తమిళ మహిళకు సగం వాటా

తమిళ మహిళకు సగం వాటా

రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు రాజకీయాల్లో అద్భుతాల్ని సృష్టిస్తున్నాయి. బడుగులను బలవంతులుగా  మారుస్తున్నాయి. అధికారం కట్టబెడుతున్నాయి. ముఖ్యంగా మహిళలను మహారాణులు చేస్తున్నాయి. ఎంపీటీసీ స్థాయిని ఎంపీ లెవెల్​కి ప్రమోట్​ చేస్తున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీకి; వంటింటి నుంచి పార్లమెంట్​కు పంపిస్తున్నాయి. లోకల్​ బాడీ ఎలక్షన్స్​లో లేడీస్​కి 33 శాతం ఉన్న రిజర్వేషన్లు ఈమధ్య చాలా రాష్ట్రాల్లో 50 శాతానికి పెరుగుతున్నాయి. ఈ లిస్టులో ఇప్పుడు తమిళనాడు చేరింది.

ఆడవాళ్లకు సహజంగా అన్ని చోట్లా ఆటంకాలు ఎదురవుతుంటాయి. పల్లెటూళ్లలో ఈ ఇబ్బందులు మరీ ఎక్కువ. పెద్ద చదువులకు పోనీయరు. ఉద్యోగం చేస్తామంటే ఒప్పుకోరు. గడప దాటి బయటకు వెళ్లాలంటే ఎన్నో కట్టుబాట్లుంటాయి. అలాంటి పరిస్థితుల్లో మహిళలు ఎన్నికల్లో పోటీ చేయటం అయ్యే పనేనా?. కానీ.. ఆ అసాధ్యాన్ని రిజర్వేషన్లు సాధ్యం చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో లేడీస్​కి మంచి చోటు దక్కుతోంది. పార్టీలు కూడా మునుపటిలా కాకుండా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. దేశమంతటా ముందుగా 33 శాతం, తర్వాత చాలా రాష్ట్రాల్లో 50 శాతం సీట్లు కేటాయించాయి. దీంతో ఎంతోమందికి ఎంపవర్​మెంట్ వచ్చింది.

ఇప్పుడు తమిళనాడు వంతు

2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకున్నప్పుడు… అన్నాడీఎంకే పార్టీ చీఫ్​, సీఎం జయలలిత మహిళలకు లోకల్​ బాడీ ఎలక్షన్స్​లో తగిన ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని  మహిళా రిజర్వేషన్​ని 33 నుంచి 50 శాతానికి పెంచుతామన్నారు. అయితే, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ కోర్టుకు వెళ్లటంతో అవి ఆగిపోయాయి. అప్పటికే ఉన్న మహిళ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు సరిగా అమలు కావట్లేదని, మరిన్ని సీట్లు ఇవ్వటం సరి కాదని ఆ పార్టీ వాదించింది. దీంతో రిజర్వేషన్ల పెంపు అమల్లోకి రాకుండా పెండింగ్​లో పడిపోయింది.

ఆ తర్వాత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చనిపోవటం, రాష్ట్ర రాజకీయం గజిబిజి కావటం, పన్నీర్​ సెల్వం పోయి పళని స్వామి సీఎం కావటం చకచకా జరిగాయి. పాలన గాడిలో పడ్డాక తమిళనాడులో జిల్లాల సంఖ్య పెంచారు. ఈ నిర్ణయం కూడా కోర్టు మెట్లెక్కింది. జిల్లాల పెంపు ప్రభావం పడే 9 సెగ్మెంట్లను వదిలేసి మిగతా అన్ని చోట్ల లోకల్​ బాడీ ఎలక్షన్స్​ పెట్టాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పటంతో రంగం సిద్ధమైంది. ఈ నెల 27– 30 తేదీల మధ్య ఎన్నికలు జరగనున్నాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించాక జరుగుతున్న మొదటి ఎలక్షన్లివి.

అసెంబ్లీ టికెట్లకు ఇప్పట్నుంచే ప్లానింగ్​

అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో గడువు లేదు. ఏడాదిన్నరలో జరిగే పెద్ద ఎలక్షన్స్​ కోసం ఇప్పట్నుంచే అన్ని పార్టీలు గ్రాస్​రూట్​ లెవెల్లో కార్యకర్తలను రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జరుగుతున్న లోకల్​ బాడీ ఎన్నికలు వచ్చే అసెంబ్లీకి సమర్థులనుకూడా గుర్తించడానికి ఉపయోగపడతాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. కరూర్​ ఎంపీ జోతిమణి… పొలిటికల్​ ఎంట్రీ స్థానిక సంస్థల నుంచే జరిగింది. అందుకే ఈ లోకల్​ బాడీ ఎన్నికలపై అందరూ కన్నేసి ఉంచారు.  ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమిళనాడులో పార్టీల మధ్య ఫిరాయింపులు తక్కువ.  కార్యకర్తలు తమ పార్టీకి కట్టుబడి ఉంటారు. ఈ నెల 27, 30 తేదీల్లో జరిగే పోలింగ్​ ఫలితాలు జనవరి 2న వెల్లడవుతాయి.

