- పాక్ నుంచి 55 మంది టెర్రరిస్టుల చొరబాటు
- ఏరివేతకు వ్యూహాత్మకంగా బలగాల మోహరింపు
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఏరివేతకు ఇండియన్ ఆర్మీ 500 మంది పారామిలిటరీ స్పెషల్ కమెండోలను రంగంలోకి దింపింది. పాకిస్తాన్ నుంచి సుశిక్షితులైన 50 నుంచి 55 మంది టెర్రరిస్టులు జమ్మూలోకి చొరబడ్డారని, ఈ ప్రాంతంలో మళ్లీ టెర్రరిజాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఇంటెలిజెన్స్ సమాచారం అందిన నేపథ్యంలో ఆర్మీ వ్యూహాత్మకంగా బలగాలను మోహరించినట్టు శనివారం రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
జమ్మూలో టెర్రరిస్టులకు మద్దతు ఇచ్చే ఓవర్ గ్రౌండ్ వర్కర్లు, ఇతర వనరులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలిపారు. జమ్మూలో పాకిస్తాన్ టెర్రరిస్టుల యాక్టివిటీస్‌కు అడ్డుకట్ట వేసేందుకు దాదాపుగా 3,500 నుంచి 4000 మంది బలగాలను కూడా ఆయా ప్రాంతాల్లో మోహరించినట్టు చెప్పారు. అధునాతన ఆయుధాలు, కమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్లతో చొరబడిన టెర్రరిస్టులను వెతికి, తుదముట్టించేందుకు చేపట్టాల్సిన స్ట్రాటజీలపైనా ఆర్మీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు.
టెర్రరిజం కార్యకలాపాల నిరోధానికి ఇప్పటికే ఇన్ఫాంట్రీ డివిజన్లతోపాటు రాష్ట్రీయ రైఫిల్స్, రోమియో అండ్ డెల్టా ఫోర్సెస్ కూడా పని చేస్తున్నాయన్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా ఈ ప్రాంతంలో తమ యంత్రాంగాన్ని పటిష్టం చేశాయని పేర్కొన్నారు.