సాధారణ ఇంటికి రూ. 53 వేల కరెంట్ బిల్లు..

మారు మూల గ్రామం..పెంకుటిల్లు..అందులో ఒక ఫ్యాను..ఒక బల్బ్..వీటికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మహా అయితే రూ. 100, లేదా రూ. 200 ..వేసవి కాలం కదా...పోనీ రూ. 500.  కానీ నిజామాబాద్ జిల్లాలో మంచిప్ప గ్రామంలో ఎంత వచ్చిందో తెలుసా..రూ. 53 వేల రూపాయలు..అవును అక్షరాలా రూ. 53 747. 

 
కంగుతిన్న కుటుంబ సభ్యులు

నిజామాబాద్ జిల్లా మంచిప్ప గ్రామంలో పేద కుటుంబానికి విద్యుత్  శాఖ అధికారులు షాకిచ్చారు. ఏప్రిల్ నెలకు సంబంధించి సునే సురేష్ వ్యక్తి ఇంటికి   రూ. 53,747 కరెంట్ బిల్లును అందజేశారు. దీంతో సునే సురేష్ కుటుంబం కంగుతిన్నది. ఒక ఫ్యాన్, ఒక బల్బ్ ఉన్న ఇంటికి రూ. 50వేలకు పైగా కరెంట్ బిల్లు రావడమేంటని ఆశ్చర్యపోయారు. 

కరెంట్ కట్...

రూ. 53,747 కరెంట్ బిల్లు కట్టాల్సిందేనని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.  అయితే అంత భారీ బిల్లు కట్టలేమని..తాము కూలీ పనిచేస్తూ జీవిస్తామని సునే సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు..కరెంట్ కనెక్షన్ ను తొలగించారు. దీంతో చీకట్లోనే వారి కుటుంబం ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.  బిల్లు కడితేనే కరెంట్ కనెక్షన్ ను పునరుద్దరిస్తామని తెలిపారు. దీంతో బాధితులకు ఏం చేయాలో అర్థమవడం లేదు. 

చిన్న ఇంటికి భారీ బిల్లు ఏంటి..

పెంకుటిల్లు...ఒకే ఫ్యాన్, ఒకే బల్డ్..అయినా ఇంత భారీ బిల్లు రావడమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రూ. 53 వేలపైగా కరెంట్ బిల్లు రావడంపై గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.