ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5041 మందికి కరోనా పాజిటివ్ రాగా, 56 మంది కరోనా కారణంగా మరణించారని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49,650కి చేరింది. అందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 22,890 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 26,118 మంది రాష్ట్రంలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
వారంలో 20 వేల కేసులు.. 300 మరణాలు
ఏపీలో కొద్ది రోజులుగా కరోనా మరణాల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వారంలో దాదాపు ప్రతి రోజూ 40 మందికి పైగా మరణిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా కారణంగా 56 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లాలో పది మంది, శ్రీకాకకుళంలో ఎనిమిది మంది, కర్నూలు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం జిల్లాల్లో నలుగురు, అనంతరపురం, కడప, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 642కి చేరింది. గడిచిన ఆదివారం నుంచి నేటి వరకు మరణాలు దాదాపు మూడు వందలకు పైగా పెరగడం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ వారంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు 20 వేలకు పైగా రావడం ఆందోళన కలిగిస్తోంది.