ఖమ్మం రూరల్, వెలుగు: మున్నేరు వరద బీభత్సంతో ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు. 525 మంది ట్రైనీ పోలీసులు రాత్రింబవళ్లు కష్టపడి బాధితులకు అండగా నిలిచి సాయం అందించారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి ఏరియా రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, టౌన్ లోని బొక్కలగడ్డ, ధంసాలపురం కాలనీ, పంపింగ్వెల్రోడ్డు తదితర ముంపు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరదనీరు చేరి.. బట్టలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి బురదమయంగా మారాయి.
దీంతో వాటిని శుభ్రం చేసుకునేందుకు బాధితులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సాయం అందించారు. అదేవిధంగా రోడ్లపైన పేరుకుపోయిన బురద మట్టి, వ్యర్థాలను తొలగించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల సేవలకు.. సలాం పోలీసన్నా అంటూ ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశంసించారు. పోలీసులు సహకారాన్ని ఎన్నటికీ మరువలేమని పలువురు బాధితులు తెలిపారు.