లింక్​పై క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ .. లోన్లు, జాబ్స్​ఇప్పిస్తామని ఫోన్లు

  • బ్యాంకు డిటైల్స్​ఇవ్వాలని సూచనలు
  • ఆశపడితే అసలుకే మోసం
  • వంద శాతానికి మించి పెరిగిన సైబర్​క్రైమ్​
  • ఏడు నెలల్లో 52 కేసులు
  • అకౌంట్ల నుంచి రూ.34 లక్షలు గాయబ్​

యాదాద్రి, వెలుగు : సైబర్​నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు.. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో సైబర్​నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అకౌంట్ల వివరాలు చెబుతూ లింక్​లపై క్లిక్​చేస్తూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలా జిల్లాలో ఎక్కడో చోట.. ఎవరో ఒకరు మోసపోతూనే ఉన్నారు. 

లోన్లు, జాబ్స్​ఇస్తామని..

సైబర్​నేరగాళ్లు రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. వారి మాటలు నమ్మిన వారు మోసపోతున్నారు. లోన్​ ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ చాలా మంది మొబైల్​ఫోన్లకు తరచూ కాల్స్ చేస్తున్నారు. కొందరు ఇలాంటి కాల్స్​ను పట్టించుకోవడం లేదు. కానీ మరికొందరు మాత్రం ఈ కాల్స్​కు ఆకర్షితులవుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశపడుతున్నారు. ఇంటివద్దే ఉంటూ డబ్బులు సంపాదించవచ్చని ఆశిస్తున్నారు. ఆర్థికంగా అవసరాలు ఉన్నవారు లోన్లు వస్తాయన్న ఉద్దేశంతో సైబర్ మోసగాళ్ల మాటలు నమ్మేస్తున్నారు. 

వారు అడిగిందే తడవుగా తమ బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను చెప్పడమో.. లేదా మెసేజ్​ పంపించడమో చేస్తున్నారు. మరికొందరైతే తమకు వచ్చిన లింక్​ను క్లిక్​చేస్తున్నారు. దీంతో వారి ఖాతాల్లోని డబ్బు డ్రా అవుతోంది. మోసపోయామని గమనించిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్​మోసాలపై పోలీస్ శాఖ హెచ్చరిస్తున్నా పెద్దగా ఫలితం లేకుండా పోతోంది. అకౌంట్ నుంచి డబ్బులు కోల్పోయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా 1930కి ఫోన్​ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. 

వేగంగా పెరుగుతున్న మోసాలు..

సైబర్​ నేరాల సంఖ్య స్పీడ్​గా పెరిగిపోయింది. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు సగటున ప్రతినెలా 8 కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. 2021, 2022లో జిల్లాలో ఒక్క సైబర్ కేసు కూడా నమోదు కాలేదు. గతేడాది నుంచి జిల్లాలో సైబర్​నేరాల నమోదు మొదలైంది. గతేడాదిలో నమోదైన కేసుల కంటే ఈ ఏడాది ఇప్పటికే రెండు రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. గతేడాదిలో జిల్లాలో 27 కేసులు నమోదు కాగా బాధితులు రూ.13.68 లక్షలు కోల్పోయారు. ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 52 కేసులు నమోదు కాగా రూ.34 లక్షలకు పైగా బాధితులు కోల్పోయారు. అయితే సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బు కోల్పోయినా.. పరువు పోతుందన్న ఉద్దేశంతో కొందరూ పోలీస్​స్టేషన్ మెట్లు ఎక్కడం లేదు.  మోసపోయినవారిలో 50 శాతం కూడా పోలీస్ స్టేషన్ ముఖం చూడడం లేదని తెలుస్తోంది. 

 యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన బాలరాజుకు ఒకరోజు ఫోన్ వచ్చింది. ఇంటి వద్ద ఉంటూనే ఆన్​లైన్​లో టాస్క్​లు చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని చెప్పి లింక్​పంపించారు. ఈ లింక్​పై బాలరాజు క్లిక్​ చేయడంతో అకౌంట్ నుంచి రూ.40 వేలు డ్రా అయినట్టు మెసేజ్​వచ్చింది. దీంతో తాను మోసపోయినట్టు బాలరాజు గుర్తించి పోలీసులకు కంప్లైంట్​ఇచ్చాడు. 

రాయగిరికి చెందిని నర్సింగరావుకు కిరాణ షాపు ఉంది. ఆయన ఫోన్​కు 'ధని' యాప్​ద్వారా లోన్​ వస్తుందని, వివరాలు కావాలని మెసేజ్​వచ్చింది. దీంతో తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను మెసేజ్​చేశాడు. ఆ తర్వాత ఖాతా నుంచి రూ.36 వేలు డ్రా అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో నర్సింగరావు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులు మచ్చుకే కానీ అనేక మంది మోసపోతున్నారు.