కొత్త రంగంలోకి సింగరేణి అడుగు.. ‘హైడ్రో’ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం

కొత్త రంగంలోకి సింగరేణి అడుగు.. ‘హైడ్రో’ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం

గోదావరిఖని, వెలుగు: బొగ్గు, థర్మల్, సోలార్​పవర్‎ను ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థ హైడ్రో పవర్​ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టనుంది. తొలిసారిగా రూ.2,535 కోట్లతో రామగుండం ఏరియాలో మూసివేసిన మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ప్రాజెక్ట్​ ప్రాంతంలో 500 మెగావాట్ల పవర్​ప్లాంట్​ఏర్పాటుకు మేనేజ్​మెంట్​ఆలోచన చేసింది. మూడేండ్లలో ప్లాంట్‎ను నిర్మించి జల విద్యుత్​ఉత్పత్తి చేసేలా ప్రీ ఫిజిబులిటీ రిపోర్ట్‎ను సింగరేణి ఆఫీసర్లు తయారు చేశారు. 

ఐదేండ్ల కిందట మూసివేసిన బ్లాక్‏లోని బొగ్గు తీయగా ఏర్పడిన 130 ఎకరాల విస్తీర్ణంలోని(లోయర్​ రిజర్వాయర్​) కందకంలో 0.42 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని157 మీటర్ల ఎత్తుపైన ఉన్న 125 ఎకరాల విస్తీర్ణంలోని అప్పర్​రిజర్వాయర్​లోకి 0.32 టీఎంసీల నీటిని భారీ మోటార్లతో పంపింగ్​చేసి నింపుతారు. పగటిపూట సోలార్​విద్యుత్‎తో ప్రక్రియను పూర్తి చేసి, రాత్రిపూట పైనున్న రిజర్వాయర్​లోంచి కిందకు నీటిని వదులుతూ పంప్డ్​స్టోరేజీ హైడ్రో విద్యుత్‎ను ఉత్పత్తి చేస్తారు. 

ప్లాంట్​ సామర్థ్యం 500 మెగావాట్లు కాగా, ప్రతి మెగావాట్‎కు రూ.5.07 కోట్లు ఖర్చు చేస్తారు.  దీనిపై ఇప్పటికే టాటా కన్సల్టెంట్​సంస్థ డిటైల్​ప్రాజెక్ట్​రిపోర్ట్‎ను తయారు చేసింది. మేడిపల్లి ఓపెన్​కాస్ట్​ క్వారీలో ఏర్పాటు చేయబోయే హైడ్రో పవర్​ప్లాంట్​ఏరియాను శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సందర్శించి పరిశీలిస్తారు. ఇందుకు మేనేజ్​మెంట్​తగు ఏర్పాట్లు చేస్తోంది. ప్లాంట్​నిర్మాణంపై సింగరేణి బోర్డు ఆఫ్​ డైరెక్టర్ల మీటింగ్​లో అప్రూవల్​కావాల్సి ఉందని, ఫైనల్ అయ్యాక టెండర్​ప్రక్రియను మొదలు పెడతామని సింగరేణి సీఎండీ బలరామ్ తెలిపారు.