NSUI కి 50 ఏండ్లు

కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ వింగ్ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌‌యూఐ) ప్రారంభమై 50 ఏండ్లు గడిచిపోయింది. 1971 ఏప్రిల్‌‌లో పుట్టిన ఎన్ఎస్‌‌యూఐ అప్పటికే కొన్నేండ్లుగా స్టూడెంట్ పాలిటిక్స్‌‌లో ఎంతో బలంగా ఉన్న ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్‌‌ యూనియన్లను ఎదుర్కొని చాలా వేగంగా ఎదిగింది. కాంగ్రెస్ పార్టీలో యువత అడుగుపెట్టి, ఆ తర్వాత బలమైన నాయకులుగా ఎదగడంలో యూనియన్ కీ రోల్ ప్లే చేసింది. ఇటువంటి విభాగాలను మళ్లీ బలోపేతం చేసుకోగలిగితేనే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుంది.

కాంగ్రెస్‌‌లో చీలిక తర్వాత..

1969లో కాంగ్రెస్‌‌లో ఎదురైన క్రైసిస్ కారణంగా పార్టీ రెండుగా చీలిపోయింది. అటు నీలం సంజీవరెడ్డి, ఇటు ఇందిరా గాంధీల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరు కుంపట్లు మొదలయ్యాయి. తనకు అత్యంత విధేయులుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్‌‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, హేమ్‌‌వతి నందన్ బహుగుణను జనరల్ సెక్రటరీగా ఇందిర నియమించారు. ఆ తర్వాత 1971లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. నాటి క్రైసిస్‌‌ను ఎదుర్కొని నిలిచిన కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరని పునాది వేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.  దేశంలో యువతరం కాంగ్రెస్ భావజాలాన్ని మర్చిపోకుండా చేసే విభాగం ఉండాలని పార్టీ లో చర్చలు సాగుతున్న  తరుణంలో వచ్చిన ఆలోచనే స్టూడెంట్ వింగ్ స్థాపన. ఈ ఆలోచన వెనుక నాడు బహుగుణతో పాటు బ్రిజ్ మోహన్ భామా వంటి నేతలు ఉన్నారు. 1971 ఏప్రిల్ 9న నేషనల్ యూనియన్ ఆఫ్ స్టూడెంట్స్ (ఎన్‌‌యూఎస్) పేరుతో కాంగ్రెస్ విద్యార్థి విభాగాన్ని ఇందిరా గాంధీ ప్రారంభించారు. రంగరాజన్, ప్రియ రంజన్ దాస్ మున్షీ, వాయలార్ రవి, బ్రిజ్ మోహన్ భామా.. నలుగురూ ఈ యూనియన్ ఫౌండింగ్ మెంబర్స్‌‌గా ఉన్నారు. అయితే 1972–73 మధ్యన యూనియన్ పేరును నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌‌యూఐ)గా మార్చారు. దీనికి తొలి అధ్యక్షుడిగా రంగరాజన్‌‌ను నియమించారు. హరికేశ్ బహదూర్, కేసీ జోసెఫ్, ప్రదీప్ భట్టాచార్యలను జనరల్ సెక్రటరీలుగా అపాయింట్ చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రామ్ కుమార్ భార్గవను జనరల్ సెక్రటరీగా, రోహిత్ బల్ వోహ్రాను సెక్రటరీగా, రామన్ చోప్రాను ఆఫీస్ సెక్రటరీగా నియమించి ఎన్ఎస్‌‌యూఐ వర్కింగ్ కమిటీని మరింత బలోపేతం చేశారు.

ఎన్ఎస్‌‌యూఐ నుంచి ఎందరో నేతలు..

1971కి ముందే స్టూడెంట్ పాలిటిక్స్‌‌లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) వంటివి యాక్టివ్‌‌గా ఉంటూ యువతలోకి చొచ్చుకుని వెళ్తున్నాయి. వాటిని ఎదుర్కొని దీటుగా కాంగ్రెస్ పార్టీని కూడా స్టూడెంట్ పాలిటిక్స్‌‌లో బలంగా మార్చడంలో పలు యూనివర్సిటీల్లో చదువుకుంటున్న యువకులు కీ రోల్ ప్లే చేశారు. అలా నాడు ఎన్ఎస్‌‌యూఐలో చేరిన పలువురు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా ఎదిగారు. ఎన్‌‌ఎస్‌‌యూఐ తొలి ప్రెసిండెంట్‌‌గా చేసిన రంగరాజన్ కుమారమంగళం కాంగ్రెస్‌‌ పార్టీలో పదవులతో పాటు కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. అలాగే కేసీ జోసెఫ్, హరికేశ్ బహదూర్, అశోక్ గెహ్లాట్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, రమేశ్ చెనితాల, అజయ్ మాకెన్, మనీశ్ తివారీ లాంటి ఎందరో నేతలు ఈ స్టూడెంట్ యూనియన్ నుంచే ఎదిగారు. ఎన్‌‌ఎస్‌‌యూఐను రంగరాజన్ కుమార మంగళం తర్వాత మోహన్ గోపాల్, గీతాంజలీ మాకెన్, దీపక్ మల్హోత్రా, ఆనంద్ శర్మ, ఇమ్రాన్ కిద్వాయ్ వంటి వారు లీడ్ చేశారు. 

నేటి రాజస్థాన్ సీఎం..

