జాబిలిపై తొలి అడుగుకి 50 ఏళ్లు

జాబిలిపై తొలి అడుగుకి 50 ఏళ్లు

జాబిల్లి పై మనిషి అడుగు పెట్టి ఇవాళ్టికి  సరిగా 5‌‌0 ఏళ్లు.  చీకటిపడ్డాక ఆకాశంలోకి వచ్చి చల్లదనాన్ని పంచే చంద్రుడు అంటే మనిషికి చాలా ప్రేమ. కవులైతే  ఇక చెప్పక్కర్లేదు. చందమామ అంటూ పాటలు రాశారు. కవిత్వం ఒలికించారు. పిల్లాడు మారాం చేస్తే ఆకాశంలో ఉన్న  చందమామను చూపించి తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది. మనిషి  డైలీ లైఫ్ లో జాబిల్లి పెనవేసుకుపోయింది. చంద్రుడు అంటే మనిషికి మొదటి నుంచి ఆసక్తే. ఈ ఆసక్తే పరిశోధనలకు దారితీసింది. ఈ పరిశోధనలే రకరకాల రాకెట్ లను రోదసి లోకి పంపేలా చేసింది. దీంతో మనిషి సంతృప్తి పడలేదు. చంద్రుడిమీద కాలు పెట్టాలని డిసైడ్ అయ్యాడు.

చంద్రుడిమీద కాలు పెట్టడం అంటే మాటలా …? భూమికి 3,84,403 కిలోమీటర్ల దూరాన జాబిల్లి ఉంటుంది. అయినా మనిషి వెనక్కి తగ్గలేదు. పరిశోధనలకు పదును పెట్టాడు. ఈ పరిశోధనల్లో  భాగంగా ‘ అపోలో –11’ అంతరిక్ష నౌక చంద్రుడి వైపు దూసుకుపోయింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్,  బజ్ ఆల్​డ్రిన్​ అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహాన్ని చేరుకున్నారు. అమెరికా వ్యోమగామి  నీల్ ఆర్మ్​ స్ట్రాంగ్ 1969 జులై 21న చంద్రుడి మీద అడుగుపెట్టాడు. ఈ అద్భుతాన్ని  భూమ్మీద ఉన్న 65 కోట్ల మంది ప్రజలు టీవీల ద్వారా చూశారు. నీల్ ఆర్మ్​ స్ట్రాంగ్ అడుగు పెట్టిన 19 నిమిషాల తర్వాత అపోలో –11 లో ఉన్న మరో  వ్యోమగామి బజ్ ఆల్​డ్రిన్​ చంద్రుడి మీద కాలు పెట్టాడు. వాళ్లిద్దరూ దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాలు  చంద్రుడి పై గడిపారు. జాబిల్లి పై అమెరికా జెండా పాతారు. మట్టి, రాళ్ల నమూనాలను సేకరించారు. భవిష్యత్ పరిశోధనలకు అవసరమైన ఫొటోలను తీసుకున్నారు. అక్కడ్నుంచే  అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ తో మాట్లాడారు.

మూన్ రేస్​లో విజేతగా నిలిచిన అమెరికా

చంద్రుడిపైకి వెళ్లిన ముగ్ గురు ఆస్ట్రో నాట్స్ నీల్ ఆర్మ్ స్ట్రాం గ్, బజ్ అల్ డ్రిన్ , మైఖేల్ కొలిన్స్ (ఫైల్ ఫొటో)

