3 బ్యారేజీల నిర్మాణంలో 50 సబ్​ కాంట్రాక్ట్​ సంస్థలు

3 బ్యారేజీల నిర్మాణంలో 50 సబ్​ కాంట్రాక్ట్​ సంస్థలు
  •  అవన్నీ కేసీఆర్​కు అత్యంత క్లోజ్​గా ఉండేవాళ్లవే
  • కాళేశ్వరంపై జస్టిస్​ ఘోష్​​ కమిషన్​ విచారణలో వెల్లడి?
  • కాంట్రాక్ట్​ సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్​ ఆరా​
  • ప్రతి పైసా లెక్క తీసేందుకు త్వరలో చార్టర్డ్​ అకౌంటెంట్ ​నియామకం
  • అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం
  • క్రాస్​ ఎగ్జామినేషన్​కు వేరే రాష్ట్రం నుంచి అడ్వకేట్!
  • 16న కమిషన్​ ముందు వెదిరె శ్రీరాం పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్
  • 15న తన వాదనలు వినిపించనున్న విద్యుత్​ అధికారి కంచర్ల రఘు 

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలపై జస్టిస్​ పీసీ ఘోష్​ నేతృత్వంలోని జ్యుడీషియల్​ కమిషన్​ ఎంక్వైరీని ముమ్మరం చేసింది. టెక్నికల్​ అంశాలతో పాటు ఆర్థిక అక్రమాలపై సమాంతరంగా విచారణను చేపడ్తున్నది. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో భారీ అవకతవకలు జరిగినట్టు.. ఆ మూడు బ్యారేజీల నిర్మాణంలో  50కిపైగా సబ్​ కాంట్రాక్ట్​ సంస్థలు భాగమైనట్లు కమిషన్​ దృష్టికి వచ్చినట్లు తెలిసింది. 

 బీఆర్​ఎస్​ చీఫ్​, మాజీ సీఎం కేసీఆర్​కు అత్యంత క్లోజ్​గా ఉండే వ్యక్తుల సంస్థలకే సబ్​ కాంట్రాక్ట్​లు వెళ్లినట్టు సమాచారం. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీలపై కమిషన్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. వాటితో పాటు ప్రధాన కాంట్రాక్ట్​ సంస్థల నుంచి ఎవరెవరికి నిధులు మళ్లాయనేదానిపైనా లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమైంది. ప్రధాన, సబ్​ కాంట్రాక్ట్​ సంస్థల ఆర్థిక లావాదేవీలపై క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ చార్టర్డ్​ అకౌంటెంట్(సీఏ)​ను నియమించుకోవాలని కమిషన్​ యోచిస్తున్నట్టు తెలిసింది. 

ఎంతమేర ఆర్థిక అవకతవకలు జరిగాయన్న విషయంలో ప్రతి పైసాకూ లెక్కలను తీయాలన్న ఆలోచనలో కమిషన్​ ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే చార్టర్డ్​ అకౌంటెంట్​ను నియమించేలా రాష్ట్ర సర్కారుకు త్వరలోనే లేఖ రాయాలని కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పినాకి చంద్రఘోష్​ యోచిస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా కాగ్​ రిపోర్ట్​లోని ఆర్థికాంశాలపైనా ఆ సీఏతో పూర్తి విశ్లేషణ చేయించాలని జస్టిస్​ ఘోష్​ భావిస్తున్నట్టు సమాచారం. 

క్రాస్​ ఎగ్జామినేషన్​కు బయటి లాయర్​

విచారణలో భాగంగా అధికారులు, అఫిడవిట్లు సమర్పించిన వారిని క్రాస్​ ఎగ్జామినేషన్​ చేయాలనుకుంటున్న జ్యుడీషియల్​ కమిషన్​.. అందుకు ఓ లాయర్​ను కూడా నియమించుకోవాలని భావిస్తున్నది. ఇక్కడి వారిని కాకుండా.. ఈ ఏరియాతో సంబంధం లేని వేరే రాష్ట్రాల అడ్వకేట్​ను క్రాస్​ఎగ్జామినేషన్​కు నియమించాలని యోచిస్తున్నది. 

