పాల్వంచ, వెలుగు: ఒరిస్సా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పాల్వంచ పట్టణ పోలీసులు శనివారం చాకచక్యంగా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో పట్టణంలోని రెజీనా స్కూల్ వద్ద పోలీసులు వ్యాన్ ను ఆపి తనిఖీ చేయగా దాంట్లో నుంచి 150 కిలోల గంజాయి పట్టుబడింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై బాణాల రాము తెలిపారు. దీని విలువ రూ. 38 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ఖమ్మం టౌన్: ఖమ్మం నగరంలోని చెరుకూరి మామిడితోట అల్లిపురం రోడ్డులో 4 కేజీల గంజాయి పట్టుబడినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం ఏసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ రూరల్, నర్సీపట్నం నుంచి గంజాయి తెచ్చి ఖమ్మం నగరంలో యువకులకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు.
గంజాయి అమ్ముతున్న వెస్ట్ గోదావరి రాజమండ్రికి చెందిన మణికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అనంతరానికి చెందిన మాలోతు లోకేశ్, ఖమ్మం సిటీ ఇందిరానగర్ కు చెందిన షేక్ అహ్మద్‌లను ఖానాపురం హావేలి పోలీసులు పట్టుకున్నారు. నిందితులను విచారించగా కొనుగోలు చేసే 20 మందిని వివరాలు చెప్పారన్నారు. వారిలో 13 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి కియా కారు, మోపెడ్, ఐప్యాడ్ యాఫిల్ ఫోన్, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.