1950ల నాటికి రెండు పెద్ద దేశాలైన సోవియట్ యూనియన్​, అమెరికా మధ్య అన్ని రంగాల్లోనూ హోరాహోరీ పోరు ఉండేది. స్పేస్ రీసెర్చ్​లో కూడా ఇది కొనసాగింది.  రెండు దేశాలు పోటీలు పడి పరిశోధనలు చేసేవి. జాబిల్లిపై  పరిశోధనలు ముందుగా మొదలెట్టింది అప్పటి సోవియట్ రష్యానే.  1959 నాటికి చంద్రుడు ఒక మిస్టరీ. చంద్రమండలంపై ఏముందో, అక్కడి వాతావరణ పరిస్థితులేమిటో ఎవరికీ అంచనా లేదు. దీంతో  జాబిల్లి మిస్టరీని సాల్వ్​ చేయడానికి సోవియట్ అడుగు ముందుకేసింది.1959 సెప్టెంబరులో  లూనిక్–2’ శాటిలైట్​ని  చంద్రమండలం మీదకు పంపించింది. లోపల 391 కిలోల బరువున్న టెక్నికల్ ఎక్విప్​మెంట్​ని సెట్ చేసింది. ‘లూనిక్–2’ శాటిలైట్ జాబిల్లిపై సక్సెస్​ఫుల్​గా దిగింది. చంద్రుడిపై అప్పటివరకు జరిగిన పరిశోధనల్లో ఇదో మైలురాయి. ‘లూనిక్–2’ ఇచ్చిన స్ఫూర్తితో  ‘లూనిక్–3’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. రిమోట్ కంట్రోల్ సాయంతో శాటిలైట్​లో సెట్ చేసిన కెమెరాతో చంద్రుడి ఉపరితలానికి సంబంధించి 29 ఫొటోలు తీశారు. చంద్రుడి మీద ఏముందో ప్రపంచానికి తెలియచేసింది ఈ ఫొటోలే. ఈ ఫొటోలను  సోవియట్ తమ దేశంలో టీవీల్లో ప్రసారం చేసింది. ఈ పరిస్థితుల్లో  రష్యాను మించిపోవాలని అమెరికా డిసైడ్ అయింది. ‘చంద్రుడి పైకి మనిషిని ఎగరవేస్తామ’ని 1962లో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నడీ అన్నారు. అది నిజం కావడానికి పదేళ్లు పట్టింది.  ముగ్గురు ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బజ్ ఆల్​డ్రిన్​, మైఖేల్ కొలిన్స్ ను తీసుకుని 1969 జూలై 16న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి శాటర్న్ వీ రాకెట్​ ద్వారా ‘అపోలో–11 ’ స్పేస్​ క్రాఫ్ట్​ చంద్రుడి పైకి రివ్వున దూసుకుపోయింది.

ఉత్కంఠగా చూసిన ప్రపంచం

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ నాసా ’ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ జాబిల్లి యాత్ర అనుక్షణం ఉత్కంఠగా సాగింది. చంద్రుడి మీద మనిషి కాలుపెట్టడం అనేది అసలు సాధ్యమేనా’ అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఈ యాత్రను ఊపిరి బిగబట్టి చూసింది. ఆర్మ్​స్ట్రాంగ్​ చంద్రుడిపై తొలి అడుగు వేయగానే ప్రపంచం నివ్వెరపోయింది. జాబిల్లి యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని 1969 జూలై 24న ముగ్గురు ఆస్ట్రోనాట్స్ భూమ్మీదకు సురక్షితంగా చేరుకున్నారు.

అంతకుముందు ఏం జరిగింది?

‘మెర్క్యురీ ప్రోగ్రామ్’ పేరుతో దఫదఫాలుగా  కక్ష్యలోకి  మనుషులను పంపడం, వారిని  సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే కార్యక్రమాన్ని  అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టింది. ఆ తర్వాత జాబిల్లి పైకి మనుషులను పంపడానికి  సన్నాహాలు మొదలెట్టింది. చంద్రుడి పైన పరిస్థితులను అంచనా వేయడానికి ‘రేంజర్’ పేరుతో వరుసగా రాకెట్లు పంపింది. చంద్రుడి ఉపరితలం ఫొటోలు తెచ్చుకుంది. ఈ ఫొటోల ఆధారంగా చంద్రుడి ఉపరితలం  పరిస్థితులపై  సైంటిస్టులు ఒక అంచనాకు వచ్చారు. చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్​ల  ల్యాండింగ్​కి అనువైన స్థలాన్ని ఫిక్స్ చేసుకున్నారు. అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడానికి వీలుగా రాకెట్ నిర్మాణానికి మెరుగులు దిద్దారు.

