
- వర్గల్ విద్యాధరికి పోటెత్తిన భక్తులు
- అమ్మవారిని దర్శించుకున్న 50 వేల మంది భక్తులు
- 6 వేల మంది చిన్నారుల అక్షరాభ్యాసాలు
గజ్వేల్, వెలుగు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా వర్గల్విద్యాధరి భక్త జనసంద్రంగా మారింది. బుధవారం వసంతపంచమి పర్వదినం కావడంతో సరస్వతీ అమ్మవారిని 50 వేలకుపైగా భక్తులు దర్శించుకున్నారు. 6 వేల మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. తెల్లవారు జామున పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి, నాచగిరి శ్రీ క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి చేతుల మీదుగా..ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఆపై చదువుల తల్లిని నేత్రపర్వంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం విద్యాధరి గిరి ప్రదక్షిణ చేస్తూ పల్లకీ సేవ నిర్వహించారు. ఆపై అమ్మవారికి చప్పన్ భోగ్ నివేదించారు. యాగశాలలో వేదమంత్రోచ్ఛారణలతో చండీహోమం నిర్వహించారు. క్షేత్రం మహామండపంలో రంగంపేట పీఠాధిపతి మాధవానందన సరస్వతి వేదపాఠశాల విద్యార్థులకు విజయ పట్టాలు ప్రదానం చేశారు.
జడ్పీ చైర్మన్ రోజారాధాకృష్ణ శర్మ, మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతరావు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.