- 811 టీఎంసీల్లో సగమైనా దక్కించుకునేలా ప్రణాళికలు
- నేటి నుంచి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌లో ప్రధాన వాదనలు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జల వివాదాల అంశం కీలక దశకు చేరుకుంది. గురువారం నుంచి బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కృష్ణ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2)లో వాదనలు మొదలు కానున్నాయి. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు అఫిడవిట్లు, రీజాయిండర్లు వేసేందుకు అవకాశం ఇచ్చిన ట్రిబ్యునల్.. సాక్షులనూ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇక నుంచి రెండు రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ విననుంది. ఏడాదిలోపే విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణాలో సరైన వాటా దక్కించుకోవాలన్న పట్టుదలతో తెలంగాణ ఉంది. ఈ క్రమంలోనే బలమైన వాదనలు వినిపిస్తుండడంతో ఈసారి తెలంగాణకు న్యాయమైన వాటా దక్కనుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
2013లోనే తుది కేటాయింపులు చేసినా..
ఏపీతో పోలిస్తే తెలంగాణలో 70 శాతం వరకు కృష్ణా నది పారుతున్నందున ఆ మేరకు వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర సర్కార్ పట్టుబడ్తున్నది. అంతర్జాతీయ నదీ ఒప్పందాలకు అనుగుణంగా నదీ పరివాహకం ఎక్కువుండే ప్రాంతానికే ఎక్కువ వాటా దక్కాలని వాదిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ 1) 1973లో ఏపీకి 811 టీఎంసీలను గంపగుత్తగా కేటాయించింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా అవే కేటాయింపులు కొనసాగాయి. 2004లో నీటి కేటాయింపులను తేల్చేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. 2013లో తుది తీర్పునిచ్చిన ట్రిబ్యునల్.. ఉమ్మడి ఏపీకి 1,001 టీఎంసీలు, కర్నాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలను కేటాయించింది. అయితే దానిపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేయలేదు. ఫలితంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులనే అమలు చేస్తూ వస్తున్నారు.
తెలంగాణకు అన్యాయం..
రాష్ట్రం ఏర్పడ్డాక నీటి కేటాయింపుల విషయంలో న్యాయమైన వాటాలను ఇచ్చేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచాలని కేంద్రాన్ని తెలంగాణ కోరింది. దీంతో అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను జోడిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులను చేపట్టే బాధ్యత ట్రిబ్యునల్‌కే అప్పగించింది. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య 2015లో అవగాహన ఒప్పందం జరిగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ కేవలం 34 శాతం (299 టీఎంసీలు) నీళ్లే కేటాయించారు. ఏపీకి మాత్రం 66 శాతం మేర 512 టీఎంసీల జలాలిచ్చారు. దీనికి 2015లో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ అడ్డంగా తలూపి ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి అవే కేటాయింపులకు ఏపీ పట్టుబడుతున్నది. మన సర్కార్ మాత్రం 555 టీఎంసీలు ఇవ్వాలని వాదిస్తున్నది. అది సాధ్యం కాకుంటే సగం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది.
సెక్షన్ 3 ప్రకారమే చేపట్టాలె..
నీటి కేటాయింపుల విషయంలో సెక్షన్ 3 ప్రకారమే విచారణ చేపట్టాలని, ఆ అంశాలనే పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన గంపగుత్త జలాలను సమానంగా పంచేందుకు వాదనలు వినాలని డిమాండ్ చేస్తున్నది. కేంద్రం ఇచ్చిన గెజిట్‌ను ట్రిబ్యునల్‌కు సూచిస్తున్నది. అయితే ఏపీ మాత్రం విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు వినాలని వాదిస్తోంది. కృష్ణాపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు జూరాల ప్రాజెక్టుకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేయాలని డిమాండ్ చేస్తోంది.
ఎన్‌బ్లాక్ కేటాయింపులని పంచడానికి ముందే చేపట్టాలని అంటోంది. అంతేగాకుండా ఉమ్మడి ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రొటోకాల్‌ను తేల్చాలని వాదిస్తోంది. వాస్తవానికి సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ఆపరేట్ చేస్తున్నది. దీనిపై గతంలో ఏపీ ఘర్షణ పడింది. సగం ప్రాజెక్టును తన అధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించింది. గొడవల నేపథ్యంలో ప్రాజెక్టుల ఆపరేషన్‌ను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు కేంద్రం అప్పగించింది. దాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తున్నది. ఏపీ మాత్రం ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషనల్ ప్రొటోకాల్‌పైనా విచారించాలని తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.