తలకొరివి పెట్టే సమయంలో లేచి కూర్చున్న మహిళ.. పరుగులు తీసిన బంధువులు

తలకొరివి పెట్టే సమయంలో లేచి కూర్చున్న మహిళ.. పరుగులు తీసిన బంధువులు

భువనేశ్వర్: ఒడిశాలోని బెర్హంపూర్‌లో ఒక వింత సంఘటన వెలుగు చూసింది. 52 ఏళ్ల మహిళ చనిపోయిందని భావించి ఆమె దహన సంస్కారాలకు సిద్ధమవ్వగా చివరి క్షణాల్లో కళ్ళు తెరిచింది. చేతిపైనే లేచి కూర్చొంది. ఈ వింత ఘటనతో దహన సంస్కారాలకు హాజరైన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు అక్కడి నుంచి పరుగులు తీశారు.

ఏం జరిగిందంటే..?

బెర్హంపూర్‌, గంజాంలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన బుజ్జి అమ్మ అనే మహిళ ఫిబ్రవరి 1న ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైంది. మొదట ఆమెను MKCG మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మరొక చోటికి రెఫర్ చేశారు. అయితే, నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. తీరా చూస్తే మరుసటి రోజు ఉదయానికి ఆమె కళ్లు తెరవలేదు. దీంతో ఆమె చనిపోయినట్లు భావించి బంధువులకు సమాచారమిచ్చారు. 

బంధువులు అందరూ ఇంటికి చేరుకున్నాక ఆమెను దహన సంస్కరాలకై బిజీపూర్‌లోని సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ చితిపై పడుకోబెట్టి మరికొన్ని క్షణాల్లో తలకొరివి పెడతారు అనంగా ఆమె కళ్లు తెరిచింది. ఆ దృశ్యాలు చూసిన బంధువులు, గ్రామస్థులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ అధికారులు అక్కడకి చేరుకొని ఆమె బ్రతికున్నట్లు నిర్ధారించారు. తిరిగి ఆమెను శవవాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి.. అక్కడ నుండి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు తప్పిదంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు బెర్హంపూర్ మున్సిపల్ అధికారులు తెలిపారు. కళ్ళు తెరవకపోవడం, శ్వాస తీసుకకపోవడంతో ఆమె చనిపోయి ఉండవచ్చని భావించినట్లు భర్త సిబారామ్ పాలో అధికారులకు తెలియజేశాడు.