
- అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై సహా పలు సిటీలలో ఆందోళనలు
- జాతీయ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీలు
- బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు
- బిల్లు చరిత్రాత్మక మలుపంటూ ప్రధాని మోదీ ట్వీట్
- చట్టంగా మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తరువాయి
న్యూఢిల్లీ:పార్లమెంట్ లో గురువారం వక్ఫ్ బిల్లు పాస్ కావడంతో శుక్రవారం ఆ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. శుక్రవారం నమాజ్ తర్వాత వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీతోపాటు అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, లక్నో నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం విద్యార్థి సంఘాలు, ఇతర ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో వేలాది మంది ఆందోళనలో పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లు కాపీని కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, మతానికి వ్యతిరేకమని నినాదాలు చేశారు. అయితే, యూనివర్సిటీ అధికారులు అన్ని గేట్లకు తాళాలు వేసి, క్యాంపస్ ను లాక్ డౌన్ చేసింది.
బయటివారు లోపలికి, లోపలివారు బయటకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో వర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. గేట్ 7 వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని విద్యార్థులు బైఠాయించారు. స్టూడెంట్లు శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అడ్డుకోవడం ఏమిటని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) ప్రశ్నించింది.
నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జామియా నగర్, షహీన్ బాగ్, జామియా మిలియా ఇస్లామియా వంటి సెన్సిటివ్ ఏరియాల్లో ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలు కవాతు నిర్వహించాయి. కీలక ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితిని పర్యవేక్షించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని, ఇన్ఫార్మర్లను కూడా యాక్టివేట్ చేశామని సీనియర్ పోలీస్ ఆఫీసర్లు తెలిపారు. నార్త్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, షహ్దారా, ఈస్ట్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ ను కూడా ముమ్మరం చేశామన్నారు.
అహ్మదాబాద్, కోల్ కతా సిటీల్లో ఉద్రిక్తత..
కోల్ కతాలో వేలాది మంది ముస్లింలు జాతీయ జెండాలు పట్టుకుని ‘జాయింట్ ఫోరమ్ ఫర్ వక్ఫ్ ప్రొటెక్షన్’ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. బిల్లు ప్రతులను కాల్చివేస్తూ, వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని నినాదాలు చేశారు. సిటీలోని ప్రధాన రోడ్లలో ముస్లింలు జాతీయ జెండాలు, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీల సందర్భంగా సిటీలోని పలు చోట్ల టెన్షన్ వాతావరణం కనిపించింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు భారీగా నిరసనలు తెలిపారు. ఎంఐఎం రాష్ట్ర చీఫ్ తో సహా 40 మంది లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన వృద్ధులను కూడా పోలీసులు బలవంతంగా లాక్కెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలోనూ ముస్లింలు వేలాదిగా గుమిగూడి నిరసనల్లో పాల్గొన్నారు. కర్నాటక రాజధాని బెంగళూరులో కూడా పలు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరిగాయి.
చెన్నైలో విజయ్ పార్టీ ఆందోళన
తమిళనాడు అంతటా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలపాలంటూ టీవీకే చీఫ్, నటుడు విజయ్ పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పార్టీ ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీలు జరిగాయి. చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరాపల్లి ఇతర సిటీల్లో టీవీకే కార్యకర్తలు, ముస్లింలు కలిసి ఆందోళనలు చేపట్టారు. ‘‘ముస్లింల హక్కులను హరించొద్దు.. వక్ఫ్‌బిల్లును రద్దు చేయాలి” అంటూ నినాదాలు చేశారు.
వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వేర్వేరుగా శుక్రవారం పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లింల హక్కులను కాలరాస్తుందని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ బిల్లు సమానత్వ హక్కు, మతాన్ని ఆచరించే స్వేచ్ఛ, మతపరమైన వ్యవహారాలను నిర్వహించే స్వేచ్ఛ, మైనారిటీ హక్కుల వంటి అనేక నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాదించారు.
‘‘సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌తో పాటు అన్ని వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు తప్పనిసరిగా సభ్యులుగా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. కేవలం ఇస్లాం మత సంస్థలపైనే ఇలాంటి రూల్స్ విధించడం వివక్ష చూపడమే” అని పేర్కొన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదమే తరువాయి..
వక్ఫ్ (సవరణ) బిల్లు పార్లమెంట్‌లో పాస్ అయింది. ఈ బిల్లుపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు బిల్లు ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. అనంతరం తెల్లవారుజామున 4:02 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ.. శుక్రవారం తెల్లవారుజామున 4:02 గంటల వరకు 17గంటల పాటు నాన్‌స్టాప్‌గా నడిచింది. కాగా, వక్ఫ్ బిల్లుకు లోక్‌సభ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపనుంది. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత చట్టంగా మారనుంది.