- రాష్ట్రంలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
- అత్యధికంగా సికింద్రాబాద్ బరిలో 45 మంది
- ఆ తర్వాతి స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్
- అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో 12 మంది
- 12 రోజుల పాటు మరింత హోరెత్తనున్న ప్రచారం
హైదరాబాద్, వెలుగు: నామినేషన్ల ఉపసంహరణ తర్వాత రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా వంద మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వాపస్ తీసుకున్నారు. అయితే, అత్యధికంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి 45 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి, వరంగల్ స్థానాలు ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో12 మంది పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి ప్రతి లోక్‌సభ పరిధిలో ఆయా పార్టీల క్యాండిడేట్స్ పోటీలో ఉన్నారు. కొన్నిచోట్ల బీఎస్పీ, భువనగిరి నుంచి సీపీఎం అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ నెల 17వ తేదీన లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది.
కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ క్యాండిడేట్లు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేశారు. ఏప్రిల్ 25 తేదీ వరకు 839 మంది నామినేషన్లు వేయగా.. 26న నామినేషన్ల పరిశీలన పూర్తయింది. స్క్రూటినీ తర్వాత 268 మంది క్యాండిడేట్ల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ఎక్కువగా ఇండిపెండెంట్క్యాండిడేట్లు ఉన్నారు. మందా జగన్నాథంకు బీఎస్పీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో.. ఆయన నాగర్కర్నూల్స్థానంలో వేసిన నామినేషన్ రిజెక్ట్ అయ్యింది. ప్రజాశాంతి పార్టీ నుంచి బాబుమోహన్ వరంగల్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయగా.. స్క్రూటినీలో తిరస్కరణకు గురయ్యింది. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
2019తో పోలిస్తే తక్కువే..
2019 పార్లమెంట్ ఎన్నికలతో చూస్తే ఈసారి ఎక్కువ మంది పోటీలో లేరు. అప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి గంపగుత్తగా రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతర స్థానాల్లోనూ అప్పటీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వేశారు. అయితే ఈ సారి పరిస్థితి అలా లేదు. ఐదు పార్లమెంట్ స్థానాలకు 40కు పైగా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో రెండు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు పెద్దపల్లి, వరంగల్ ఉన్నాయి. చేవేళ్ల, మెదక్, సికింద్రాబాద్‌లోనూ 40 మంది పైనే పోటీ చేస్తున్నారు. ఇక భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్, హైదరాబాద్ స్థానాల్లో 30కి పైగా మంది బరిలో నిలిచారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, నల్గొండ, మహబూబాబాద్ స్థానాల్లో 20 మందికి పైగా క్యాండిడేట్లు పోటీలో ఉన్నారు.
హోరెత్తనున్న ప్రచారం
నామినేషన్ల ఘట్టం ముగియగా.. అభ్యర్థులు ప్రచారంపై ఫోకస్‌పెట్టారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరగనుండగా..11వ తేదీ సాయంత్రం ప్రచారానికి తెరపడనుంది. అంటే ప్రచారానికి సరిగ్గా 12 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్యాండిడేట్లు క్యాంపెయినింగ్ను హోరెత్తించనున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం అన్ని గ్రామాలు తిరిగే పరిస్థితి లేదు. దీంతో ముఖ్యమైన ప్రాంతాలు, హెడ్ క్వార్టర్స్‌లలో మీటింగ్స్‌కు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా పార్లమెంట్ పరిధిలో ముఖ్యమైన లీడర్లతో మీటింగ్ లు ఏర్పాటు చేయించాలని ప్లాన్ చేస్తున్నారు.