సర్కారీ బ్యాంకులే పల్లెల్ని పలకరించాయ్​!

నెహ్రూ శకం ముగిసిపోయి.. ఇందిరా గాంధీ సంక్షేమ పథకాలు ఆరంభమైన కొత్తలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం బ్యాంకుల జాతీయీకరణ. ఇండియన్​ సోషల్ స్ట్రక్చర్​ను​ సమూలంగా మార్చేసిన నిర్ణయంగా ఇది గుర్తింపు పొందింది. అప్పటికి బలంగా ఉన్న కమ్యూనిస్టులు కూడా దీన్ని సమర్థించారు. దేశంలో 14 బ్యాంకులను జాతీయం చేసి సరిగ్గా 50 ఏళ్లయింది. ఆ జాతీయీకరణ వల్ల దేశానికి మంచి జరిగిందా, చెడు జరిగిందా లేదా ఆర్థికపరంగా ఆ నిర్ణయం సరైనదేనా, లేక కేవలం రాజకీయపరమైన నిర్ణయమా అనే అంశాలపై నేటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెడితే.. 14 బ్యాంకులను జాతీయీకరించాలనే నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ నిర్ణయం మాత్రం కచ్చితంగా సంచలనాత్మకమైనదే. 1969 జూలై 19న 14 బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

90వ దశకం తర్వాత వచ్చిన కొత్త తరపు ప్రైవేట్​ బ్యాంకులు వ్యాపారంలో దూసుకెళ్తున్నా75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పాత్ర ఏమాత్రం మర్చిపోలేనిదే. గ్రామీణ రంగం అభివృద్ధిలో జాతీయ బ్యాంకుల సేవలు చాలా గొప్పవి. లాభసాటిగా ఉండే నగరాలు, పట్టణాల్లో కార్యకలాపాలకే  ప్రైవేట్​ బ్యాంకులు పరిమితమవుతున్నాయి. ఇండియాలో సుమారు 6.50 లక్షల గ్రామాలున్నాయి. రోడ్లు, బస్సులూ లేని రోజుల్లోనే చాలా ఊళ్లలో బ్యాంకింగ్‌ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత ప్రభుత్వ రంగ బ్యాంకులదే.

కొత్త తరం పారిశ్రామికవేత్తల అవతరణలో బ్యాంకింగ్‌ రంగమే ప్రధాన పాత్ర వహిస్తుందనేది మనందరికీ తెలిసిందే. ఆర్థికంగా ఎలాంటి అండదండలూ లేని వ్యక్తులు ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగడంలో బ్యాంకులే బాసటగా నిలుస్తాయి. అలాంటి వందల మంది ఎంట్రప్రెన్యూర్లను దేశానికి కానుకగా ఇచ్చిన ఖ్యాతి ప్రభుత్వ రంగ బ్యాంకులకే దక్కుతుంది. సామాన్యులకు సైతం తక్కువ వడ్డీకి రుణ సదుపాయం అందిస్తున్నది ఈ బ్యాంకులే. ప్రభుత్వ పథకాలను ఆమ్‌ ఆద్మీ ముంగిట చేరుస్తున్నదీ ప్రభుత్వ రంగ బ్యాంకులే.

బ్యాంకుల జాతీయీకరణ నాటికి ఆర్‌బీఐ గవర్నర్‌ ఎల్‌ కే ఝా. ఈయన 1967 జూలై నుంచి 1970 మే దాకా ఆ పదవిలో ఉన్నారు. 14 బ్యాంకుల జాతీయీకరణ సజావుగా ముగిసేలా చూడటంలో కీలక పాత్ర ఝాదే.

టెక్నాలజీని అందిపుచ్చుకుని కస్టమర్లకు సేవలందించే విషయంలో ప్రైవేట్​ రంగ బ్యాంకులు ముందంజ వేసినా కొత్త పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు అడిగినంతనే అప్పులిచ్చి అండగా నిలబడుతున్నది మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులే. అసలు అప్పులే ఇవ్వకపోతే ఇండియాలో ఇంత పారిశ్రామిక ప్రగతి సాధ్యమయ్యేదే కాదేమో.   సరిగ్గా అక్కడే ప్రభుత్వ రంగ బ్యాంకుల దృక్పథంలో తేడా మనకు తెలుస్తుంది. (బ్యాంకుల జాతీయీకరణకు నేటితో 50 ఏళ్లు)

ఆర్థికాభివృద్ధిలో కీలక నిర్ణయం

1947 నాటికి ఇండియాలో బ్యాంకింగ్‌ రంగం దివాలా అంచుల్లో ఉంది. ఒకే ఒక్క కాంతి కిరణం ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. ఇప్పుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మనందరికీ తెలిసిన ఈ ఇంపీరియల్‌ బ్యాంకును 1955 లో జాతీయం చేశారు. స్వతంత్రం వచ్చిన తొలి నాళ్లలో పరిశ్రమలూ అంతంత మాత్రంగానే ఉండేవి. ఇక మౌలిక వసతుల పరిస్థితైతే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డిపాజిట్లు అందరి నుంచీ తీసుకున్నా అప్పులు మాత్రం కొంత మందికే ఇవ్వడానికి బ్యాంకులు అలవాటుపడిపోయాయి. వ్యవసాయ రంగానికైతే అసలు అప్పులు ఇవ్వడానికే బ్యాంకులు ఇష్టపడేవి కావు.  దాంతో ఇండిపెండెంట్‌ ఇండియాగా తలెత్తుకుని రెండు దశాబ్దాలైనా, కొన్ని రంగాల్లో మచ్చుకైనా కనబడని పురోగతిపై సమీక్షలు చేసి, ఆర్థిక రంగంలో పెను మార్పులు తెస్తేనే వృద్ధి సాధ్యమవుతుందనే నిర్ణయానికి ఇందిరా గాంధీ వచ్చారు. ఫలితంగానే దశలవారీగా బ్యాంకుల జాతీయీకరణ అమలు చేయాలని భావించారు.