కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..గుంతల్లోరూ.500 కోట్లు

కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం..గుంతల్లోరూ.500 కోట్లు

సిటీలో రహదారుల నిర్మాణానికి, రిపేర్ల కోసం బల్దియా ఏటా 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. సరైన నాణ్యత పాటించకపోవడం వల్ల చిన్నపాటి వానలకే రోడ్లపై గుంతలు తేలుతున్నాయి. వాహనదారులు, ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం చూపుతున్నాయి. నగరంలో 9,100  కిలో మీటర్ల పొడవైన రోడ్లుండగా.. 2018 ఏప్రిల్ 1  నుంచి  2019  మార్చి 31 దాకా జరిగిన పనుల్లో సగం నాసిరకమేనని క్వాలిటీ కంట్రోల్​ విభాగం తేల్చి చెప్పింది. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా నాణ్యత పాటించడంలో జీహెచ్‌‌ఎంసీ విఫలమవుతోందన్న ఆరోపణలొస్తున్నాయి.

హైదరాబాద్‌, వెలుగుచిన్నపాటి వర్షం పడినా చిత్తడిగా మారే రోడ్లు. అడుగడుగునా కనిపించే గుంతలు. హైదరాబాద్‌ సిటీలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. గల్లీల్లోనే కాదు మెయిన్‌ రోడ్ల పైనా ఇదే దుస్థితి. వేసిన రెండు మూడు నెలలకే రహదారులు దెబ్బతింటున్నాయి. సాధారణ వర్షానికే అడుగులోతు గుంతలు పడుతున్నాయి. నగరంలో ప్రయాణం నరకప్రాయమైంది. రోడ్లు సరిగా లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిటీలో ఇకపై గుంతలు కనిపించవంటూ పాలకుల హామీలు మాటలకే పరిమితమయ్యాయి. సిటీలో గుంత చూపిస్తే ఒక్కో గుంతకు రూ.వెయ్యి ఇస్తామన్న నేతల హామీ హాస్యాస్పదమైంది. హైదరాబాద్‌లో గుంతలు చూపించి కోటీశ్వరులు కావొచ్చంటూ జనం సోషల్‌ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు. నిర్మాణ రంగంలో అత్యంత ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ సరైన రోడ్లు వేయడంలో ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ విఫలమవుతోంది.  ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి సాగిస్తున్న అవినీతి, నిర్లక్ష్యానికి ఫలితాలే ఈ గుంతలు.  నిర్మించిన రోడ్లలో 50 శాతం నాణ్యత లేనివేనని బల్దియా క్వాలిటీ కంట్రోల్‌ విభాగమే తేల్చింది. కానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏటా ఇదే తంతు. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు.

సిటీలో 4 వేల గుంతలు

నాలుగు రోజులుగా వర్షాలకు సిటీ రోడ్లపై నాలుగు వేల గుంత‌లు ఏర్పడగా 987 ర‌హ‌దారులు తీవ్రంగా దెబ్బతిన్నట్టు  ఇంజినీరింగ్ అధికారులు ప్రాథ‌మిక స‌ర్వేలో తేల్చారు. ఈ గుంత‌ల‌ను పూడ్చేందుకు రూ.50 కోట్లను మంజూరు చేయాల‌ని బల్దియా నిర్ణయించింది. నిర్మించే రోడ్లు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వేస్తున్నట్టుగా ఉంది. రోడ్లు వేసిన కొన్ని నెలలకే దెబ్బ తింటున్నాయి.  నాణ్యత పాటించకుండా మళ్లీ మళ్లీ రోడ్లు వేస్తూ ప్రజాధనం వృథా చేస్తున్నారు.

నాణ్యత లేని రోడ్లు

సిటీలో 9,100  కి.మీ. పొడవైన రోడ్లు ఉన్నాయి. వీటి నిర్మాణం, రిపేర్ల కోసం ఏటా రూ.500 కోట్లు  వెచ్చిస్తున్నారు. కానీ రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. అధికారులకు ముడుపులు, కార్పొరేటర్లకు కమిషన్లు ఇస్తూ  నాణ్యత పాటించడం లేదు. ఏడాది మొత్తం చేపట్టిన  పనుల్లో  సగం పనులు నాసిరకమే అని తేలింది. 2018 ఏప్రిల్ 1  నుంచి  2019  మార్చి 31 వరకు  చేపట్టిన పనులను  క్వాలిటీ కంట్రోల్ విభాగం పరిశీలనలో నాణ్యత లేమి బయటపెట్టినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం లేదు.  కాంట్రాక్టర్లు  ఎలాంటి ముడి సరుకు వాడుతున్నారు? పనులపై పర్యవేక్షణ గాలికి వదిలేశారు. దీంతో కాంట్రాక్టర్లు  తూతూమంత్రంగా పనులు చేస్తున్నారు.  పనులు నాసిరకంగా ఉండటంతో త్వరగా దెబ్బతింటున్నాయి. మళ్లీ మళ్లీ రిపేర్లు చేసి దండుకుంటున్నారు.  ఉన్నతాధికారులు విచారణ జరిపి కాంట్రాక్టర్లు,  బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.