
- రాష్ట్రంలో 3,500 మంది బాధితులు ఉండొచ్చని అంచనా..
- కొందరికి ఆసరా పింఛన్ వస్తుండగా..మరికొందరికి రావట్లేదు
- ఏపీలో ఇస్తున్నట్టుగా రూ. 15 వేలు ఇవ్వాలని కోరుతున్న బాధితులు
యాదాద్రి జిల్లా చౌటుప్పల్మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన పరిమళ(27).. టెన్త్ చదివేటప్పుడు నడుస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఇంటర్ చదువేటప్పుడు తీవ్రత పెరిగి.. లేవలేని స్థితికి చేరింది. పలు ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో చివరకు నిమ్స్ఆస్పత్రికి వెళ్లగా ‘ మస్కులర్ డిస్ట్రోఫీ’ వ్యాధిగా గుర్తించారు. ప్రస్తుతం పరిమళ వెన్నుపూస వంగిపోతుండగా.. శ్వాసకోశ సమస్యతో బాధపడుతోంది. తల్లి సాయం లేకుండా కూర్చోలేదు.. బాత్రూం కూడా వెళ్లలేదు. 15 ఏండ్లుగా మంచానికే పరిమితమైంది. ఆమెకు సేవలు చేసేందుకు తల్లి ఇంటి వద్దే ఉంటుంది. పింఛన్‌కోసం అప్లై చేసుకోగా రాలేదు.
యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం లింగవారిగూడెం గ్రామానికి చెందిన కత్తుల బాలకృష్ణ(43) స్కూల్వయసులో నడుస్తూ కింద పడిపోయాడు. టెన్త్, ఇంటర్లో పలుమార్లు ఇలాగే జరిగింది. డిగ్రీ చదివే రోజుల్లో వ్యాధి తీవ్రత పెరిగింది. హైదరాబాద్‌లోని నిమ్స్ఆస్పత్రికి వెళ్లి చూపించు కోగా మస్కులర్డిస్ట్రోఫీ వ్యాధిగా డాక్టర్లు నిర్ధారించారు. 25 ఏండ్లుగా బాలకృష్ణ వీల్‌చైర్‌కే పరిమితం అయ్యాడు. తండ్రి చనిపోగా తల్లిపైనే ఆధారపడి బతుకీడుస్తుండగా.. ఇద్దరికి రూ. 6వేలు ఆసరా పింఛన్వస్తుండగా ఇల్లు గడుస్తోంది.
యాదాద్రి, వెలుగు : ఆనందంగా సాగిపోయే జీవితాలను మస్కులర్డిస్ట్రోఫీ వ్యాధి పగబట్టింది. ఒక్కసారిగా జీవితాలను అథపాతాళంలోకి నెట్టివేసింది. కండరాలు క్రమక్రమంగా క్షీణిస్తూ లేవలేక.. నడవలేని దుస్థితికి చేర్చింది. ఒంటికి.. రెంటికి వెళ్లడానికి కూడా కన్నవారో.. కట్టుకున్నవారో తోడు ఉండాలి. చివరకు అన్నం ముద్ద కూడా సొంతంగా తినలేరు. ఇలా కొందరి జీవితాలు మధ్యలోనే కడతేరిపోతుండగా.. నాలుగు రోజుల కింద రమావత్ శ్రీను ఇలాగే మరణించాడు. ఈ వ్యాధి బారిన పడిన ఒక్కొక్కరిది ఒక్కో బాథ.
వ్యాధి బారిన పడితే బతుకు ఆగమే..
మస్కులర్ డిస్ట్రోఫీ(కండరాల క్షీణత) వ్యాధి బారిన పడితే జీవితం ఆగమ్యగోచరం అవుతుంది. ఎలాంటి నొప్పి లేకుండా బాడీలోని కండరాలను తినేస్తోంది. మొదట్లో కాళ్లు గుంజడం.. నడుస్తూ నడుస్తూ కింద పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఆపై లేవలేని స్థితికి చేరుకుంటారు. క్రమక్రమంగా మొదట చిన్న కండరాలు, ఆ తర్వాత పెద్ద కండరాలు పూర్తిగా క్షీణిస్తూపోతాయి. కొందరికి వెన్నెముక ఒంగిపోతోంది. ఆ తర్వాత ఏ పని చేయకపోవడంతో కేవలం కదలికలకే పరిమితమైపోతారు. దీంతో శ్వాస సమస్యలు, వెన్నెముక, గుండె కండరాలు బలహీనం కావడం, ఆహారం తినడంలో సమస్యలు వంటివి వస్తాయి. దీంతో చివరకు ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంటారు.
