
రంగారెడ్డి జిల్లా రావినారాయణరెడ్డి కాలనీలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూర్ శివారు రావినారాయణ రెడ్డి కాలనీ సమీపంల్లోని గుడిసెల్లో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 500 గుడిసెలు కాలిపోయాయి. గుడిసెల వాసులు కూలీ పనులకు వెళ్లడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందడంతో హయత్ నగర్ అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్లతో వెళ్లి మంటలను ఆర్పారు. వివరాల్లోకి వెళ్తే.. సుమారు 100ఎకరాల భూదాన్ భూమిలో సీపీఐ ఆధ్వర్యంలో పేదలు 8 వేల గుడిసెలు వేసుకొని, కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి.
వందలాది గుడిసెలు క్షణల్లో కాలి బూడిదయ్యాయి. కొన్ని గుడిసెల్లోకి గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నగదు, దుస్తులు, వంటసామగ్రి, పిల్లల పుస్తకాలు కాలిపోగా.. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, ఏసీపీ కాశిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్ తెలిపారు. పోలీస్ ఉన్నతాధికారులు, నాయకులు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఓ గుడిసెలో దేవుడి వద్ద పెట్టిన దీపం మంటలు చెలరేగాయని, తద్వారా గుడిసెలకు అంటుకుని, గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు లేచాయని ప్రాథమిక అంచానకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.