- 2021 నుంచి కల్వకుర్తి పంపుల్లో రెండు రెస్ట్‌లోనే!
- ఈ ఏడాది 20 టీఎంసీలు వృథా
- కల్వకుర్తి కింద ఎండిన 500 చెరువులు
- ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో సరిపడా తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితి
నాగర్‌కర్నూల్, వెలుగు: 2020లో నీటమునిగిన ఎల్లూరు పంపులకు రిపేర్లు చేయించడంలో గత బీఆర్ఎస్సర్కారు చేసిన నిర్లక్ష్యం ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాపై పడింది. 2021 నుంచి రెండు పంపులను పక్కన పెట్టడంతో శ్రీశైలం నుంచి మూడేండ్లలో సుమారు 50 టీఎంసీలను లిఫ్ట్ చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఈసారి కృష్ణాకు వరద లేకపోవడంతో గతేడాది అక్టోబర్30 నాటికే అప్పటి ప్రభుత్వం కేఎల్ఐ పంపులను బంద్ పెట్టింది. దీంతో కల్వకర్తి లిఫ్ట్ స్కీం కింద డిసెంబర్ నాటికే 500 చెరువులు అడుగంటాయి. ఈ క్రమంలో యాసంగిలో 3.15 లక్షల ఎకరాలకు క్రాఫ్ హాలీడే ప్రకటించగా, అడపాదడపా పంటలు సాగుచేసిన రైతులు సగం పంటలను కూడా కాపాడుకోలేకపోయారు. ప్రస్తుతం శ్రీశైలం అడుగంటడంతో అనధికారికంగా ఎల్లూరు నుంచి ఒక పంపు ద్వారా 800 క్యూసెక్కుల చొప్పున రెండు, మూడు రోజులకోసారి నీళ్లు లిఫ్ట్ చేస్తున్నా 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో తాగునీటి అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడింది.
మూడేండ్లుగా రెండు పంపులే దిక్కు..
2020 అక్టోబర్‌లో ఎల్లూరు పంప్‌హౌజ్ నీటమునిగింది. పాలమూరు- రంగారెడ్డి బ్లాస్టింగులే ఇందుకు కారణమనే ఆరోపణలు వచ్చాయి. పేలుడు ధాటికి బేస్ నుంచి విడిపోయిన మూడో పంపు, ప్రొటెక్షన్ వాల్ కూలి ఐదో పంపు దెబ్బతిన్నాయి. డీ వాటరింగ్, రిపేర్ల పేరుతో రూ.3 కోట్లకుపైగా ఖర్చు చేశారు. మొదట పటేల్ కంపెనీకి , తర్వాత మెగా కంపెనీకి పనులు అప్పగించారు. వారు ఈపీపీఎల్ సంస్థకు సబ్‌లీజ్‌కు ఇచ్చారు. సర్జ్‌పూల్, పంప్‌హౌజ్‌ల మధ్య ప్రొటెక్షన్ వాల్ బీటలు వారడంతో ఈ రెండు పంపులను వాడుకునే ఛాన్స్ లేదని మూడేండ్లుగా మూసేశారు. వాస్తవానికి ఎల్లూరు లిఫ్ట్‌లో ఒక్కొక్కటి 800 క్యూసెక్కుల సామర్థ్యమున్న 5 పంపులున్నాయి.
సరిగ్గా నడిపితే కృష్ణాకు వరద వచ్చే రెండు నెలల్లో ప్రతిరోజూ 4 వేల క్యూసెక్కుల నీటి చొప్పున 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే వీలుండేది. కానీ రెండు పంపులు దెబ్బతినడం, మూడో పంపును స్టాండ్‌బైగా ఉంచడంతో మూడేండ్లుగా రోజుకు 1600 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎత్తిపోస్తున్నారు. ఈ రెండు పంపులతో 4.15 టీఎంసీ కెపాసిటీ ఉన్న నాలుగు రిజర్వాయర్లతో పాటు, మూడు జిల్లాల్లోని 500 చెరువులు నింపి 4.50లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్నామని నాటి సర్కారు చెప్తూ వచ్చింది. కానీ వాస్తవంగా ఏ ఏడాది కూడా 25టీఎంసీలకు మించి ఎత్తిపోయలేదు. అంటే మూడేండ్లలో 50టీఎంసీల నీటిని వదిలేశారు. దీంతో ఏనాడూ సగం ఆయకట్టుకు నీళ్లిచ్చిన పాపానపోలేదు.
అటు క్రాఫ్ హాలీడే.. ఇటు తాగునీటి కష్టాలు
ఈసారి కృష్ణాకు ఆశించిన వరద లేకపోవడంతో కేఎల్ఐ కింద యాసంగి సాగునీరు ఇవ్వలేమనే నిర్ణయానికి వచ్చిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అక్టోబర్ 30 నాటికి కేఎల్ఐ పంపులను అధికారంగా బంద్పెట్టింది. నిజానికి యాసంగిలో 3.15లక్షల ఎకరాల సాగునీరివ్వాల్సి ఉండగా, క్రాఫ్ హాలీడే ప్రకటించడంతో రైతులు 1.17లక్షల ఎకరాల్లో పత్తి, మొక్క జొన్న, జొన్న తదితర పంటలు సాగుచేశారు. కానీ, చెరువులు అడుగంటడం, భూగర్బజలాలు పడిపోవడంతో 30శాతానికి పైగా పంటలు ఎండిపోయాయి. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరింది. తెలంగాణ ఇప్పటికే తన అవసరాల కోసం వాటాకు మించి వాడుకున్నదని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేఎల్ఐ నుంచి అధికారికంగా భగీరథకు సైతం నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదు. దీంతో ప్రస్తుతం తాగునీటి అవసరాల కోసం అనధికారికంగా కేఎల్ఐ ఫస్ట్ లిఫ్ట్ నుంచి ఒక మోటార్ ద్వారా క్యూసెక్కుల నీటిని ఎల్లూరు వాటర్‌గ్రిడ్‌ద్వారా గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్ పహడ్, కమ్మదన,రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సప్లై చేస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మిషన్‌భగీరథకు ఈ నీళ్లే ఆధారం. 19 అసెంబ్లీ సెగ్మెంట్లు, 19 మున్సిపాలిటీలు, 3201 గ్రామాలకు తాగునీరు సరఫరా జరగాలి. కానీ, ఎల్లూరు నుంచి నీటిని ఎత్తిపోసుకోలేకపోవడం వల్ల చెరువులు ఎండిపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో భూగర్భజలాలు అడుగంటాయి. దీనికి తోడు వాటర్‌గ్రిడ్‌కు సరిపడా నీరందక తాగునీటి సమస్య మొదలైంది. తీవ్రమైన ఎండలు, ఆవిరి నష్టాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ నెల చివరి కల్లా ఎల్లూరు వద్ద కనీస నీటి మట్టం ఉండే ఛాన్స్ లేదు. దీంతో మే నెలలో అటు ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి ఎద్దడి ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆఫీసర్లు తలపట్టుకుంటున్నారు.