1969 జాబిల్లి యాత్ర ఫెయిలైతే…

చంద్రుడిమీద కాలుపెట్టిన తొలి మానవుడు నీల్ ఆర్మ్​స్ట్రాంగ్ 2012లో చనిపోయారు. ఆయనతో పాటు చంద్రుడిపై దిగిన బజ్ ఆల్​డ్రిన్ ఇప్పటికీ ఉన్నారు. జాబిల్లి పైకి నీల్ ఆర్మ్​స్ట్రాంగ్ టీం యాత్ర చేసి 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా లేటెస్ట్​గా కెన్నడీ స్పేస్ సెంటర్​లో ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన ఆస్ట్రోనాట్​ మైఖేల్ కలిన్స్ మాట్లాడుతూ అప్పట్లో చంద్రమండలానికి తాము చేసిన యాత్ర ఎనిమిది రోజుల్లోనే విజయవంతంగా ముగిసిందన్నారు. అదే యాత్ర ఫెయిలై, అపోలో–11లో వెళ్లినవారు తిరిగి రాకపోతే ఎలా అనే విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని కలిన్స్ చెప్పారు.

ఎవరీ నీల్ ఆర్మ్​స్ట్రాంగ్

నీల్ ఆర్మ్​స్ట్రాంగ్ సొంతూరు అమెరికాలోని ఒహాయో. 1930 ఆగస్టు 5న పుట్టారు. పర్డ్యూ యూనివర్శిటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. కొరియాతో యుద్ద సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు పైలెట్​గా ఉన్నారు. 1962 లో నాసాలో చేరారు. జెమినీ–8 మిషన్​కి కమాండ్ పైలెట్​గా పనిచేశారు. 2012లో అనారోగ్యంతో  సిన్ సిన్నాటిలో చనిపోయారు.

చంద్రుడి మీద జెండా ఎలా రెపరెపలాడింది?

సాధారణంగా చంద్రుడిపై గాలి ఉండదు. అయితే  అమెరికా ఆస్ట్రోనాట్​లు చంద్రుడిపై జెండా పాతినప్పుడు అది రెపరెపలాడింది. టీవీల్లో ఈ అపూర్వ ఘట్టాన్ని చూస్తున్న కోట్లాదిమంది దీనిని చూశారు. దీంతో  అసలు వాతావరణం అంటూ ఏమీ లేని చంద్రుడి ఉపరితలంపై  జెండా పాతడం ఏంటి….? అది రెపరెపలాడటం ఏంటి? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. జాబిల్లిపై  గాలి లేదన్న  విషయంలో రెండో అభిప్రాయం లేదన్నారు సైంటిస్టులు. అది జెండాను పాతినప్పుడు అది కదిలి  ఉంటుందన్నారు. జెండాను పాతడానికి చంద్రుడి మీద రంధ్రం చేయడానికి  జెండా కర్రను ఆస్ట్రోనాట్స్ అటూ ఇటూ తిప్పినప్పుడు జెండా కదిలినట్లు  వీడియోలో కనిపించిందని సైంటిస్టులు వివరణ ఇచ్చారు.

మన దేశంలోనూ జై కొట్టారు

జాబిల్లి మీద మనిషి కాలు పెట్టిన అపూర్వ ఘట్టం నేపథ్యంలో ఇండియా ఒక ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది. నవంబర్ 19న ఈ స్టాంప్ రిలీజ్ అయింది. “మానవాళి చరిత్రలో  ఇదొక అద్భుత సంఘటన” అని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కామెంట్ చేశారు.  “మనిషి సాధించిన ఈ అద్భుత విజయం స్ఫూర్తితో భూమిని శాంతి మండలంగా చేయడానికి అందరం  కృషి చేద్దాం” అని ఆమె అన్నారు.  నీల్ ఆర్మ్​స్ట్రాంగ్ టీం సాధించిన విజయం నేపథ్యంలో ‘ఫైట్ టు మూన్’ పేరుతో రేడియోలో ఓ డిస్కషన్ నిర్వహించారు.  జూలై 23న ప్రసారమైన ఈ డిస్కషన్​లో అప్పటి ప్లానింగ్ కమిషన్ మెంబర్ బీ.డీ.నాగ్ చౌధురి, ఫిజిస్ట్ ఎస్.సీ.జైన్, మరో సైంటిస్ట్ వీ.జీ.భిండే, ఢిల్లీ యూనివర్శిటీ  ప్రొఫెసర్ ఎఫ్. సీ.అలుక్ పాల్గొన్నారు. అలాగే ఆగస్టు 7న ‘సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాన్స్ ఫుట్ స్టెప్స్ ఆన్ ది మూన్’ పేరుతో  ఫిల్మ్స్ డివిజన్ ఒక న్యూస్ రీల్​ తయారు చేసింది. కోట్లాది మంది ఈ న్యూస్ రీల్​ని ఎంతో ఆసక్తిగా చూశారు.

