55 ఏండ్ల తర్వాత .. తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం..

  • చుట్టూ 225 కి.మీ. వరకు 4 రాష్ట్రాల్లో ప్రభావం
  • గోదావరి బెల్ట్‌‌‌‌లో భయంతో వణికిపోయిన జనం
  • ఇండ్లు, అపార్ట్‌‌‌‌మెంట్ల నుంచి బయటకు పరుగులు 
  • ఇండ్లలో సామగ్రి చిందరవందర, అక్కడక్కడ కూలిన గోడలు  
  • 55 ఏండ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం
  • పాకాల సూపర్​ గ్రూప్ రాక్ ​ప్లేట్లలో కదలికల వల్లేనని చెబుతున్న సైంటిస్టులు
  • నేడు ములుగుకు సైంటిస్టులు.. పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక 

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి / హైదరాబాద్ /తాడ్వాయి, వెలుగు: పిల్లలను స్కూల్​కు రెడీ చేసే హడావుడిలో తల్లులు.. ఆఫీసులకు, పనులకు బయల్దేరేందుకు సిద్ధమవుతున్న ఇంటి పెద్దలు.. అప్పుడే సడెన్​గా ఓ కుదుపు.. 5 సెకన్ల పాటు కాళ్ల కింద భూమి కదిలిపోయింది.. ఏమవుతున్నదో అర్థం కాక జనాల్లో గందరగోళం.. భయంతో కొందరు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎన్నడూ లేనిది బుధవారం పొద్దున రాష్ట్రంలో భూకంపం సంభవించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా రిక్టర్​స్కేల్​పై 5.3 తీవ్రతతో ఉదయం 7:27 గంటలకు భూమి కంపించింది. భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉండగా, దాని చుట్టూ దాదాపు 225 కిలోమీటర్ల దూరం వరకు 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మైనింగ్​ బెల్ట్, గోదావరి బెల్ట్​లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం ధాటికి ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పలు చోట్ల గోడలు కూలిపోయాయి. ఇండ్లలోని సామగ్రి చిందరవందరగా పడిపోయింది. 

4 రాష్ట్రాల్లో ప్రకంపనలు.. 

మేడారం కేంద్రంగా ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ‌‌, మహారాష్ట్ర, చత్తీస్‌‌‌‌ గఢ్‌‌‌‌ రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు తెలిపారు. రాష్ట్రంలో గోదావరి బెల్ట్ ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించింది.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండగా.. మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హనుమకొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా భూమి కంపించినట్లు ప్రజలు తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని పలు ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది. ఏపీలోని విజయవాడ, గుంటూరు, మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాతో పాటు గోదావరి బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనూ చాలా చోట్ల భూమి కంపించింది. 

ములుగులో సైంటిస్టుల రీసెర్చ్..  

దక్కన్​పీఠభూమిలో ఉన్న తెలంగాణ అంతా నిశ్చలంగా ఉండే గ్రానైటిక్​రాక్స్​తో ఏర్పడిందని జియోలాజికల్​సర్వే ఆఫ్​ఇండియా (జీఎస్ఐ) సైంటిస్టులు తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఇల్లందు కేంద్రంగా ‘పాకాల సూపర్​గ్రూప్’​ అనే ప్రత్యేక రాక్​ఫార్మేషన్​(రాతి నిర్మాణాలు) ఉందని.. ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్​జిల్లాల్లోని పలు ప్రాంతాలు ఈ గ్రూప్​లోనే ఉన్నాయని చెప్పారు. ఈ పాకాల సూపర్​గ్రూప్​ ఏరియాల్లో సెడిమెంటరీ రాక్స్​ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి రాతి నిర్మాణాలు ఉన్న చోట ఆ రాక్​ ప్లేట్లలో కదలికలు రావడం సహజమని..  అలా రాక్స్​అడ్జస్ట్​అయ్యే క్రమంలోనే వాటిలో కదలికలు​వచ్చి భూకంపం ఏర్పడి ఉండొచ్చని అంటున్నారు. మైనింగ్​కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నది పరీవాహక ప్రాంతాల్లో ఇలాంటి సెడిమెంటరీ రాక్స్​ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. గతంలో భద్రాచలంలో ఇలాగే భూకంపం వచ్చిందని  గుర్తు చేస్తున్నారు. 

భూకంపానికి అసలు కారణం తెలుసుకునేందుకు జీఎస్ఐ సైంటిస్టులు భూకంప కేంద్రమైన ములుగులో రీసెర్చ్​చేయనున్నారు. గురువారం అక్కడకు వెళ్లి ప్రాథమిక ఆధారాలను సేకరించనున్నారు. దానిపై ఓ డీటెయిల్డ్​రిపోర్ట్​ను తయారు చేయనున్నారు. ఓ వారంలో ఆ రిపోర్ట్​ సిద్ధమవుతుందని, దాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని సైంటిస్టులు తెలిపారు. కాగా, 2018లో కొత్తగూడెంలో పలు భూకంపాలు వచ్చినప్పటికి వాటి తీవ్రత చాలా తక్కువని సైంటిస్టులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భూకంప జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3 పరిధిలో ఉన్నాయని, అప్పుడప్పుడు కొన్ని సెకన్ల పాటు సంభవించే భూ ప్రకంపనల వల్ల పెద్దగా నష్టం ఉండదని అంటున్నారు. గోదావరి బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బొగ్గు తవ్వకాలు, ఇసుక రవాణా, మొరం, మట్టి తవ్వకాలు, అడువులను నరికి పోడు చేయడం వంటి కారణాల వల్ల భూమి పొరలు దెబ్బతిని భూకంపాలు సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. 

