన్సెప్ట్స్ స్పష్టంగా తెలిసుండాలి. సమస్యలను ఊహించి సాధించాల్సి ఉంటుంది. ఇందులో ప్రశ్నలు నేరుగా, కొంత కఠినంగా వచ్చే అవకాశం ఉంది. గ్రాఫికల్ డేటామీద వచ్చే ప్రశ్నలు కూడా ముఖ్యమైనవే. ప్రాబ్లమ్స్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఫార్ములాలు గుర్తుంచుకోవచ్చు. ఫస్టియర్ సిలబస్‌లో మెకానిక్స్, సెకండియర్‌లో మోడరన్ ఫిజిక్స్ నుంచి రిపీటెడ్‌గా 11 నుంచి 12 ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిని ప్రాక్టీస్ చేయడం మరిచిపోవద్దు. రిలేటివ్ మోషన్, యూనిఫాం సర్క్యులార్ మోషన్, కన్జర్వేషన్ ఆప్ మూమెంటం, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులార్ మూమెంటం, రోలింగ్ మోషన్ వంటివి ముఖ్యమైన టాపిక్‍లు. థర్మోడైనమిక్స్, రొటేషన్, ఆప్టిక్స్ వంటి టాపిక్‍లను క్షుణ్నంగా పదే పదే అధ్యయనం చేయాలి. వీటినుంచే అత్యధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
కెమిస్ట్రీ స్మార్ట్ ప్రిపరేషన్
కెమిస్ట్రీ సబ్జెక్ట్ ను ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. మూడు సెక్షన్‌లుగా డివైడ్ చేసి చదవాలి. న్యూమరికల్ ప్రాబ్లమ్స్‌ను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా మోల్ కాన్సెప్ట్, రెడాక్స్, కెమికల్ కైనటిక్స్, ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, అటామిక్ స్ట్రక్చర్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అడిగే చాన్స్ ఉంది. ఫిజికల్ కెమిస్ట్రీ ప్రిపరేషన్ కోసం ఫార్ములా షీట్ తయారు చేసుకోవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీపై ఎఫర్ట్ పెడితే మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రిపరేషన్ కోసం ఎన్‌సిఇఆర్‌టి పుస్తకాలు ఉత్తమం. క్వాలిటేటివ్ అనాలసిస్, పి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ మెటలర్జీ వంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి గ్రిగ్నార్డ్ యొక్క కారకాలు, హైడ్రోకార్బన్లు, కార్బొనిల్ కాంపౌండ్స్ అండ్ బయో మాలిక్యూలర్స్ టాపిక్స్ ఇంపార్టెంట్. ఇతర సబ్జెక్టులతో పోలిస్టే కెమిస్ట్రీని చాలా తక్కువ టైమ్‌లో పూర్తి చేయవచ్చు. ఇందుకోసం సాధన తప్పనిసరి అని స్టూడెంట్స్ భావించాలి.
ప్రిపరేషన్ రివిజన్
లాక్‌డౌన్ కారణంగా ఏప్రిల్‌లో జరగాల్సిన ఎగ్జామ్స్ జూలై నెలకు వాయిదా పడ్డాయి. ఈ సమయాన్ని స్టూడెంట్స్ మంచి అవకాశంగా భావించాలి. పరీక్షకు ఇంకా 50 రోజులు ఉన్నందున రివిజన్‌కు ఎక్కువ టైమ్‌ను కేటాయించాలి. కాన్సెప్ట్ బేస్‌డ్‌గా చదివితే ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. చివరి పది రోజులు ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయడానికి కేటాయించాలి. దీంతో ఎగ్జామ్ రోజు ఒత్తిడికి లోనవకుండా ఉంటారు.