వ్యాధిలో ఎన్నో రకాలు..
మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిలో ఎన్నో రకాలు ఉన్నాయి. మొత్తంగా 30 రకాల వరకూ ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో కొందరికి డబ్లిన్మస్కులర్డిస్ట్రోఫీ (డీఎండీ)వస్తోంది. ఇది సోకితే జీవిత కాలం 15 – 20 ఏండ్లలోపే ఉంటుంది. లింబు గ్రీడర్మస్కులర్ డిస్ట్రోఫీ (ఎల్ జీఎండీ) సోకిన వారు 50 ఏండ్ల వరకూ జీవిస్తారు. స్పైనల్మస్కులర్ఎట్రోఫీ (ఎస్ఎంఏ) సోకిన వారికి వెన్ను పూస దెబ్బతింటుంది. వీళ్లు కూర్చోలేరు. నిలబడలేరు. జీవితంతం మంచానికే పరిమితమై ఉంటారు.
నయం చేసే మందుల్లేవ్
మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి నయం కావాలంటే పూర్తిస్థాయిలో మందులు లేవని, రిసెర్చ్ జరుగుతోందని డాక్టర్లు, వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రెండు రకాలకు మందులు మార్కెట్లో ఉన్నాయని చెబుతున్నారు. పోషకాహారం, జీవనశైలిలో మార్పులతో కొంత ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, 12 –15 ఏండ్లకు మించి బతకటం కష్టమంటున్నారు. కాగా కండరా క్షీణత జన్యుపరంగా వస్తుందని, వ్యాధి సోకితే చచ్చుబడిపోతాయని డాక్టర్లు వివరిస్తున్నారు.
కేర్ టేకర్ ఉండాల్సిందే..
వ్యాధి సోకినవారికి కేర్ టేకర్కంపల్సరీగా ఉండాలి. కొన్ని రోజుల కర్ర సాయంతో నడిచినా.. కాలం గడుస్తున్నా కొద్దీ అది కూడా చేయలేరు. ఒకరి సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరు. బాత్రూమ్ కు వెళ్లలేరు.. తినలేరు.. ఏ పని కూడా తమ చేతులతో సొంతంగా చేసుకోలేరు.
ఏపీలో మాదిరిగా పింఛన్ ఇవ్వాలని..
రాష్ట్రంలో మస్కులర్డిస్ట్రోఫీ వ్యాధి బాధితులు 3,500 మంది ఉంటారని సివీయర్డిజేబులిటీ వెల్ఫేర్సొసైటీ ఫౌండర్ కత్తుల బాలకృష్ణ 2017లో ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించారు. ఇప్పుడెంతమంది ఉంటారో లెక్కలు లేవు. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 500 మంది వరకు బాధితులు ఉండగా వీరిలో కొందరికి ఆసరా పింఛన్వస్తోంది. మరికొందరికి రావడం లేదు. పింఛన్పొందేవారికి ఏ మాత్రం సరిపోవడం లేదు. అందుకే ఏపీలో ఇస్తున్నట్టుగా నెలకు రూ. 15 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. హెల్త్ కార్డుతో పాటు ఇతర అనారోగ్యాలకు మందులు ఇవ్వాలని పేర్కొంటున్నారు. రెగ్యులర్‌గా న్యూట్రీషన్కిట్ఇచ్చినట్టయితే తాము జీవించినంతకాలం సాయం ఉంటుందని చెబుతున్నారు.
కొన్ని రకాల జబ్బులకు మందులు ఉండగా..
మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి చాలా రకాలు ఉంటుంది. దీని నివారణకు రిసెర్చ్ సాగుతోంది. డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధిపై మాత్రం మందులు వచ్చాయి. వారానికోమారు వాడాల్సి ఉంటుంది. అదే విధంగా స్పైనల్మస్కులర్ఎట్రోఫీ (ఎస్ఎంఏ) బారిన పడిన బాధితులకు ట్రీట్మెంట్, మెడిసిన్ ఉన్నాయి. కొన్ని జన్యుపరమైన వాటికి కూడా మెడిసిన్ అందుబాటులో ఉంది.
డాక్టర్ సూర్యప్రభ, న్యూరాలజిస్ట్, నిమ్స్