
- ‘50501’ పేరుతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు
- వైట్ హౌస్, టెస్లా ఆఫీసుల ముందు భారీగా ఆందోళనలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు, ఇమిగ్రేషన్ రూల్స్ కఠినం చేసి డిపోర్టేషన్లు చేస్తుండటం, టారిఫ్ వార్ కు దిగడం వంటి ట్రంప్ విధానాలపై అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ రెవెల్యూషనరీ వార్ 250వ యానివర్సరీ ప్రారంభం సందర్భంగా ఈ నెల 19 నుంచి నిరసనల బాట పట్టారు. ‘50501(50 రాష్ట్రాల్లో 50 నిరసనలు, 1 ఉద్యమం)’ పేరుతో వేలాది మంది నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
శనివారం వైట్ హౌస్ ముందు, టెస్లా కంపెనీ ఆఫీసుల ముందు, వివిధ నగరాల్లో వేలాది మంది నిరసనలు తెలిపారు. అమెరికాలో లీగల్ రెసిడెంట్‌గా ఉంటున్న ఎల్ సాల్వెడార్‌కు చెందిన కిల్మార్ ఆబ్రెగో గార్షియా అనే యువకుడిని టెర్రరిస్ట్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ట్రంప్ సర్కారు ఆ దేశానికి డిపోర్ట్ చేయడంపైనా దుమారం రేగుతోంది. గార్షియాను పొరపాటుగా డిపోర్ట్ చేశారని, అతడిని వెంటనే వెనక్కి తేవాలని జనం డిమాండ్ చేస్తున్నారు. ‘‘ట్రంప్.. ఇది రాచరికం కాదు.. అమెరికాలో కింగ్ లేడు. చట్టమే కింగ్.. ట్రంప్ నే ఎల్ సాల్వెడార్ కు డిపోర్ట్ చేయాలి..” అంటూ నిరసనల్లో పాల్గొంటున్న జనం నినాదాలు చేస్తున్నారు.
పడిపోయిన ట్రంప్ అప్రూవల్ రేటింగ్
తాజా పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అప్రూవల్ రేటింగ్ పడిపోయిందని గాలప్, రాయిటర్స్/ఇప్సోస్ సర్వేల్లో తేలింది. రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తొలి 3 నెలల్లో ట్రంప్ పాలన బాగుందంటూ 45% మంది మాత్రమే ఓటేశారని సర్వేలో వెల్లడైంది.