ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి ఒడిగట్టారు. ప్రయాణికులతో వెళ్తోన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని విచక్షణరహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరుల కాల్పుల్లో 50 మంది సామాన్య ప్రజలు మరణించగా.. మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. 2024, నవంబర్ 21వ తేదీన కుర్రం గిరిజన జిల్లాలో ఈ దాడి జరిగింది. పెషావర్ నుండి పరాచినార్‌కు.. పరాచినార్ నుండి పెషావర్‌కు ప్రయాణీకులతో వెళ్తోన్న రెండు వాహనాలపై దుండగులు కాల్పులు జరిపినట్లు తెలిసింది.
ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్ చీఫ్ సెక్రటరీ నదీమ్ అస్లాం చౌదరి ఈ దాడిని ధృవీకరించారు. ప్రయాణికుల వాహనాలపై ముష్కరులు జరిపిన కాల్పుల్లో కనీసం 50 మంది మరణించారు. మరో 29 మంది గాయపడ్డారని ఆయన తెలిపారు. మరణించిన వారిలో ఒక మహిళ, ఒక పసిబిడ్డ ఉన్నారని.. ఈ ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇది ఒక విషాద ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్--ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కుర్రం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో షియా, సున్నీ ముస్లింల మధ్య దశాబ్దాలుగా భూ వివాదం జరుగుతోంది.
తాజా దాడి కూడా ఈ నేపథ్యంలోనే జరిగినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ దాడికి ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. కుర్రం జిల్లా టెర్రర్ ఎటాక్ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ స్పందించారు. ప్రయాణికులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మైరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.