షార్ట్ నోట్స్
నీట్ ఎగ్జామ్ సిలబస్‌ను చదవడం పూర్తి చేసినవారు టాపిక్స్ వారిగా షార్ట్ నోట్స్ చేసుకుంటే ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఈ టైమ్‌లో పాఠ్యపుస్తకాలను తిరిగేయడం వల్ల గందరగోళానికి గురయ్యే చాన్స్ ఉంది. సిలబస్ ఇంత ఉందా అనే భావన కలుగుతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్‌ను షార్ట్ లిస్ట్ చేసుకుని చదివాలి. చదివేటప్పుడు క్వశ్చన్ ఏరియాలను అండర్ లైన్ చేసుకుంటే ఎగ్జామ్‌కు ముందు తిరగేయచ్చు.
ప్రాక్టీస్
ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో ప్రీవియస్ పేపర్లు ఎంతో సహాయపడతాయి. గతంలో ఇచ్చిన ప్రశ్నల సరళిని గమనిస్తూ చదివితే ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. కనీసం 5 నుంచి 6 సంవత్సరాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్లను అనాలసిస్ చేయాలి. ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ పై అవగాహన వస్తుంది. ప్రశ్నల సరళి అర్ధమైతే మంచి స్కోర్ సాధించవచ్చు.
రిలాక్స్
చాలా మంది స్టూడెంట్స్ పరీక్ష రాయకముందే రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది ప్రిపరేషన్ పై ప్రభావం చూపిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలం. ప్రతి రోజు టైమ్ టేబుల్ సెట్ చేసుకుని ఎప్పటికప్పుడు చదవాల్సిన టాపిక్స్‌ను పూర్తి చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ చూడగానే గందరగోళానికి గురికాకుండా.. ముందుగా ఈజీగా ఉన్న క్వశ్చన్‌కు ఆన్సర్ చేయాలి .
డిసిప్లేన్
నీట్ ఎగ్జామ్ లో విజయం సాధించాలంటే స్టూడెంట్స్‌కు క్రమశిక్షణ చాలా ముఖ్యం. జాతీయ స్థాయి పరీక్ష కావున లక్షల మంది హాజరవుతారు. సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందరికంటే మంచి ర్యాంక్ సాధించాలంటే కష్టపడాల్సిందే. అందుకు సరైన టైమ్‌టేబుల్ తప్పనిసరి. పరీక్ష షెడ్యూల్ ప్రకారం మనకున్న సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. మీరు సక్సెస్ కావాలంటే రెగ్యులర్ స్టడీ చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్ చదవడం పూర్తి కాగానే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
రెఫరెన్స్ బుక్స్
ఫిజిక్స్
ఎన్‍సీఈఆర్‍టీ 11, 12 తరగతి పుస్తకాలు
కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్: – హెచ్‌సీ వర్మ
ఆబ్జెక్టివ్ ఫిజిక్స్: – డీసీ పాండే
ఫండమెంటల్ ఫిజిక్స్: – ప్రదీప్
ఫిజికల్ కెమిస్ర్టీ: – ఓపీ టాండన్
బయాలజీ
ఎన్‍సీఈఆర్‍టీ 11, 12 తరగతి పుస్తకాలు
బయాలజీ వాల్యూమ్ 1 & 2: – ట్రూమన్
ఆబ్జెక్టివ్ బయాలజీ: – దినేశ్
ఆబ్జెక్టివ్ బోటనీ:- అన్సారీ
కెమిస్ట్రీ
ఎన్‍సీఈఆర్‍టీ 11, 12 తరగతి పుస్తకాలు
ఏబీసీ ఆఫ్ కెమిస్ర్టీ ఫర్ క్లాసెస్: మోడర్న్ పబ్లికేషన్
కన్‍సైజ్ ఇనార్గానిక్ కెమిస్ర్టీ -: జేడీ లీ
కెమిస్ర్టీ గైడ్: – దినేశ్
సీహెచ్. రాజపోచం
నాగభైరవ ఐఐటీ–జేఈఈ నీట్, అకాడమీ