ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు.. ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో తెలుగోళ్లే

ఎంపీల్లో 504 మంది కోటీశ్వరులు.. ఫస్ట్, సెకండ్ ప్లేసుల్లో తెలుగోళ్లే

న్యూఢిల్లీ, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో గెలిచిన 543 మంది ఎంపీల్లో 504 (93 శాతం) మంది కోటీశ్వరులే ఉన్నారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ఎంపీలే టాప్ వన్, టూ ప్లేసుల్లో నిలిచారు. రూ.5,705 కోట్లతో అగ్రస్థానంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని, రూ.4,568 కోట్లతో రెండో స్థానంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి  ఉన్నారు. తాజాగా గెలుపొందిన ఎంపీల క్రిమినల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్​పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ (ఏడీఆర్) విశ్లేషించింది. 2009తో పోలిస్తే ప్రతి ఏటా కోటీశ్వరులైన ఎంపీల సంఖ్య క్రమంగా పెరిగినట్టు ఈ సంస్థ వెల్లడించింది. 2009లో 315 మంది కోటీశ్వరులు ఉంటే.. 2014లో 443 మంది, 2019లో 475 మంది సంపన్న ఎంపీలు ఉన్నట్టు తెలిపింది. తాజాగా గెలిచిన ఎంపీల్లో.. పార్టీల వారీగా చూసుకుంటే.. బీజేపీలో 227 మంది, కాంగ్రెస్​లో 92 మంది, డీఎంకేలో 21 మంది, టీఎంసీలో 27 మంది, ఎస్పీలో 34 మంది, జేడీయూలో 12 మంది, టీడీపీలో 16 మంది కోటీశ్వర్లు ఉన్నారు. 

ఈటలపై హత్యాయత్నం కేసు

543 ఎంపీల్లో 251 మందిపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులు ఉన్నట్టు ఏడీఆర్ సంస్థ తెలిపింది. మొత్తం లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎంపీల్లో 46 శాతం మందికి క్రిమినల్ హిస్టరీ ఉంది. కాగా, గత లోక్ సభలో క్రిమినల్ బ్యాంక్ గ్రౌండ్ ఉన్న వారి సంఖ్య 233 ఉంటే.. ఈసారి మరింత పెరిగింది. 2009లో 162 మందికి, 2014లో 185 మందికి నేర చరిత్ర ఉంది. తాజాగా గెలిచిన ఎంపీల్లో 27 మందిపై ఐపీసీ 307 (హత్యాయత్నం) కేసు ఉన్నట్టు ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. నలుగురు ఎంపీలపై హత్య, 27 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. 15 మంది ఎంపీలు మహిళలపై దాడులకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిపై అత్యాచారం కేసులున్నాయి. నలుగురిపై కిడ్నాప్, 43 మందిపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. 

ఇక పార్టీల వారీగా చూసుకుంటే.. బీజేపీ నుంచి 94 మంది, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నుంచి 49 మంది, ఎస్పీ నుంచి 12 మంది, టీఎంసీ నుంచి 13 మంది, డీఎంకే నుంచి 13 మంది, టీడీపీ నుంచి 8 మందిపై క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసులున్నాయి. సీరియస్‌‌‌‌‌‌‌‌ క్రిమినల్‌‌‌‌‌‌‌‌ కేసుల విషయానికి వస్తే బీజేపీ నుంచి 60 మందిపై, కాంగ్రెస్ నుంచి 32 మందిపై, ఎస్పీ నుంచి 17 మందిపై, టీఎంసీ నుంచి ఏడుగురిపై, డీఎంకే నుంచి ఆరుగురిపై, టీడీపీ నుంచి ఐదుగురిపై అభియోగాలు నమోదయ్యాయి. కాగా, హత్యాయత్నం కేసులు ఉన్న 27 మంది జాబితాలో మల్కాజ్​గిరికి నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉన్నారు. అలాగే, ఈటలపై దాదాపు 45 కేసులు ఉన్నట్టు తెలిపింది. ఇందులో సీరియస్ కేసులు 15 ఉన్నట్టు చెప్పింది.