గత 15 రోజులుగా తెలంగాణ అనేక జిల్లాల్లో ఉరుములు పిడుగులు భారీ వర్షాలతో దాదాపు 50 లక్షల వ్యవసాయ కుటుంబాల జీవనాధారమైన మొక్కజొన్న, వరి, కూరగాయలు పండ్లతోటలు నేలకొరిగినాయి. అధికారిక అంచనాల ప్రకారం కనీసం 50 వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని గ్రామీణ ప్రాంతాల పాత్రికేయులు అంచనాలు తెలియజేస్తున్నారు.
కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి, జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు నిత్యం భరోసా ఇస్తూనే ఉన్నారు. శూన్య హస్తాలు సుష్కప్రియలు అన్నట్లుగా దమ్మిడి పైసలు కూడా రైతులకు చేరలేదు. రైతుల కష్టాలు గాలికి వదిలి నాయకులంతా సాధారణ ఎన్నికల కొరకు, టిక్కెట్ల కొరకు సిద్ధమవుతున్నారు. లక్షల మంది రైతులు మొక్కజొన్నలు, వరి ధాన్యం రోడ్లమీద ఐకేపీ సెంటర్ల వద్ద పోసుకొని గత రెండు వారాలుగా కురుస్తున్న వానలకు తడిసి, మొలకలెత్తిన దృశ్యాలను చూసి కుటుంబాల సభ్యులంతా ఆగని కంటి ధారలతో రోధిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసే వానలకు ధాన్యం మొలకలు ఎత్తి రెండు మూడు అంగుళాల పొడుగు పెరిగినాయి.
అతివృష్టి, అకాల వర్షాలు
ఒక్కొక్క రైతుకు కనీసం 50 వేల నుంచి నాలుగైదు లక్షల రూపాయల నష్టం జరిగి ఉంటుంది. ప్రతి రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అప్పుల పాలైతున్నారు. ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వపు నిర్లక్ష్యం, ఉదాసీనత, గాలి మాటలు రైతులను మరింత అవమానపరుస్తున్నాయి. దీనితోపాటు ప్రకృతి వైపరీత్యాలు తెలంగాణ రైతులను నిండా ముంచి వేస్తున్నాయి. గత రెండు మూడు సంవత్సరాల నుంచి వర్షాకాలంలో అతి వృష్టితో పత్తి పంట దెబ్బతిన్నదని, యాసంగి మొక్కజొన్న, వరి వేసిన రైతులకు అకాల వర్షాల ద్వారా అపార నష్టం జరుగుతున్నది. గ్రామాల్లో మండల కేంద్రాలలో ధాన్యం ఆరబోసుకోవడానికి కావలసిన కల్లాలను, వర్షం వచ్చినా గానీ తడవకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లయితే రైతులకు నిత్యం ఈ ఘోష నివారించగలిగి ఉండేది. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అతి వర్షాలు అకాల వర్షాలు కురిపిస్తూ ప్రకృతి రైతులను నట్టేట ముంచుతున్నది.
పేద రైతుల సబ్సిడీలకు ఎగనామం
కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు రైతులకు పంట రుణాలపై మూడు శాతం వడ్డీని బ్యాంకులకు చెల్లించేది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపివేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 60-,40 నిష్పత్తిలో వాటాధనం సమకూర్చి పంటల బీమా పథకాన్ని అమలు చేసేది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సహకరించక పంటల బీమా పథకాన్ని అమలు చేయడం ఆపివేసింది. ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు నష్టపోయినప్పుడు నష్టపరిహారం వచ్చే అవకాశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం గంగలో కలిపింది. నష్టపోయినప్పుడు రైతులకు పంట నష్టాన్ని చెల్లించడానికి ప్రకృతి వైపరీత్యాల నిధి కేంద్రం సమకూరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకృతి వైపరీత్యాల ఫండ్ ను ఏ కారణం చేతనో రైతులకు పంచడం లేదు. ఎరువులు విత్తనాలు కంపోస్టు యంత్ర పరికరాలపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇతోధికంగా ఇచ్చేవారు. మన బంగారు తెలంగాణ ప్రభుత్వం ఈ సబ్సిడీలు ఆపివేసింది.
తెలంగాణ విత్తనాల హబ్ అయిందా?
తెలంగాణ రాష్ట్రం విత్తనాల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి వాగ్దానాలు చేసి తొమ్మిది ఏండ్లు అయింది. విత్తనాల మార్కెట్లో కావేరి విత్తనాల సంస్థ ఆధిపత్యం పోతుందనే ఆందోళనతో తెలంగాణ రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలేదని రాజకీయ వర్గాల అభిప్రాయం. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని దేశమంతటా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా ప్రచారం చేసుకునే మన ముఖ్యమంత్రి.. ఆ విత్తన కంపెనీ యజమానికే ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కేటాయించారు. ఇక తెలంగాణ రైతులు కావేరి విత్తనాలపైనే శాశ్వతంగా ఆధారపడాల్సిన పరిస్థితిని కొనసాగిస్తున్నారు మన పాలకులు. ఇక ఆ కంపెనీ మాత్రమే తెలంగాణ విత్తనాల హబ్ గా మారనున్నది కావచ్చు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి, ప్యాకింగ్ చేయించి, అమ్మకానికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని తెలంగాణ అంతట మండల స్థాయిలో అభివృద్ధి చేస్తామని 2018 శాసనసభ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అనేక సభలలో ప్రకటించారు, ఇప్పుడు మరిచిపోయి ఉంటారు.
