- నాగర్‌కర్నూల్ జిల్లాలో పత్తాలేని 54 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్
నాగర్ కర్నూల్, వెలుగు: మిల్లుల్లో వడ్లు కనిపించక, సీఎంఆర్ బియ్యం రాక ఆఫీసర్లు అయోమయానికి గురవుతున్నారు. ఇన్ని రోజులు మిల్లర్లు చెప్పినట్లు వింటూ వచ్చిన సివిల్ సప్లై ఆఫీసర్లు, టార్గెట్ అందుకోలేక తంటాలు పడుతున్నారు. పాత బియ్యం ఇయ్యక పోతే కొత్త వడ్లు ఇయ్యమని బెదిరిస్తూనే బియ్యం ఇవ్వండని బతిమిలాడుతున్నారు. ఇప్పటి వరకు పుదుచ్ఛేరి నుంచి బియ్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు తాజాగా ఛత్తీస్గడ్, బీహార్ నుంచి బియ్యం తెప్పించి సీఎంఆర్‌కు జమ చేస్తున్నారు.
బ్లాక్‌లిస్టులో పెడతామని వార్నింగ్..
2021, 20-22 సంవత్సరాలకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇవ్వని మిల్లులను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి 2023 యాసంగి వడ్లు ఇవ్వమని ఆఫీసర్లు వార్నింగ్ ఇస్తున్నారు. కల్వకుర్తి, వంగూరు మండలాల్లోని రెండు మిల్లుల నుంచి 11 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉంది. ఈ రెండు మిల్లులకు పనిష్మెంట్ కింద 25 శాతం అదనంగా 14.90 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాలని సివిల్ సప్లై కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు అమలు కాలేదు. మూడేండ్లలో 5 సీజన్ల కింద 54 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రావాల్సి ఉన్నా, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు మిల్లర్లకు అండగా ఉంటూ ఏటా వడ్లు కేటాయిస్తున్నారు. సీఎంఆర్ కోటా ఇవ్వని మిల్లులు, చౌక బియ్యం నిల్వ, రవాణా చేస్తూ పట్టుబడిన మిల్లులకు వడ్లు ఇవ్వద్దని ఆదేశాలు ఉన్నా ఏదో విధంగా మేనేజ్ చేసి వడ్లు అలాట్ చేస్తున్నారు.
మిల్లర్లతో ఆఫీసర్ల మిలాఖత్..
జిల్లా ఏర్పాటు నుంచి సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో పాతుకుపోయిన ఆఫీసర్లు, కింది స్థాయి సిబ్బంది మిల్లర్లతో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వెహికల్స్ తనిఖీల్లో బియ్యం పట్టుబడినా, వాటిని విడిపించుకుని పోయిన ఘటనలున్నాయి. నాగర్ కర్నూల్ సివిల్ సప్లై గోదాం నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీ గతంలో పట్టుబడగా, బిజినేపల్లి, కల్వకుర్తి, తెల్కపల్లి, అచ్చంపేటలోనూ ఇదే దందా జరుగుతోంది.
ఛత్తీస్గడ్, బీహార్ బియ్యం..
ప్రభుత్వం నుంచి వడ్లు తీసుకున్న మిల్లర్లు టార్గెట్ ప్రకారం సీఎంఆర్ బియ్యం ఇవ్వకుండా రెండేండ్ల నుంచి తప్పించుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు వడ్లు అమ్ముకుని రేషన్ బియ్యాన్ని అడ్జస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేకపోవడంతో ఛత్తీస్గడ్, బీహార్ నుంచి కామన్ రైస్ తెప్పించి ఎఫ్‌సీఐకి ఇస్తున్నారు. తెలంగాణ బియ్యంతో పోలిస్తే వీటి ధర కూడా తక్కువే కావడంతో ఈ దందాకు తెరలేపినట్లు చెబుతున్నారు.
బఫర్ స్టాక్ ఉందట!
జిల్లాలోని రా, బాయిల్డ్ మిల్లుల్లో సీఎంఆర్ కోసం వడ్లు లేవని అంటుంటే, బఫర్ స్టాక్ ఉన్నట్లు సివిల్ సప్లై ఆఫీసర్లు రిపోర్ట్ ఇస్తున్నారు. బియ్యం దందాలో కీలక శాఖల ఆఫీసర్లు భారీగానే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వడ్లు, బియ్యం దందాలో చేతికి మట్టి అంటకుండా డబ్బు వస్తుండడంతో పొలిటికల్ లీడర్లు, ప్రజాప్రతినిధుల దృష్టి దీనిపై పడింది. గతంలో కల్వకుర్తి ప్రాంతంలో మాత్రమే కనిపించే రైస్ మిల్లులు, ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ ప్రారంభిస్తున్నారు. ఒక్క ఈ ఏడాదిలోనే 18 కొత్త మిల్లులు ఏర్పాటయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వడ్లు మాయం..
కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేస్తున్న వడ్లు నేరుగా రైస్ మిల్లులకు చేరుతోంది. జిల్లాలో సీజనల్ సాగు విస్తీర్ణానికి మించి వస్తున్న వడ్లు ఎక్కడివని జిల్లా అధికారులు ఏనాడు ఎంక్వైరీ చేయలేదు. వడ్లు పట్టిన తర్వాత వచ్చే బియ్యం సీఎంఆర్ కింద ఎఫ్‌సీఐ గోదామ్‌లకు చేరకపోవడం గమనార్హం. 2022 వానాకాలంలో బయట మార్కెట్లో క్వింటాల్ ధర రూ.2,700 పలకడంతో సగం మిల్లులు ఖాళీ అయ్యాయి. సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం బదులు రేషన్ బియ్యం అప్పగించారు. సంచిలో నుంచి కిలో బియ్యం తీయకుండానే రేషన్ షాప్ టూ స్టాక్ పాయింట్ ఫార్మూలా అమలు చేశారు. బియ్యం అటు నుంచి ఇటు తిప్పుతూ సొమ్ము చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో కాగితాలపైనే ఈ తతంగం నడిచిందనే ఆరోపణలున్నాయి