ఇందుకోసం ఢిల్లీ లేదా ముంబైకి చెందిన అడ్వకేట్ల వివరాలను ఆరా తీస్తున్నట్టు, అందులో బెస్ట్​ అడ్వకేట్​ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాళేశ్వరంలోని ఆర్థికపరమైన అవకతవకల్లో ప్రతి విషయాన్నీ వెలికి తీయాలని కమిషన్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టు దొరికిన ఏ ఒక్క సాక్ష్యాధారాన్నీ వదిలిపెట్టడంలేదు. కొందరు ప్రైవేటు వ్యక్తుల నుంచి కూడా దీనిపై ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. 

ఆగస్టు చివరి నాటికి రిపోర్ట్​?

కాళేశ్వరంపై ఆగస్టు చివరి నాటికి విచారణను పూర్తి చేయాలని కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ ఘోష్​ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 16న ఆయన కోల్​కతాకు వెళ్లి మళ్లీ ఈ నెల చివరి వారంలో రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి.  అక్కడి నుంచి విచారణను మరింత స్పీడప్​ చేయనున్నారు. 

ఆగస్టులో దాదాపు మూడు వారాల పాటు దీనిపై దృష్టి కేంద్రీకరించి.. రిపోర్టును సిద్ధం చేసే చాన్స్​ ఉంది. వీలైనంత వరకు ఆగస్టు చివరి నాటికి రిపోర్ట్​ ఇవ్వొచ్చని, ఒకవేళ అది సాధ్యం కాకపోతే మరికొంత గడువునూ కోరే అవకాశం ఉందని ఇరిగేషన్​ వర్గాలు అంటున్నాయి. 

కమిషన్​ ముందు విచారణకు ఏజెన్సీల ప్రతినిధులు 

పంప్​హౌస్​ ఏజెన్సీల ప్రతినిధులు ముగ్గురు గురువారం జ్యుడీషియల్​ కమిషన్​ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఓ సంస్థకు చెందిన వైస్​చైర్మన్​ కూడా విచారణకు హాజరైనట్టు తెలిసింది. ఆయనతో పాటు సంస్థల ప్రతినిధులు గురువారం విచారణకు వచ్చినట్టు సమాచారం. బ్యారేజీలు, పంప్​హౌస్​ల నిర్మాణానికి సంబంధించిన పూర్తి టెక్నికల్​ అంశాలను కమిషన్​ ఆరా తీస్తున్నది. 

బ్యారేజీలు కుంగడానికి కారణమేంటి? పంప్​హౌస్​ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఎంత కరెంట్​ఖర్చవుతుంది? పంప్​హౌస్​ల మోటార్ల సామర్థ్యం ఎంత? వంటి వివరాలను సంస్థల ప్రతినిధుల నుంచి రాబట్టినట్లు సమాచారం. వారితో పాటు ఇరిగేషన్​ శాఖ వర్క్స్​ అండ్​ అకౌంట్స్​ డైరెక్టర్​ కూడా విచారణకు హాజరయ్యారు. వివిధ సంస్థలకు కాంట్రాక్ట్​ కేటాయించిన విధానాలు.. పనులు జరిగిన తీరు.. విధానపరమైన నిర్ణయాల గురించి జస్టిస్​ ఘోష్​ విచారణలో ఆరా తీసినట్లు తెలిసింది. 

16న కమిషన్​ ముందుకు వెదిరె శ్రీరాం!

కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఈ నెల 16న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ముందు విచారణకు హాజరు కానున్నారు. వాస్తవానికి శుక్రవారం లేదా సోమవారం ఆయన విచారణకు వస్తారని ముందు చెప్పినా.. కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో ఆయన విచారణకు రాలేనని చెప్పినట్టు తెలిసింది. దీంతో మంగళవారం (ఈ నెల 16న) ఉదయం కమిషన్​ ముందుకు ఆయన వస్తారని సమాచారం. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పవర్​ పాయింట్​ ప్రెజెంటేషన్​ ద్వారా కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ పీసీ ఘోష్​కు వెదిరె శ్రీరాం వివరించే అవకాశం ఉంది. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్​నూ కమిషన్​కు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇక విద్యుత్​ శాఖ అధికారి కంచర్ల రఘు ఈ నెల 15న విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం. ఆయన కూడా పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇచ్చే అవకాశం ఉంది. కాగా,  శుక్రవారం పలువురు ప్రైవేట్​ వ్యక్తులను జస్టిస్​ ఘోష్​ కమిషన్​ విచారించనున్నట్లు తెలిసింది.