- చనిపోయిన రైతు కుటుంబాలు అర్హులైనా గుర్తించట్లే
- లక్షలాది మంది అర్హులకు అందని పెట్టుబడి సాయం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా అందించే పీఎం కిసాన్ పథకం నిధులు రాష్ట్ర రైతుల్లో సగం మందికి అందడం లేదు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రైతులు కేంద్రం సాయాన్ని పొందలేకపోతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో పాస్‌బుక్ ఉన్న రైతుల్లో 50% మందికే పీఎం కిసాన్ అందుతోంది. కొత్తగా పాస్‌బుక్‌లు వచ్చిన లక్షలాది మందిని లబ్ధిదారులుగా గుర్తించట్లేదు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులకు పాస్‌బుక్‌లు బదిలీ అయినా.. పీఎం కిసాన్‌కు అప్రూవ్ చేయడం లేదు. దీంతో ఏటా లక్షలాది మంది రైతులకు సాయం దక్కడం లేదు. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అప్రూవ్ చేసే ప్రక్రియలో జాప్యంతో అర్హులైన వారు పెట్టుబడి సాయం పొందలేకపోతున్నారు. దీంతో రైతుబంధు సాయం అందిస్తున్న వారిలో సగం మందికి కూడా పీఎం కీసాన్ అందని పరిస్థితి. రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉండగా.. పీఎం కీసాన్‌కు 39.67 లక్షల మందినే రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించి కేంద్రానికి పంపించారు. దీంతో దరఖాస్తు చేసుకున్నా అప్రూవల్ రాక 17.94 లక్షల మంది పీఎం కిసాన్ కోల్పోతున్నారు.
ఈకేవైసీకి ఈ నెలాఖరు వరకే గడువు
2018లో ప్రారంభించిన పీఎం కిసాన్ స్కీం కింద ఐదెకరాలలోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఇవ్వాలని తొలుత కేంద్రం నిర్ణయించింది. ఆ తర్వాత రైతులందరికీ వర్తింపజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పెన్షన్లర్లు, ప్రజాప్రతినిధులు, డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెషనల్ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులు పీఎం కిసాన్ పరిధిలోకి రారు. చనిపోయిన రైతు కుటుంబాలకు బదిలీ అయిన పాస్ బుక్‌లకు ఇవ్వవచ్చనే నిబంధనను అధికారులు పాటించట్లేదు. పీఎం కిసాన్ కోసం ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను లింక్ చేయడానికి ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం వ్యవసాయ శాఖ సూచించింది. ఈ నెల 31తో గడువు ముగియనుంది. అయితే కిందిస్థాయి అధికారులు పీఎం కిసాన్‌పై రైతులకు అవగాహన కల్పించడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.