సూడాన్​ నుంచి 530 మంది తరలింపు

న్యూఢిల్లీ: పారామిటలరీ మధ్య పోరుతో అంతర్యుద్ధంలో చిక్కుకున్న సూడాన్ నుంచి ఇండియన్లను తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం కేంద్రం ‘ఆపరేషన్ కావేరీ’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఉన్న 3 వేల మంది ఇండియన్లను సురక్షితంగా తరలించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత వైమానిక దళం సంయుక్తంగా చర్యలు మొదలుపెట్టాయి. గురువారం రాత్రి వరకు ఆ దేశం నుంచి సుమారు 530 మందిని ఖాళీ చేయించినట్లు విదేశీ వ్యవహారాలశాఖ వర్గాలు వెల్లడించాయి. విదేశీయులను తరలించేందుకు సహకరించాలనే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో సూడాన్ లోని రెండు వర్గాలు 3 రోజుల పాటు కాల్పులు, వైమానిక దాడులకు విరామం ప్రకటించాయి.

ఈ గడువు ముగిసేలోపు సూడాన్ నుంచి సాధ్యమైనంత ఎక్కువ మంది ఇండియన్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండియన్ ఎయిర్​ఫోర్స్​కు చెందిన విమానాలు, నేవీ యుద్ధనౌకల ద్వారా తరలింపు పనులు చేపట్టారు. సూడాన్ నుంచి తొలుత సౌదీ అరేబియాలోని జెడ్డాకు తరలించి, అక్కడి నుంచి ప్రైవేట్ ఎయిర్‌‌లైన్స్ ద్వారా ఇండియాకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఐఎన్ఎస్ సుమేధ యుద్ధనౌక ద్వారా మొదటి విడతలో 278 మంది సౌదీకి చేరుకున్నారు. అలాగే రెండు ఎయిర్​ఫోర్స్ విమానాల ద్వారా 250 మందిని జెడ్డాకు తరలించారు. వీరిలో 160 మంది ఇండియాకు చేరుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి. సూడాన్ నుంచి వచ్చిన తమ రాష్ట్రాల వారిని సురక్షితంగా ఇంటికి చేర్చడం కోసం కేరళ, యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు హెల్ప్ డెస్క్​లు ఏర్పాటు చేశాయి.