ఇప్పటి ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవ 1947లో మొదలైందనే చాలామందికి తెలుసు. అయితే 500 ఏండ్ల కింద చరిత్రలో జరిగిన ఓ కీలకమైన సంఘటన మొత్తం ప్రపంచ గతిని, ప్రపంచ క్రమాన్ని, ప్రపంచ పటాన్నే మార్చేసింది. ఇదే సంఘటన భారతదేశ చరిత్రనూ మార్చింది. ఇంత మార్పును తెచ్చిన ఆ ఘటనే ఇప్పటి ఇజ్రాయెల్-–పాలస్తీనా సంక్షోభానికీ కారణమైంది. ఈ కథ సరిగ్గా 570 ఏండ్ల కింద మొదలైంది.
మధ్యయుగాల్లో ఓ వెలుగు వెలిగిన రోమన్ సామ్రాజ్యానికి తూర్పు రాజధాని కాన్ స్టాంటినోపిల్. ఇది యూరోప్ కింది భాగంలో ఆసియా ఖండానికి ఆనుకొని ఉండే ఓ తీర నగరం. యూరప్ దేశాలకు, ఆసియా దేశాలకు మధ్య వాణిజ్యానికి ఇది కీలకమైన ప్రాంతం. యూరప్ దేశాలు భారతదేశాన్ని చేరుకోవడానికి కాన్ స్టాంటినోపిల్ నగరమే లింక్. అయితే అప్పటికే మధ్య ఆసియాలో ఆటమన్ సామ్రాజ్యం విస్తరిస్తూ వచ్చింది.1453లో కాన్ స్టాంటినోపిల్ను ఆటమన్ సుల్తాన్ మెహ్మద్-2 ఆక్రమించడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది.
దీంతో ప్రపంచ చరిత్రలో మధ్యయుగం ముగిసింది. అప్పటికి స్థానికంగా వాడుకలో ఉన్న ఇస్తాంబుల్ పేరే తర్వాత కాలంలో ఆ నగరం పేరుగా మారింది. ఆటమన్ సుల్తానులు తురుష్కులు కావడంతో ఈ రాజ్యం పేరు టర్కీగా మారింది. అయితే ఆటమన్ పాలన రావడంతో యూరప్-ఆసియాలకు మధ్య రవాణా పూర్తిగా బంద్ అయిపోయింది. ముఖ్యంగా భారతదేశంతో చాలా అవసరం ఉన్న యూరప్ దేశాలకు ఇబ్బందిగా మారింది. అలా భారత్ చేరుకోవడానికి కొత్త మార్గాల అన్వేషణ మొదలైంది.
ఇండియా వెతికితే అమెరికా దొరికింది
భారతదేశానికి వెళ్లే మార్గం కోసం యూరప్ దేశాలు చాలా ప్రయత్నాలు చేశాయి. దీనికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఈ ప్రయత్నంలోనే 1492లో ఇటలీకి చెందిన నావికుడు క్రిస్టఫర్ కొలంబస్ భారతదేశానికి చేరుకోవాలని యాత్ర మొదలుపెట్టాడు. అట్లాంటిక్ సముద్రంలో నేరుగా ప్రయాణించి దక్షిణ అమెరికా ఖండాన్ని చేరుకున్నాడు. ఇది అప్పటివరకు ప్రపంచానికి తెలియని భూభాగం. కొలంబస్ అన్వేషణతో ప్రపంచ పటంలో కొత్త ఖండాలు చేరాయి. ఇండియా కోసం వచ్చాడు. కాబట్టి తాను చూసిన ఎర్రటి మనుషులకు రెడ్ ఇండియన్స్ అని, తను మొదటిగా చేరుకున్న దీవులకు వెస్ట్ ఇండియన్ దీవులని పేర్లు పెట్టాడు. కొలంబస్ అమెరికా ఖండానికి నాలుగు యాత్రలు చేశాడు. అలా కొత్త ప్రపంచ చరిత్ర మొదలైంది.
తలరాత మారిన భారత్
కొలంబస్ తర్వాత భారతదేశానికి దారి కోసం ప్రయత్నించిన వాడు వాస్కోడగామా. పోర్చుగల్ యాత్రికుడైన వాస్కోడగామా1497లో సముద్రంలో దక్షిణదిశగా ఆఫ్రికా తీరాన్ని గమనిస్తూ ప్రయాణించి సౌతాఫ్రికాలోని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ చేరుకున్నాడు. అక్కడి నుంచి తూర్పు దిశగా ప్రయాణించి 1498లో భారతదేశం కేరళ తీరంలోని కేలికట్లో అడుగుపెట్టాడు. భారతదేశానికి దారి కనుక్కున్నవాడిగా చరిత్రకి ఎక్కాడు.
వాస్కోడగామా కనిపెట్టిన మార్గంలో పోర్చుగల్ వారు, తర్వాత ఇతర మార్గాల్లో బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ వారు భారతదేశంలో అడుగుపెట్టి వాణిజ్యం సాగించారు. తర్వాత కుతంత్రాలతో రాజ్యాలను చేజిక్కించుకున్నారు. నాలుగు దేశాల్లో బ్రిటిష్ వారు మనదేశంలో మెజారిటీ ప్రాంతాన్ని పాలనలోకి తెచ్చుకున్నారు. మనదేశ వనరులన్నీ అడ్డంగా దోచుకొని బ్రిటన్‌కు తరలించారు. అనేక పోరాటాల తర్వాత 1947లో మనదేశం విదేశీ పాలన నుంచి విముక్తి పొందింది. కాన్ స్టాంటినోపిల్ ఆక్రమణ కారణంగా ఆధునిక భారతదేశ చరిత్ర మొత్తం మారిపోయింది.