గతంలో కేంద్ర మంత్రిగా చేసి, ప్రస్తుతం రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్‌‌ కూడా కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్‌‌ నుంచే ఈ స్థాయికి వచ్చారు. ఆయన నాడు రాజస్థాన్ స్టేట్‌‌ ఎన్‌‌ఎస్‌‌యూఐ చీఫ్‌‌గా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి ఎన్‌‌ఎస్‌‌యూఐ నేషనల్ సెక్రటరీగా ఉన్న రోహిత్ బల్ వోహ్రా జైపూర్ వరకూ కారులో వెళ్లి ఆయనకు అపాయింట్‌‌మెంట్ లెటర్‌‌‌‌ను అందజేశారు. దీనిని గెహ్లాట్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయంగా చెబుతుంటారు. వోహ్రా 2011లో మరణించినప్పుడు జైపూర్‌‌‌‌ నుంచి వెళ్లి ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని గెహ్లాట్ గుర్తు చేసుకున్నారు.

మహారాష్ట్రలో శరద్ పవార్..

ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో పవర్‌‌‌‌ఫుల్ లీడర్‌‌‌‌గా ఉన్న శరద్ పవార్ కూడా ఎన్ఎస్‌‌యూఐ నుంచి వచ్చిన వారే. తొలినాళ్లలో మహారాష్ట్రలో పవార్‌‌‌‌తో పాటు నాసిక్‌‌రావ్ తిరుపుడే, సతీశ్ చతుర్వేది లాంటి వారు యూనియన్‌‌ను ముందుండి నడిపించారు. ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ బేస్ అయిన నాగ్‌‌పూర్‌‌‌‌లో ఏబీవీపీని ఓడించి, నాగ్‌‌పూర్  యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌‌గా తొలిసారి సతీశ్ చతుర్వేది విజయం సాధించారు. అలాగే భోపాల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్‌‌గా గీతాంజలీ మాకెన్ గెలిచారు.

1974–75లో ఢిల్లీ వర్సిటీలో జైట్లీపై పోటీ

కొత్తగా స్టూడెంట్ పాలిటిక్స్‌‌లోకి అడుగుపెట్టిన కాంగ్రెస్ ఒక్కో యూనివర్సిటీలో బలంగా ఎదుగుతూ వచ్చింది. తొలిసారి 1973–74 అకడమిక్ ఇయర్‌‌‌‌లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్‌‌లో ఎన్ఎస్‌‌యూఐ బరిలోకి దిగింది. ఆ ఏడాది మూల్ చంద్ శర్మ పోటీ చేసినప్పటికీ ఏబీవీపీ నేత అలోక్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1974–75లో ఏబీవీపీ నుంచి అరుణ్ జైట్లీ బరిలో నిలవగా.. ఆయనపై ఎన్‌‌ఎస్‌‌యూఐ ఫౌండింగ్ మెంబర్ బ్రిజ్ మోహన్ భామా పోటీ చేసి బలమైన పోటీ ఇవ్వగలిగారు. ఆ తర్వాత ఢిల్లీ ఎన్ఎస్‌‌యూఐని దీపక్ మల్హోత్రా, ప్రేమ్ స్వరూప్ నయ్యర్, విజయ్ లోచవ్, కేవల్ కృష్ణన్ హందా, కవితా మెహ్రా, సునీల్ చోప్రా, మెహమూద్ జియా వంటి నేతలు బలోపేతం చేశారు.  ఢిల్లీ యూనివర్సిటీలో తొలిసారి 1978లో హరి శంకర్ విజయంతో ఎన్‌‌ఎస్‌‌యూఐ జెండా ఎగిరింది. అయితే ఆ ఏడాది ఏబీవీపీ నుంచి పోటీ చేసిన సురేందర్ పుష్కర్ణ తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కాంగ్రెస్‌‌కి ఎంతో విశ్వాసంగా ఉన్న బలమైన నేత అయిన హరిశంకర్‌‌‌‌ను హైకమాండ్ ఢిల్లీ రాజకీయాల్లో పరిగణనలోకి తీసుకోకపోవడం ఎప్పటికీ మిస్టరీనే. వాస్తవానికి ఆయన క్యాలిబర్ పార్టీకి ఎంతో ఉపయోగపడి ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీలో 1985 నుంచి ఎన్‌‌ఎస్‌‌యూఐ హవా కొన్నేండ్ల పాటు సాగింది. ఆ ఏడాది అజయ్ మాకెన్, ఆ తర్వాత మదన్ సింగ్ బిస్త్ లాంటి నేతలు ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్స్‌‌గా గెలిచారు. 

ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్‌‌ని నిలబెట్టుకుంటేనే

కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ పుట్టి 50 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఏప్రిల్‌‌ 9న ఆ పార్టీ ఢిల్లీలో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించింది. ఈ విభాగాన్ని ప్రారంభించిన ఇందిరా గాంధీతో పాటు ఫౌండింగ్ మెంబర్‌‌‌‌గా ఉన్న బ్రిజ్ మోహన్ భామా ఫొటో ఉన్న పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేసింది. ఈ వేడుకల సందర్భంగానైనా కాంగ్రెస్ తన పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ అయిన స్టూడెంట్స్, యూత్ వింగ్స్‌‌ లాంటివాటిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఈ వేడుకల్లో ఆ విభాగాల్లో పని చేసిన మాజీ నేతలను ఆహ్వానించి, నాడు ఆయా వింగ్స్​ పని చేసిన తీరును, మళ్లీ యువతలోకి చొచ్చుకుని వెళ్లడానికి పాటించాల్సిన స్ట్రాటజీలను చర్చించాలి. ఎన్‌‌ఎస్‌‌యూఐను ఒక బలమైన యూనియన్‌‌గా తీర్చిదిద్దడంలో నాటి నేతల అనుభవాలను వాడుకుని ఈ ఫ్రంట్‌‌ లైన్ ఆర్గనైజేషన్స్‌‌ను గట్టిగా నిలబెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ దేశంలో ఒక ప్రభావవంతమైన శక్తిగా మారుతుంది.

పంకజ్ వోహ్రా, సీనియర్ జర్నలిస్ట్