చెట్లు అందుకే కూలాయా? 

గత ఆగస్టులో ములుగు జిల్లా మేడారం అడవుల్లో 70 వేలకుపైగా చెట్లు నేలకూలాయి. దాదాపు 830 ఎకరాల్లో అడవి తుడిచిపెట్టుకుపోయింది. బలమైన టోర్నడో రావడంతో ఆ గాలిధాటికి  చెట్లు నేలకు ఒరిగాయని ప్రాథమికంగా సైంటిస్టులు, అధికారులు అంచనాకు వచ్చారు. స్క్వాల్​లైన్​ఫాల్ట్​(ఈదురుగాలులు ఎక్కువుండే ప్రాంతం)లో ఉండడంతో ఆ చెట్లు నేలకొరిగి ఉండొచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడదే ప్రాంతంలో భూకంప కేంద్రం ఉండడంతో.. చెట్లు కూలడానికి, భూకంపానికి ఏవైనా సంబంధాలున్నాయా అన్న అనుమానాలను సైంటిస్టులు లేవనెత్తుతున్నారు. మేడారం ఉన్న ములుగు జిల్లా నేల పొరలను పాకాల సూపర్​గ్రూప్​లోని ‘ములుగు సబ్​గ్రూప్’గా వివరిస్తున్నారు. ఆ చెట్లు కూలినప్పుడు కూడా భూమిలోని రాతి పొరల్లో అడ్జస్ట్​మెంట్​జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత ఈదురుగాలులు వచ్చినా అన్ని వేల చెట్లు నేలకొరగడం అసహజమన్న వాదన తాజాగా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆ చెట్లు కూలడానికి కారణం పాకాల సూపర్​గ్రూప్​లోని రాక్స్​లో అడ్జస్ట్​మెంట్​జరగడమేననే చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి స్థాయి అధ్యయనం జరిగాకే ఏదైనా క్లారిటీ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేమంటున్నారు. లోపల ఏం జరిగిందో తెలుసుకునేందుకు అక్కడి నేల శాంపిళ్లను సేకరించి విశ్లేషించనున్నారు. కాగా, భూకంప విషయం తెలిసి ఉదయం 11 గంటలకు ములుగు జిల్లా డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన సిబ్బందితో కలిసి చెట్లు కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు.

భయపడక్కర్లేదు: ఎన్​జీఆర్ఐ డైరెక్టర్  

రాష్ట్రంలో 55 ఏండ్ల తర్వాత ఇంతటి తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్​ఇనిస్టిట్యూట్​(ఎన్​జీఆర్ఐ) డైరెక్టర్​ప్రకాశ్ కుమార్ చెప్పారు. భూకంప తీవ్రత తక్కువేనని, భయపడాల్సిన​అవసరం లేదన్నారు. దాని ప్రభావం మధ్యస్థ స్థాయిలోనే ఉందన్నారు. ‘‘1969 జులై 5న భద్రాచలంలో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇదే ఇప్పటి వరకు హయ్యెస్ట్. ఆ తర్వాత 1983లో మేడ్చల్​లో 4.8 తీవ్రతతో వచ్చింది. మళ్లీ ఇప్పుడు 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, ఇవి అంత ప్రమాదం కాకపోయినా గోదావరి నది పరీవాహకంలో మాత్రం తరచూ సంభవిస్తుంటాయి. గోదావరి, కృష్ణా నదులు, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని నేల లోపలి పొరల్లో ఫ్రాక్చర్లు ఉన్నాయి. అలాగే పలు ఫాల్ట్​జోన్లూ ఉన్నాయి. ఇలాంటి చోట్ల భూకంపాలు సహజం. రాష్ట్రంలో ప్రాణహిత–-గోదావరి బేసిన్​లో భూకంప జోన్​లు ఉన్నాయి. వాటినే గోదావరి రిఫ్ట్​బేసిన్ అంటారు. అలాంటి ప్రాంతాల్లో నిత్యం సీస్మోలాజికల్​ఎఫెక్ట్స్​ను రికార్డ్​ చేస్తున్నాం” అని తెలిపారు. ఇక హైదరాబాద్​లోనూ భూకంపం వచ్చిందని చెప్పారు. ఎన్​జీఆర్ఐలో ఏర్పాటు చేసిన సీస్మోమీటర్లు భూకంప తీవ్రతను రికార్డ్​చేశాయని తెలిపారు.

Also Read : మేడారం అడవుల్లో పడిపోయిన చెట్లను పట్టించుకుంటలే

జోన్​3 లో ములుగు

భూకంపాలకు గురయ్యే ప్రాంతాల్లో ములుగు జిల్లా జోన్ 3లో ఉంటుంది. ములుగుతో పాటు, ఆసిఫాబాద్​, మంచిర్యాల, జయశంకర్​ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కూడా ఈ జోన్​లోకే వస్తాయి. మరోవైపు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలు జోన్​2లో ఉన్నాయి. జోన్​ 2 లో అత్యల్పంగా భూకంపాలుంటాయి. ​జోన్​3లో మాత్రం తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది. రిక్టర్​ స్కేల్​పై 6 లోపు తీవ్రత  నమోదవుతుంది. దీన్ని మోడరేట్​భూకంపం అంటారు. భూకంపాలు వచ్చే ప్రాంతాలు, వాటి తీవ్రతను బట్టి ఎర్త్​క్వేక్​ జోన్లు ఉంటాయి.