రిజర్వేషన్ల పుణ్యమా అని ఆడవాళ్లు పదవిలోకి వచ్చినా  వాళ్ల భర్తలు పెత్తనం చెలాయిస్తుంటారు. ఇక మీదట అలాంటివి లేకుండా చూడాలని కోరుతున్నారు సామాజిక వేత్తలు. పార్టీలు ఎలక్షన్లప్పుడే మహిళల గురించి ఆలోచిస్తుంటాయని, అన్ని సందర్భాల్లోనూ అండగా నిలవాలని చెబుతున్నారు.  లక్షా 31 వేల స్థానాల్లో స్త్రీలే

స్థానిక సంస్థల కిందికి గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, మండల పరిషత్​లు, జిల్లా పరిషత్​లు; పట్టణ ప్రాంతాల్లో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, కంటోన్మెంట్​ బోర్డ్​లు, పోర్ట్​ ట్రస్ట్​లు వస్తాయి. వీటన్నింటా 50 శాతం రిజర్వేషన్లంటే… కనీసం 70 వేల నుంచి దాదాపు లక్షా 31 వేల వరకు ఆడవాళ్లకే సీట్లు కేటాయించాలి. ఇంత పెద్ద సంఖ్యలో పోటీ చేయటానికి కోటాల వారీగా మహిళలు రెడీగా లేకపోవటంతో పొలిటికల్​ పార్టీలకు కొత్త తలనొప్పి మొదలైంది. దీంతో అవి తమ పార్టీల్లోని నాయకుల బంధువులను రంగంలో దించక తప్పలేదు.

ఇదేం పోయే కాలం అన్నారు!

1996లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిలబడి గెలిచా. అప్పుడే కొత్తగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఆ ఛాన్స్ మిస్ చేసుకోదలచుకోలేదు. రిజర్వేషన్లే లేకపోతే రాజకీయాల్లోకి వచ్చేదాన్ని కాదు. పాలిటిక్స్ లోకి అడుగు పెడతానంటే ఎంతో మంది వద్దన్నారు. మా అమ్మకు ఉన్నవీ లేవినీ కల్పించి చెప్పారు. ‘ఆడోళ్లే పోటీ చేయాలట. ఇదేం పోయే కాలం. ఇది కాదా కలియుగం’ అని అప్పట్లో విడ్డూ రంగా మాట్లాడారు. కానీ.. నేను వెనక్కి తగ్గలేదు. దీన్నో గొప్ప అవకాశంగా భావించబట్టే ఇవ్వాళ ఈ స్థాయిలో ఉన్నా. ‑ ఎస్​.జోతిమణి, కాంగ్రెస్​ ఎంపీ (కరూర్​)

నిలబడితేనే నిజమైన అధికారం

ఆడవాళ్లు సమయం, సందర్భం వచ్చినప్పుడు ముందుకొచ్చి సత్తా చాటాలి. అన్ని సందర్భా ల్లోనూ భర్తల చాటు భార్యలు అనిపించుకో కూడదు. రాజకీయాల్లో రిజర్వేషన్లను అంది పుచ్చుకోవాలి. ఎన్నికల్లో నిలబడాలి. గెలిచి నంక  పాలనలో తమ మార్కు చూపించాలి. అప్పుడే వాళ్లకు నిజమైన అధికారం, స్వాతం త్ర్యం వచ్చినట్లు. ఆడవాళ్లు మగవాళ్లను దాటుకొని ఈ స్థాయికి రావాలంటే ఎంతో చొరవ తీసుకుంటే తప్ప జరగదు. రిజర్వేషన్లు గొప్ప అవకాశాల్ని కల్పిస్తున్నాయి. ఈ అండతో మహిళలు కొండ పాకాలి. వాళ్లు పాలిటిక్స్​లోకి రావటానికి ఇంతకు మించి మార్గం లేదు. ‑ సెంథిల్​ ఆర్ముగం, ‘సత్తా పంచాయత్​ మూమెంట్’​ లీడర్​

ప్రధానికి తప్పుడు సలహాలు

ఆర్థిక అంశాలపై ప్రధాని  మోడీని సలహాదారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. వాస్తవాలు దాచి పెడుతున్నారు. ఎకానమీని గాడిలో పెట్టడానికి ప్రధాని చర్యలు తీసుకోవాలి.

‑ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు

పోరాటానికి కలసి రండి

దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. వాటిపై ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా పోరాటం చేయాలి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.‑ మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం

అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత

సిటిజన్​షిప్ అమెండ్​మెంట్ యాక్ట్​కు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.  బీజేపీని సపోర్ట్ చేస్తున్న కొన్ని పార్టీలు కూడా సీఏఏను వ్యతిరేకిస్తున్నాయి. ‘అర్బన్ నక్సల్స్ ’ కామెంట్ పై ప్రధాని క్షమాపణ చెప్పాలి.
‑ డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ లీడర్