- హయత్ నగర్– పఠాన్‌చెరు రూట్లో 50 కిలోమీటర్ల స్ట్రెయిట్ లైన్
- శామీర్‌పేట నుంచి ఎయిర్‌పోర్టుకు 62 కి.మీ జర్నీ
- మెయిన్జంక్షన్గా చాంద్రాయణగుట్ట స్టేషన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తయితే సిటీ జనాలు ఇంతకు ముందు కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంది. తూర్పు నుంచి పడమరకు.. ఉత్తరం నుంచి దక్షిణానికి పొడవైన మెట్రో కారిడార్లు నిర్మిస్తుండడంతో ఇది సాధ్యం కానున్నది. రైలెక్కితే ఒకే రూట్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు జర్నీ చేయొచ్చు.
ఫస్ట్ ఫేజ్‌లో మూడు కారిడార్ల పరిధిలో 69 కిలోమీటర్ల దూరంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, సెకండ్ ఫేజ్ తో ఈ దూరం మరింత పెరిగి సిటీ శివార్ల వరకూ చేరింది. సెకండ్ ఫేజ్పార్ట్–ఎలో ఐదు కారిడార్ల పరిధిలో 76.4 కి.మీ, పార్ట్–బిలో మూడు కారిడార్ల పరిధిలో 85 కి.మీ మేర మెట్రోను విస్తరించనున్నారు. మొత్తంగా 11 కారిడార్ల పరిధిలో 230.4 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రెడ్‌లైన్‌లో మరో 20.5 కిలోమీటర్లు
సిటీకి ఈస్ట్ వైపు ఉన్న హయత్ నగర్ నుంచి వెస్ట్వైపు ఉన్న పఠాన్‌చెరు వరకు 50 కి.మీ మేర మెట్రో స్ట్రెయిట్ లైన్ లో పరుగులు పెట్టనున్నది. ప్రస్తుతం ఈ రూట్లో ఎల్బీనగర్ నుంచి మియాపూర్వరకు 29 కి.మీ మేర మెట్రో మార్గం అందుబాటులో ఉండగా, సెకండ్ ఫేజ్‌లో మియాపూర్ నుంచి పఠాన్‌చెరుకు 13.4 కి.మీ, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్‌కు 7.1 కి.మీ మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీంతో మొత్తంగా రెడ్‌లైన్ పొడవు 50 కి.మీకు పెరగనుంది. ఈ రూట్లో ప్రయాణించే వారి సంఖ్య డబుల్ కానున్నది.
ఎయిర్‌పోర్టుకు ఈజీగా...
ఫేజ్–2 పార్ట్–బిలో నార్త్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే నిర్ణయించారు. దీంతో జేబీఎస్నుంచి శామీర్‌పేట వరకు 22 కి.మీ, ప్యారడైజ్‌నుంచి మేడ్చల్ వరకు 23 కి.మీ మేర నిర్మాణానికి మెట్రో అధికారులు డీపీఆర్రెడీ చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తయితే మేడ్చల్ నుంచి వచ్చేవారు ప్యారడైజ్దగ్గర రైలు మారితే 63 కి.మీ దూరంలోని ఎయిర్‌పోర్టుకు సులభంగా చేరుకోవచ్చు. శామీర్‌పేట నుంచి వచ్చేవాళ్లు ట్రైన్మారాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
జేబీఎస్నుంచి ఎంజీబీఎస్వరకు11 కి.మీ మేర గ్రీన్లైన్ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఎంజీబీఎస్నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ మేర విస్తరణ పనులు త్వరలో ప్రారంభించనున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి ఎయిర్పోర్ట్వరకు 21 కి.మీ పైనే లైన్నిర్మించనున్నారు. పదో కారిడార్అయిన శామీర్ పేట– జేబీఎస్, రెండో కారిడార్ అయిన జేబీఎస్– ఎంజీబీఎస్, ఆరో కారిడార్ అయిన ఎంజీబీఎస్– చాంద్రాయణగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్వరకు దాదాపు 62 కి.మీ మేర మెట్రో లైన్ ఏర్పడనుంది.
అమీర్‌పేట లెక్కనే చాంద్రాయణగుట్ట జంక్షన్
ప్రస్తుతం అమీర్‌పేట మెట్రోస్టేషన్ప్రధాన ఇంటర్ చేంజ్ జంక్షన్ గా కొనసాగుతున్నది. ఇప్పుడున్న మూడు కారిడార్లలో వివిధ రూట్లకు వెళ్లాలనుకునే వారు అమీర్‌పేట జంక్షన్లో రైలు మారుతున్నారు. ఇదే తరహాలో ఫేజ్–2 లో చాంద్రాయణగుట్ట ప్రధాన జంక్షన్ గా రూపుదిద్దుకోనున్నది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు చాంద్రాయణగుట్ట జంక్షన్నుంచే వెళ్లాల్సి ఉంటుంది. జేబీఎస్, నాగోలు మీదుగా, జేబీఎస్నుంచి ఎంజీబీఎస్మీదుగా, కోకాపేట– రాయదుర్గ్– అమీర్‌పేట మీదుగా, పఠాన్‌చెరు– మియాపూర్–అమీర్ పేట మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనుకునేవారు చాంద్రాయణగుట్ట జంక్షన్మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది.
దీంతో ఈ జంక్షన్ ను అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని లగేజీలు మోసుకెళ్లడానికి విమానాశ్రయాల తరహాలో ప్రత్యేకంగా ఎస్కలేటర్లను నిర్మించనున్నారు.