ఆర్మీలోకి 50% అగ్నివీర్​లు

  • నాలుగేండ్ల సర్వీసు కంప్లీట్ చేసుకున్న వారికి చాన్స్​
  • గతంలో ఈ  కోటా 25 శాతం మాత్రమే
  • వేతనాల్లోనూ మార్పులు చేయాలని కేంద్రం ఆలోచన

న్యూఢిల్లీ:  అగ్నిపథ్ స్కీమ్​లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం.. నాలుగేండ్ల సర్వీసు కంప్లీట్ అయ్యాక 25 శాతం మంది అగ్నివీర్​లను మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకోవాలని ఉన్నది. త్రివిధ దళాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు 25 శాతాన్ని కాస్తా 50 శాతానికి పెంచాలని కేంద్రం ఆలోచిస్తున్నదని రక్షణ వర్గాల ద్వారా తెలిసింది. అదేవిధంగా అగ్నివీర్​లకు అందించే వేతనాల్లోనూ మార్పులు చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు నేషనల్ మీడియాకు వివరించారు.

అగ్నివీర్​ల అర్హతల్లోనూ కొన్ని కొత్త నిబంధనలు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నదని తెలిపారు. ఇప్పుడున్న 21 ఏండ్ల వయోపరిమితిని 23 ఏండ్లకు పెంచాలని కూడా సైన్యం సిఫార్సు చేసినట్లు తెలిపారు. 25 శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటే.. ఆర్మీ బలం తగ్గే అవకాశం ఉంటుందని పలువురు సీనియర్ అధికారులు కేంద్రానికి సూచించారు. కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని నాలుగేండ్ల పాటు దేశానికి సేవ చేసిన అగ్నివీర్​లు.. రెగ్యులర్ సర్వీసుల్లోకి వస్తే మరింత సమర్థవంతంగా పని చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

అందుకే వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది. సైనిక వర్గాల్లో అంతర్గతంగా చర్చించి.. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నివేదికను అందజేసినట్లు సమాచారం. లోక్​సభ ఎన్నికల సమయంలో అపోజిషన్ పార్టీలన్నీ అగ్నిపథ్ స్కీమ్​పై తీవ్ర విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని మార్పులు చేసే దిశగా కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, త్రివిధ దళాల్లో నియామకాల కోసం జూన్‌‌‌‌ 2022లో అగ్నిపథ్‌‌‌‌ స్కీమ్​ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.