రాష్ట్ర యువతకు జపాన్‌‌లో 500 ఉద్యోగాలు.. టెర్న్​, రాజ్​ గ్రూప్​ జపనీస్ సంస్థలతో టామ్‌‌కామ్​ ఒప్పందం

రాష్ట్ర యువతకు జపాన్‌‌లో 500 ఉద్యోగాలు.. టెర్న్​, రాజ్​ గ్రూప్​ జపనీస్ సంస్థలతో టామ్‌‌కామ్​ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు:  రాష్ట్ర యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు అందించేందుకు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్​ మ్యాన్‌‌‌‌‌‌‌‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌‌‌‌‌‌‌‌కామ్) జపాన్‌‌‌‌‌‌‌‌లోని టెర్న్​, రాజ్​ గ్రూప్​ సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నది. ఈ ఒప్పందాలు ఒకటీ రెండేండ్లలో  సుమారు 500 ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర యువతకు అందించనున్నాయి. 

జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్​ రెడ్డి  తెలంగాణ రైజింగ్​ బృందం టెర్న్ గ్రూప్ (టీజీయూకే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్), రాజ్ గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపి ఈ ఒప్పందాలను ఖరారు చేసింది. టోక్యోలో శనివారం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.  దీంతో  రెండేండ్లలో మన యువతకు జపాన్​లో  500 ఉద్యోగాలు  అందుబాటులోకి రానున్నాయి.  

హెల్త్‌‌‌‌‌‌‌‌కేర్,  నర్సింగ్ రంగంలో 200 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ (ఆటోమోటివ్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ)లో 100 ఉద్యోగాలు,  హాస్పిటాలిటీలో 100 ఉద్యోగాలు, నిర్మాణ రంగం (సివిల్ ఇంజనీరింగ్, భవన నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామగ్రి నిర్వహణ, నిర్వహణ) మరో  100 ఉద్యోగాలు రానున్నాయి.