- తక్షణ సాయంగా అందించాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి
- అధికారులతో నష్టం అంచనాల తయారీ.. కేంద్రానికి నివేదిక
- తాత్కాలిక రిపేర్లకు 75 కోట్లు.. శాశ్వత రిపేర్లకు 483 కోట్లు ఇవ్వాలని వినతి
హైదరాబాద్, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కాలువలకు జరిగిన నష్టంపై ఇరిగేషన్ శాఖ అంచనాలను రూపొందించింది. పంప్‌హౌస్‌లు, చెరువులు, కాలువలు, చెక్డ్యామ్స్కు జరిగిన నష్టంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేసి, అధికారులతో అంచనాలను తయారు చేయించారు. వానాకాలం పంటను కాపాడడంతోపాటు నీటిసరఫరా పునరుద్ధరణ లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా తాత్కాలిక మరమ్మతులకు రూ.75 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.483 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశారు. మొత్తంగా ఇరిగేషన్ శాఖకు తక్షణ సాయంగా రూ.558 కోట్లు అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి.. ఇటు సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి.. దెబ్బతిన్న కాలువల మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించారు. ఆర్థిక శాఖ అనుమతులు లేట్‌కాకుండా జాగ్రత్తపడ్డారు. కాగా, ప్రస్తుతం 94 భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల్లో నీటినిల్వలు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయి.
చాలా ప్రాజెక్టులకు నష్టం
గత నెల 31న పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో 25 సెంటీమీటర్ల నుంచి 45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 773 చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. చిన్ననీటిపారుదల పరిధిలోని చెరువులకు 265 చోట్ల గండ్లు పడగా.. 285 చెరువులు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. మధ్యతరహా, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు చెందిన కాలువలకు 132 చోట్ల గండ్లు పడగా.. 83 చోట్ల దెబ్బతిన్నాయి. వాటితోపాటు నాగర్‌కర్నూలు జిల్లా కుమ్మెర సమీపంలో పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయింది. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పంప్‌హౌస్ మునిగి, పరికరాలు దెబ్బతిన్నాయి. ఇటు కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో రివ్యూ చేసి, వాటి రిపేర్లకు అయ్యే ఖర్చుల వివరాలపై అంచనాలు తయారు చేయించారు. అలాగే, అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు అధికారులతో రివ్యూ చేశారు.