ఈ చిన్న అడుగు …మానవాళి వేస్తున్న అతి పెద్ద ముందడుగు

అది 1969 జూలై 21. చంద్రుడి మీద కాలు మోపుతూ “ మనిషి వేస్తున్న ఈ చిన్న అడుగు ….మానవాళి వేస్తున్న ఓ అతి పెద్ద ముందడుగు (దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జెయింట్ లీప్ ఫర్ మ్యాన్​కైండ్)’’ అని కామెంట్ చేశారు. ఆర్మ్ స్ట్రాంగ్ ఆనాడు చేసిన కామెంట్ స్ఫూర్తితో  ఆ తర్వాత అన్ని దేశాలు జాబిల్లిపై  పరిశోధనలు మొదలెట్టాయి. అంతరిక్ష పరిశోధనలో దూసుకెళ్లాయి.

ఇప్పటికీ  కనిపిస్తున్న  పాదముద్ర

50 ఏళ్ల కిందట చంద్రుడి మీద నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ వేసిన తొలి పాద ముద్ర ఇప్పటికీ  చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది.  అయితే అది బజ్​ అల్​డ్రిన్​దని అంటారు.  చంద్రుడి మీద గాలి లేకపోవడంతో వ్యోమగాముల అడుగుజాడలు ఇప్పటికీ చెరిగిపోలేదంటున్నారు సైంటిస్టులు. అదొక్కటే కాదు అనేక అపోలో మిషన్లు చంద్రుడి మీద ల్యాండ్ అయినచోట్ల ఏర్పడ్డ గుర్తులు కూడా ఇప్పటికీ కనిపిస్తున్నాయి.  ఇండియాతో పాటు అనేక దేశాలకు చెందిన శాటిలైట్లు కూడా ఈ గుర్తులను, పాద ముద్రలను గుర్తించాయి. అయితే జాబిల్లిపై ఆర్మ్​స్ట్రాంగ్, అల్ట్రిన్ పాతిన జెండా మాత్రం లేదు. అంతరిక్ష నౌక బయల్దేరి వచ్చేటప్పుడు వెలువడ్డ గాలికి అది కాలిపోయిందన్నది సైంటిస్టుల కథనం.

సక్సెస్ వెనుక లక్షలాది మంది

అపోలో–11 మిషన్ విజయవంతం కావడం వెనుక దాదాపు లక్షలాది మంది శ్రమ దాగి ఉంది. ‘నాసా’ సిబ్బంది సహా ఇంజనీర్లు, సైంటిస్టులు, కంప్యూటర్ ప్రోగ్రామర్లతో పాటు స్పేస్ సూట్​లు తయారు చేసేవారు, కమ్యూనికేషన్ గ్రౌండ్ స్టేషన్లలో పనిచేసే లక్షలాది మంది ఉన్నారు. మానవాళి చరిత్రలో ఒక అపూర్వ ఘట్టాన్ని విజయవంతం చేయడం కోసం వీరంతా రాత్రనక, పగలనక కష్టపడ్డారు.

సాంకేతిక పరికరాలను చంద్రుడిపైనే ఉంచిన ఆస్ట్రో నాట్స్

నీల్ ఆర్మ్ స్ట్ రాంగ్ టీం తమ యాత్రను విజ-యవంతంగా పూర్తి చేసుకున్న తర్వా త భూ-మ్మీదకు తిరిగి వచ్చే ముం దు కొన్ని ముఖ్య-మైన సాంకే తిక పరికరాలను చంద్రుడి మీదేవదిలి వచ్చారు. తర్వా తి కాలంలో జాబిల్లికిసంబంధించి న ఎంతో విలువైన సమాచారా-న్ని ఈ ప్రయోగ పరికరాలు సైంటిస్టు లకుఅందచేశాయి. 1969 నాటి ఎక్వి ప్ మెంట్లోకొన్ని ఇప్పటికీ పనిచేయడం విశేషం.