రాజకీయ ఎత్తుగడలు తప్ప, పాలనపై అవగాహన ఏది?
ప్రభుత్వ రెగ్యులేటరీ వ్యవసాయ మార్కెట్స్, ఐకేపీ, ప్రభుత్వ సహకార ధాన్య సేకరణ సంస్థలు రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదని క్షేత్రస్థాయిలో బాధితులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు తొమ్మి ది ఏండ్లలో తెలంగాణ ప్రభుత్వ పాలన ఇంకా గాడిన పడలేదని రిటైర్డ్ సీనియర్ అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వంలోని వివిధ రంగాల అభివృద్ధి పట్ల మన నాయకులకు అవగాహనరాహిత్యం స్పష్టంగా కనిపిస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పోలీసు, రెవెన్యూ, సంక్షేమం మొదలగు రంగాల గురించి రివ్యూలు జరగడమే అరుదు. ప్రతిపక్షాలను చీల్చడం కోవర్టులను కొనుగోలు చేయడం, సొంత పార్టీని బలోపేతం చేసి అధికార కేంద్రీకరణకు కావలసిన అన్ని చర్యలు నిరంతరం చేపడుతున్న ముఖ్యమంత్రికి ప్రజల అభివృద్ధి, సంక్షేమం, రైతులు, నిరుద్యోగుల, స్త్రీల ,విద్యార్థుల, సమస్యలు పరిష్కరించడం అవసరమని ఆలోచిస్తే బాగుండేది. సెక్రటేరియట్ నిర్మాణమే బంగారు తెలంగాణ పునర్నిర్మాణమని భావిస్తున్నారు మన ముఖ్యమంత్రి.
దేశం పురోగతి విద్యాసంస్థలలో వ్యవసాయ రంగ అభివృద్ధిలో మాత్రమే చూడగలమని మన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అనేక సందర్భాల్లో హితవు పలికేవారు. అది వారు పాటించి మన దేశ అభివృద్ధికి చెరగని పునాదులు వేసినారు. గత తొమ్మిది ఏండ్లలో దాదాపు 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులంతా అభివృద్ధి చెందినారని, ఇక దేశంలో ఉన్న రైతులందరిని ఇదే తరహాలో బాగు చేసే అవకాశం ఇవ్వండి అని మన ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో రైతులను కోరుతున్నారు. దేశమంతటా రైతు రాజ్యం స్థాపిస్తానంటున్నారు.ఉట్టికెక్కనమ్మ స్వర్గానికి ఎక్కుతానని చెప్పినట్లే ఉంది మన పాలకుల ఆలోచన.
పంట నష్టపరిహారం వెంటనే ఇవ్వండి
కొత్త సెక్రటేరియట్ లో అనుమతులే రాని పాలమూరు ప్రాజెక్టుపై మొదటి సమీక్ష చేయడం, అత్యవసరంగా సమీక్షించాల్సిన పంట నష్టాలను పట్టించుకోకపోవడం ఈ ముఖ్యమంత్రికే చెల్లింది. ఆపదలో ఉన్న రైతుల గురించి సమీక్షించడం సీఎంకి మొదటి ప్రాధాన్యం కావాలి. కానీ కాలేకపోయింది. ఎనిమిదేండ్లలో ఎన్నిసార్లు పంట నష్టాలు జరిగినా నష్టపరిహారం ఎన్నడూ ఇవ్వలే. ఎకరానికి పది వేలు ఇస్తామని మొన్న మార్చిలో స్వయాన సీఎం ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఇచ్చిన పాపానపోలేదు. ఆ తర్వాత నుంచి రోజూ అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. వాటన్నిటిపై సమీక్షించేదెప్పుడు? సర్వేల పేరు మీద కాలయాపన చేసి ఎగనామం పెడతారేమోనని రైతులు అనుమానిస్తున్నారు. ఇప్పటికైనా సీఎం అత్యవసరంగాపంటనష్టాలపై సమీక్షించాలి. రైతులకు పంట నష్ట పరిహారం ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంతమంచిది.
రైతు బంధు సర్వరోగనివారిణా?
తెలంగాణ ప్రభుత్వం రైతుల సమస్యలన్నింటికీ రైతు బంధు సర్వరోగ నివారిణిగా భావిస్తున్నది. అది కూడా దొరలకు, భూస్వాములకు రియల్ ఎస్టేట్ యజమానులకు, నాయకులకే సింహభాగం దక్కుతున్నది. ప్రతి సంవత్సరం 15 వేల కోట్ల రూపాయలు పంచుతున్నది. ఇందులో వ్యవసాయం చేసే రైతులకు మాత్రం 40 శాతం నిధులు కూడా దక్కడం లేదు. ఈ పథకం వాస్తవంగా వ్యవసాయం చేసే రైతుల ప్రయోజనాల కంటే అధికార పార్టీకి ఓట్ల ఆకర్షణ పథకంగా తయారయిందని బాధిత రైతులు, కౌలు దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా! తెలంగాణ ప్రభుత్వం అమలుపరిచే రైతు భీమా పథకం కేవలం చనిపోయిన రైతు కుటుంబాలకు మాత్రమే ఊరట కలిగిస్తుంది. బతికున్న రైతులను ఆదుకోలేకపోతున్నది.
కూరపాటి వెంకట్ నారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్, కేయూ