
- కామారెడ్డి జిల్లాకు కొత్తగా 52 మంది జూనియర్ లెక్చరర్లు
- గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో మెరుగుపడనున్న బోధన
కామారెడ్డి, వెలుగు: గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో విద్య బోధన మెరుగుపడనుంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. జెఎల్గా సెలక్టయినవారికి ఈ నెల 12న అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో కొత్తగా 52 మంది జూనియర్ లెక్చరర్లు డ్యూటీలో చేరనున్నారు. దీంతో జిల్లాలో సబ్జెక్టు లెక్చరర్ల కొరత తీరనుంది. జిల్లాలో 20 గవర్నమెంట్జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో బీబీపేట, నాగిరెడ్డిపేట, బీర్కూరు, నిజాంసాగర్ లలో 2020 తర్వాత కాలేజీలు ప్రారంభించారు.
ఈ కాలేజీలకు ఇప్పటివరకు లెక్చరర్లను డిప్యూటేషన్ మీద పంపారు. కొందరు గెస్ట్ లెక్చరర్లు పని చేస్తున్నారు. జిల్లాకు కొత్తగా వస్తున్న 52 మందిని 16 పాత కాలేజీలకే కేటాయించారు. కొత్త కాలేజీల్లో ఇంకారెగ్యులర్ పోస్టులు భర్తీ చేయలేదని, త్వరలో పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో జూనియర్ కాలేజీల్లో ప్రస్తుతం 2,144 మంది ఫస్ట్ఇయర్, 2,129 మంది సెకండియర్ స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 16 కాలేజీల్లో ఇప్పుడు 150 మంది రెగ్యులర్ లెక్చరర్లు ఉన్నా.. ఇంకా చాలా చోట్ల మ్యాథ్స్, ఇంగ్లిష్, ఎకనామిక్స్ కెమిస్ట్రీ, బాటనీ, కామర్స్తదితర సబ్జెక్ట్ లెక్చరర్ల కొరత ఉంది. ఈ కొరత తీర్చేందుకు జిల్లాకు 52 మంది సబ్జెక్ట్ లెక్చరర్లను కేటాయించారు. 16 కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వీరితో భర్తీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో అన్ని కాలేజీల్లో పూర్తి స్థాయిలో సబ్జెక్టు లెక్చరర్లు ఉండనున్నారు.
గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అన్ని సబ్జెక్టుల లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండడంవల్ల 2024 లో జిల్లాలో ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాలేదు. గవర్నమెంట్ కాలేజీల్లో కేవలం 30 శాతం మంది మాత్రమే పాస్అయ్యారు. ఈ సమస్యను గుర్తించి కలెక్టర్ అశిశ్సంగ్వాన్ ఈ సారి స్పెషల్ఫోకస్ పెట్టారు. రెగ్యులర్గా స్టూడెంట్స్కాలేజీకి వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు కాలేజీల వారీగా పేరెంట్స్ మీటింగ్ లు ఏర్పాటు చేశారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన స్టూడెంట్స్కు స్పెషల్ క్లాసులు చెప్పించారు. వచ్చే ఏడాది ఈ సమస్య ఉండదు. బోధన మెరుగ్గా జరిగి పాస్ పర్సంటేజీ పెరిగే చాన్స్ ఉంది. గతంలో కొన్ని కాలేజీల్లో సరిపడా లెక్చరర్లు లేక గవర్నమెంట్ కాలేజీల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు పోస్టులు భర్తీ కావటంతో అడ్మిషన్కూడా పెరుగుతాయని అధికారులు అంటున్నారు.
మంచి బోధన అందనుంది
కాలేజీల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ల పోస్టుల కొరత తీరింది. కొత్తగా 52 మంది లెక్చరర్లు వస్తుండటంతో మంచి బోధన అందనుంది. ఇక సబ్జెక్టు లెక్చరర్ల సమస్య ఉండదు. వచ్చే అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్లను పెంచటంతో పాటు, మంచి ఫలితాలు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.- షేక్సలాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి