రాష్ట్రంలో బీసీలు 56.33%.. మొత్తం కోటి 99 లక్షల 85 వేల 767 మంది.. కులగణన నివేదికలో వెల్లడి

రాష్ట్రంలో బీసీలు 56.33%.. మొత్తం కోటి 99 లక్షల 85 వేల 767 మంది.. కులగణన నివేదికలో వెల్లడి
  • వెయ్యి పేజీలకు పైగా సర్వే రిపోర్టు.. కేబినెట్ సబ్ కమిటీకి అందజేత
  • కులగణన చరిత్రాత్మకం: కేబినెట్​ సబ్​ కమిటీ చైర్మన్​, మంత్రి ఉత్తమ్
  • బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడి
  • కులగణనలో తేలిన జనాభా లెక్కలు..
  • మొత్తం బీసీలు1,99,85,767..56.33%
  • ఇందులో ముస్లిం బీసీలు 35,76,588..10.08%
  • మొత్తం ఓసీలు  56,01,539..15.79%
  • ఇందులో ముస్లిం ఓసీలు 8,80,424.. 2.48%
  • ఎస్సీలు 61,84,319..17.43%
  • ఎస్టీలు 37,05,929..10.45%

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల లెక్క తేలింది. మొత్తం కోటి 99 లక్షల 85 వేల 767 మంది (56.33%) బీసీలు ఉన్నట్టు సమగ్ర కులగణన సర్వే రిపోర్టులో వెల్లడైంది. వీరిలో ముస్లింలు 35,76,588 మంది (10.08%) ఉన్నట్టు తేలింది. ప్రభుత్వం నిరుడు నవంబర్ లో రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టింది. మొత్తం కోటి 15 లక్షల 71 వేల 457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించింది.

అయితే కులగణన సర్వేలో వివరాలు ఇచ్చేందుకు 3,56,326 కుటుంబాలు నిరాకరించగా.. మిగతా కోటి 12 లక్షల15 వేల131 కుటుంబాల వివరాలను సేకరించింది. ఈ కుటుంబాలకు సంబంధించి మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది వివరాలను నమోదు చేసింది. ఈ కులగణన సర్వేకు సంబంధించిన పూర్తి నివేదికను ప్లానింగ్​శాఖ ఆదివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కేబినెట్ సబ్​కమిటీకి అందజేసింది.

వెయ్యి పేజీలకు పైగా ఉన్న ఈ రిపోర్టులో జిల్లాల వారీగా అన్ని కులాల జనాభా, సామాజిక, ఆర్థిక స్థితిగతుల వివరాలను అందులో పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీలు 1,99,85,767 మంది (56.33 శాతం), ఓసీలు 56,01,539 మంది (15.79%), ఎస్సీలు 61,84,319 మంది ( 17.43%), ఎస్టీలు 37,05,929 మంది(10.45% ) ఉన్నట్టు తేలింది. ఇక ముస్లింలు 44,57,012 మంది (12.56%) ఉన్నట్టు తేలగా.. వీరిలో ఓసీ ముస్లింలు 8,80,424(2.48%), బీసీ ముస్లింలు  35,76,588 మంది (10.08%) మంది ఉన్నట్టు వెల్లడైంది. అంటే ముస్లింలు కాకుండా బీసీల జనాభా 1,64,09,179 మంది (46.25%), ఓసీల జనాభా  44,21,115 మంది (13.31%) ఉన్నట్టు తేలింది.  

కులగణన మొదలైందిలా..  
అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలకే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024 ఫిబ్రవరి 4న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయించింది. కులగణన చేపట్టేందుకు అదే నెల 16న అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సర్వే చేపట్టేందుకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేసేందుకు సెప్టెంబర్ 12న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటైన సబ్ కమిటీ.. పలుమార్లు సమావేశమై సర్వేకు సంబంధించి ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. వీటిపై అక్టోబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ సర్వే పేరుతో కులగణన చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10న ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధివిధానాలతో జీవో నెంబర్ 18 జారీ చేసింది. నవంబర్ 6న రాష్ట్రంలో సర్వే మొదలవ్వగా, డిసెంబర్లో పూర్తయింది. 

50 రోజుల్లోనే సర్వే పూర్తి..  
రాష్ట్రంలో దాదాపు కోటి 15 లక్షల 71 వేల 457 కుటుంబాలు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రాన్ని 94,261 బ్లాక్​లుగా విభజించి.. ఒక్కో ఎన్యుమరేటర్​కు 150 ఫ్యామీలీలను అప్పగించింది. మొత్తం 94,863 మంది ఎన్యుమరేటర్లను, 10 మంది ఎన్యుమరేటర్లకు ఒకరు​చొప్పున 9,628 మంది  సూపర్​వైజర్లను నియమించింది. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి  కోటి 12 లక్షల15 వేల131 కుటుంబాల వివరాలను సేకరించారు. అంటే గుర్తించిన కుటుంబాల్లో 96.9% ఫ్యామిలీల వివరాలను నమోదు చేశారు. మరో 3.1 శాతం కుటుంబాలు (16 లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు.

కొన్ని చోట్ల కుటుంబాలు సర్వేకు నిరాకరించటం, కొన్ని ఇండ్లకు తాళాలు ఉండటం, కొన్ని కుటుంబాలు అందుబాటులో లేకపోవటం తదితర కారణాలతో వాళ్లు సర్వేలో పాలుపంచుకోలేదు. కేవలం 50 రోజుల్లోనే కులగణన సర్వే పూర్తి చేశారు. సర్వేలో సేకరించిన సమాచారాన్ని 76 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో డిజిటలైజ్ చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాయంతో పూర్తి నివేదికను సిద్ధం చేశారు. మొత్తంగా ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వేలో ఎన్యుమరేటర్లు, సూపర్​ వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కలిపి దాదాపు లక్ష మందికి పైగా పాలుపంచుకున్నారు. 

రాష్ట్ర జనాభాలో ఎవరెంత మంది? 

మగవాళ్లు

1,79,21,183 (50.51% )

ఆడవాళ్లు

1,75,42,597 (49.45% )

థర్డ్ జెండర్

13,774 (0.04%)

మొత్తం

3,54,77,554 (100%)