- దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 55,219 మొబైల్ ఫోన్లు బ్లాక్
- మొబైల్ ఫోన్ల ట్రేసింగ్ దేశంలోనే నంబర్ వన్‌గా రాష్ట్ర సీఐడీ
హైదరాబాద్, వెలుగు: మొబైల్ ఫోన్లను ట్రేస్ చేయడంలో రాష్ట్ర సీఐడీ పోలీసులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. 67.98 శాతం రికవరీ సాధించారు. నాలుగు నెలల వ్యవధిలో 5,038 సెల్ ఫోన్లను ట్రేస్ చేశారు. వాటిలో గత 16 రోజుల వ్యవధిలో 1000 ఫోన్లను కనుగొని బాధితులకు అప్పగించారు. సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా సీఐడీ పోలీసులు నిర్వహిస్తున్న మొబైల్స్ ట్రేసింగ్ వివరాలను డీజీపీ కార్యాలయ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న డీజీపీ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్రైనింగ్ నిర్వహించారు. సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ నోడల్ ఆఫీసర్ గా మే17న అధికారికంగా ఈ ఆపరేషన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 31 యూనిట్లలోని 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ పోర్టల్ యూజర్ ఐడీలను ప్రజలకు అందుబాటులో పెట్టారు. జిల్లాల వారీగా ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను నియమించారు.
ఫోన్ పోతే ఫిర్యాదు చేయండి: డీజీపీ
సీఐడీ ఆఫీసులోని మెయిన్ సర్వర్‌తో పోర్టల్ నిర్వహిస్తున్నారు. ప్రజలు పోగొట్టుకున్న సెల్‌ఫోన్స్‌ను గుర్తించి వారికి అప్పగిస్తున్నారు. ట్రేస్ కాని ఫోన్లను పనిచేయకుండా బ్లాక్ చేస్తున్నారు. ఇలా ఏప్రిల్ 20 నుంచి ఈ నెల 7 వరకు 11,297 సెల్‌ఫోన్లను గుర్తించారు. వాటిలో 5,038 ఫోన్లను బాధితులకు అప్పగించారు. సైబరాబాద్, సిటీ కమిషనరేట్, రాచకొండ కమిషనరేట్ పరిధితో పాటు వరంగల్, నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాధితులకు వారి మొబలై ఫోన్లు అప్పగించారు. అలాగే దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 55,219 ఫోన్లను బ్లాక్ చేసి ఆయా రాష్ట్రాలకు సమాచారం అందించారు. మొబైల్ ట్రేసింగ్‌లో నైపుణ్యం చూపిన అధికారులను డీజీపీ అంజనీ కుమార్, సీఈడీ చీఫ్ మహేశ్ భగవత్ అభినందించారు. ఫోన్లు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా.. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్, మీ సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చని, అలాగే https://www.ceir.gov.in సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని డీజీపీ సూచించారు.