పగలంతా ఉద్యోగులను నియమించే రిక్రూటర్ గా పనిచేస్తాడు.. రాత్రయ్యిందంటే కేటుగాడిగా మారిపోతాడు. ఇతని టార్గెట్ 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలే. యూఎస్ మోడల్ అని చెప్పి ఏకంగా ఏడు వందల అమ్మాయిలను ఏం చేశాడో తెలియాలంటే ఈ కేటుగాడీ బాగోతం గురించి వదవాల్సిందే.
ఢిల్లీకి చెందిన తుషార్ (23) బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పూర్తి చేశాడు. మూడేళ్లుగా నోయిడాలోని ఓ ప్రైవేటు కంపెనీలో రిక్రూటర్ గా పనిచేస్తున్నాడు. పగలంతా సిన్సియర్ గా ఉద్యోగం చేసుకంటూ లైఫ్ సెక్యూరిటీ చూసుకుంటున్నాడు. చీకటి పడగానే మనోడిలో ఉన్న ఇంకో వ్యక్తి బయటికొచ్చి అమ్మాయిలను వలలో వేసుకునే వేట మొదలు పెడతాడు. ఒక కంపెనీలో హెచ్ ఆర్ గా పనిచేసే వ్యక్తిలో ఇలాంటి షేడ్ ఒకటుంటుందంటే నమ్మలేకపోతున్నారు కదా. అయితే చదవండి.
తుషార్ సోషల్ మీడియా యాప్ లలో యూఎస్ (US) మోడల్ గా అందమైన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. డేటింగ్ యాప్ లలో అందమైన ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని అమ్మయిలను బుట్టలో వేయడం మనోడి స్టైల్. దాంతో అమ్మాయిలకు మెసేజెస్ పెడుతుంటాడు. తను ఒక యూఎస్ మోడల్ అని.. ఇండియాకు వస్తున్న తనకు ఒక మంచి తోడు కావాలని మెసేజెస్ పెడుతుంటాడు.
అలా పరిచయం చేసుకొని మెల్ల మెల్లగా డెప్త్ కు వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫోన్ లో రొమాన్స్ లోకి దింపి వాళ్ల ఫోటోస్, వీడియోస్ పంపమని అడుగుతాడు. పర్సనల్ ఫోటోలు, వీడియోస్ పంపిన తర్వాత అప్పుడు మొదలెడతాడు వేట. ఆ రకంగా మొత్తం 700 మందిని తన లిస్టులో చేర్చుకున్నాడు ఈ సోషల్ మీడియా కేటుగాడు.
పర్సనల్ ఫోటోలు, వీడియోలు పంపిన అమ్మాయిలకు ఫోన్ చేసి తనకు డబ్బులు పంపాలని, లేదంటే సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తాడు. బంబుల్ యాప్ (Bumble)లో 500 అమ్మాయిలను, స్నాప్ చాట్ (Snapchat)లో 200 మందిని బ్లాక్ మెయిల్ చేశాడు ఈ దుండగుడు. చాలా మంది అమ్మాయిలు భయపడి డబ్బులు పంపగా.. కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read :- బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఆరుగురు మృతి
ఢిల్లీ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పరిచయం అయిన కొద్ది రోజుల్లో తన పర్సనల్ ఫోటోలను పంపిన అమ్మాయి.. బ్లాక్ మెయిల్ చేయడం చూసి షాక్ కు గురైందట. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఏసీపీ అరవింద్ యాదవ్ అధ్యక్షతన టీమ్ రెడీ చేసి గాలించారంట. ఆన్ లైన్ లో చాట్ చేస్తు్న్నట్లుగా నటించి తుషార్ ఉండే ఏరియా లొకేషన్ ను గుర్తించిన పోలీసులు.. శుక్రవారం(3 జనవరి 2025) ఈస్ట్ ఢిల్లీలోని షాకర్ పూర్ ఏరియాలో పట్టుకున్నారు.
ఈ సందర్భంగా తుషార్ నుండి పోలీసులు 13 క్రెడిట్ కార్డులు, 60 వాట్సాప్ రికార్డింగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేటుగాడిని అరెస్టు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
అమ్మాయిలు జాగ్రత్త. ఎన్నో ఆశలు, ఊహలు కల్పించి.. అమెరికా నుంచో.. ఆస్ట్రేలియా నుంచో అని చెప్పి.. లేదంటే సినిమా.. బిజినెస్ అని చెప్పి గాలం వేసేవాళ్లు ఈ రోజుల్లో ఎక్కువైపోయారు. డేటింగ్ యాప్స్ లో ప్రొఫైల్ నమ్మి మోసపోకండి. రియల్ పార్ట్ నర్ ను రియల్ గా ఎంచుకోండి. ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుందనుకోండి. ఏదైనా సరే.. డేటింగ్ యాప్స్ లలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.