ఆఫ్రికా దేశం సూడాన్‌లో పారామిలటరీ మిలిటెంట్లు నరమేధం సృష్టించారు. ఓమ్‌దుర్మాన్‌లోని సబ్రీన్ మార్కెట్‌పై శనివారం (ఫిబ్రవరి 1) విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. మిలిటెంట్ల కాల్పుల్లో మార్కెట్‌కు వచ్చిన 54 మంది మరణించగా.. మరో 158 మంది గాయపడ్డారు. ఈ దాడి, మరణాల సంఖ్యను సూడాన్ ఆరోగ్య శాఖ అధికారులు ధృవీకరించారు. ఈ దురాగతానికి పాల్పడింది రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అని అధికారులు అనుమానిస్తున్నారు. సుడాన్ దేశ సైన్యానికి వ్యతిరేకంగా ఈ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ పని చేస్తోన్నట్లు అధికారులు వెల్లడించారు.
అయితే.. ఇప్పటి వరకు అయితే ఈ దాడికి ఆర్ఎస్ఎఫ్ బాధ్యత వహించలేదు. ఓమ్‌దుర్మాన్‌లోని సబ్రీన్ మార్కెట్లో జరిగిన మిలిటెంట్ల దాడిని సుడాన్ ప్రభుత్వ ప్రతినిధి ఖలీద్ అల్-అలీసిర్ తీవ్రంగా ఖండించారు. మృతులలో చాలా మంది మహిళలు, పిల్లలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దాడి ప్రైవేట్, పబ్లిక్ ఆస్తులకు విస్తృత విధ్వంసం కలిగించిందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఈ నేరపూరిత చర్య మిలీషియా రక్తపాత చరిత్రకు మరో నిదర్శమని.. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని కఠోరంగా ఉల్లంఘించడమే ఫైర్ అయ్యారు.
ALSO READ | అమెరికా విమాన ప్రమాదం..మనోళ్లు ఇద్దరు మృతి
కాగా, 2023 ఏప్రిల్‌లో మిలటరీ, ఆర్ఎస్ఎఫ్ నాయకుల మధ్య వివాదం మొదలైంది. ఇరు వర్గాల అధిపత్యం కోసం సుడాన్ రాజధాని ఖార్టూమ్‌లో మొదలైన వీరి పోరాటం క్రమంగా విస్తరించి దేశం మొత్తం వ్యాపించింది. మిలటరీ, ఆర్ఎస్ఎఫ్ ఘర్షణల వల్ల 28,000 కంటే ఎక్కువ మంది చనిపోగా.. లక్షలాది మంది తమ ఇళ్లను వదిలి పారిపోయారు. ఓ వైపు దేశంలో కరువు.. మరోవైపు మిలటరీ, ఆర్ఎస్ఎఫ్ ఘర్షణల వల్ల సుడాన్ లో ప్రజల జీవితం ఆగమ్యగోచరంగా మారింది. కరువు తాండవం చేయడంతో తినడానికి తిండి లేక కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గడ్డి తింటున్నారు.