కూకట్ పల్లిలో జాబ్ ఫెయిర్​కు 50 వేల మంది

కూకట్ పల్లిలో జాబ్ ఫెయిర్​కు 50 వేల మంది
  • బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లతో కిక్కిరిసిన జేఎన్టీయూ క్యాంపస్​ 

కూకట్​పల్లి, వెలుగు: హైదరాబాద్​ కూకట్​పల్లిలోని జేఎన్​టీయూలో నిపుణ, సేవ ఇంటర్నేషనల్​సహకారంతో శనివారం నిర్వహించిన మెగా జాబ్​ఫెయిర్​కు విశేష స్పందన లభించింది. తెలంగాణ, ఏపీ నుంచి 50 వేల మందికి పైగా బీటెక్, డిగ్రీ, ఫార్మా స్టూడెంట్లు తరలిరావడంతో క్యాంపస్​ కిక్కిరిసింది. అర కిలోమీటర్​మేర క్యూ లైన్లు కనిపించాయి. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. వర్సిటీ యాజమాన్యం తాగునీరు, టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిరుద్యోగులు అంతా మధ్యాహ్నం వరకు ఎండలోనే నిలబడ్డారు. కొందరు చెట్ల కింద వేచి చూశారు. 

 100కు పైగా కంపెనీలు 20 వేల ఉద్యోగాలు కల్పిస్తాయని ప్రకటనలు ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వీరిలో అమ్మాయిలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. 20కు పైగా ఐటీ, నాన్​ఐటీ కంపెనీలు, 10కి పైగా ఫార్మా, 30కు పైగా కోర్​ఇంజినీరింగ్, 40కు పైగా బ్యాంకింగ్, రిటైల్, మేనేజ్​మెంట్ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొత్తం 52, 243 మంది నిరుద్యోగులు హాజరుకాగా, 3,618 మందికి ఉద్యోగాలు లభించాయని వర్సిటీ యాజమాన్యం ప్రకటించింది. 9,681 మందిని ఆయా కంపెనీలు షార్ట్​లిస్ట్​చేశాయని, మరో 2 వేల మందిని కూడా షార్ట్​లిస్ట్​చేసే చాన్స్​ఉందని చెప్పింది. ఈ జాబ్​ఫెయిర్​ను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జేఎన్టీయూ వీసీ కిషన్​కుమార్​రెడ్డి ప్రారంభించారు. వర్సిటీ రెక్టార్​విజయ్​కుమార్​రెడ్డి, రిజిస్ట్రార్​ వెంకటేశ్వర్​రావు, ఇండస్ట్రీ ఇంటరాక్షన్​ డైరెక్టర్​ రజిని, డిప్యూటీ డైరెక్టర్ సురేష్​కుమార్​పాల్గొన్నారు.