దేవుడి దేశం-మనుషుల యుద్ధం
ఆసియాలో మధ్యప్రాచ్యంలో ఉన్న ఇజ్రాయెల్ క్రీస్తుపూర్వం నుంచి యూదుల దేశం. పశ్చిమాన ఈజిప్ట్ (ఆఫ్రికా ఖండం)కు ఆనుకొని, ఉత్తరాన టర్కీ (యూరప్ ఖండం)కి దగ్గరగా ఈ ప్రాంతం ఉంటుంది. క్రీస్తుశకం 6వ శతాబ్దం వరకు జాతుల గొడవలు, దండయాత్రలు, యూదు- క్రైస్తవ సంఘర్షణలతో ఈ ప్రాంతం సతమతమైంది. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో ఇజ్రాయెల్ అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. జెరూసలేంలోని పవిత్రస్థలాలు అటు యూదు, క్రిస్టియన్లు, ఇటు ముస్లింలకూ సెంటిమెంట్‌గా ఉండడంతో ఈ ప్రాంతంపై పట్టు అందరికీ కీలకంగా మారింది.
తర్వాత వందల ఏండ్ల పాటు వరుస యుద్ధాలు, దాడులతో ఈ ప్రాంతం నుంచి యూదులు వలస పోతూ వచ్చారు.1453లో కాన్ స్టాంటినోపిల్ పతనం నాటికి ఇజ్రాయెల్ ప్రాంతంలో యూదులు కనుమరుగై వేలసంఖ్యలోనే మిగిలారు. వలసపోయినవాళ్లంతా యూరప్ చేరుకొని వేర్వేరు దేశాల్లో స్థిరపడి, అక్కడి సమాజాల్లో కలిసిపోయారు. వీరిలో మెజారిటీ యూదులు జర్మనీ(నాటి ప్రష్యా)లోనే స్థిరపడ్డారు. వారి సంతతి వారే ఐన్ స్టీన్, కారల్ మార్క్స్ లాంటి మేధావులు.
అరబ్బుల పాలనలో ఉన్న ప్రాంతం పాలస్తీనాగా మారితే, ఇజ్రాయెల్ అనే దేశం కలగా మిగిలింది. కాలక్రమంలో అప్పుడప్పుడు కొన్ని వందల సంఖ్యలో మాత్రమే యూదు సమూహాలు పాలస్తీనా ప్రాంతానికి తిరిగి వచ్చాయి. 20వ శతాబ్దం వరకు ఇదే పరిస్థితి ఉంది. ఆటమన్ పాలనలో ఉన్న పాలస్తీనా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ చేతికి వచ్చింది. దీన్ని మేండేటరీ పాలస్తీనా అనేవారు. ఈ ప్రాంతంలో బ్రిటిష్- అరబ్బుల ఘర్షణ జరుగుతున్న క్రమంలో యూదు గ్రూపులు సైనికశక్తిగా మారడం మొదలుపెట్టాయి.
మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక పదేండ్ల కాలంలోనే పాలస్తీనాకు యూదు వలసలు లక్షల్లోకి చేరాయి. యూదు వలసలను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే అరబ్బుల తిరుగుబాటును బ్రిటన్ ఎదుర్కొంది. జర్మనీలో హిట్లర్ పాలనలో యూదుల ఊచకోతల తర్వాత పాలస్తీనాకు వారి వలసలు భారీగా పెరిగిపోయాయి. అప్పటికే పాలస్తీనాలో యూదులు, ముస్లింలకు మధ్య హింసాత్మక దాడులు మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి ‘మా ఇజ్రాయెల్ మాకు కావాలి’ అన్న కాంక్ష యూదుల్లో బలంగా నాటుకుపోయింది. హిట్లర్ నరమేధం కారణంగా యూదులకు బలమైన దేశాల నుంచి సానుభూతి, మద్దతు దొరికింది.
పాలస్తీనాలో ముస్లింలు, యూదు గ్రూపుల మధ్య ఘర్షణలను అదుపుచేయలేక 1947లో బ్రిటన్ చేతులెత్తేసింది. మేండేటరీ పాలస్తీనా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అప్పుడే కొత్తగా ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి పాలస్తీనా సమస్యపై కమిటీ వేసింది. కమిటీ రిపోర్ట్ ప్రకారం స్వతంత్ర పాలస్తీనా, స్వతంత్ర ఇజ్రాయెల్ ఏర్పాటుతో పాటు జెరూసలేం పాలనకు ప్రత్యేక ట్రస్టీ ఉండాలన్న ప్రతిపాదనకు యూఎన్వో ఆమోదించింది. దీన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తే పాలస్తీనా అరబ్బులు వ్యతిరేకించారు. ఈ వివాదమే ఇప్పటికీ చల్లారని కాష్టంగా రగులుతోంది.