రూ.56లక్షల విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలం,వెలుగు:  భద్రాచలంలో  బొలేరో వెహికల్​లో  సీక్రెట్​ చాంబర్​ ఏర్పాటు చేసుకుని అక్రమంగా తరలిస్తున్న 280 కిలోల గంజాయిని పోలీసులు సోమవారం కాపుకాసి పట్టుకున్నారు.  సీఐ నాగరాజురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఏఎస్పీ పంకజ్​ పారితోశ్​ ఆదేశాలతో  టౌన్​ ఎస్సై మధుప్రసాద్​ భద్రాచలం ఫారెస్ట్ చెక్​ పోస్టు సమీపంలో తనిఖీలు చేస్తున్నారు.  ఒడిశాలోని కలిమెల ప్రాంతం నుంచి  బొలేరో వాహనంలో హైదరాబాద్​కు చెందిన డ్రైవర్​ మహ్మద్​ జాఫర్​ఖాన్​, కర్నాటకలోని బీదర్​కు చెందిన అజాజ్ అహ్మద్​, ఫిరోజ్​ఖాన్​ గంజాయిని భద్రాచలం మీదుగా కర్నాటకు తీసుకెళ్తున్నారు.  సీక్రెట్​ చాంబరు ఏర్పాటు చేసుకుని అందులో 140 ప్యాకెట్ల గంజాయి పెట్టారు. ఒక్కో ప్యాకెట్​ 2కిలోలు ఉంటుంది. దీని విలువ రూ.56లక్షలు ఉంటుంది. హైదరాబాద్​కు చెందిన జహంగీర్​ ఖురేషీ,  ఎండీ మాసి ఉద్దీన్​ బొలేరో వాహనంలో కలిమెల(ఒడిశా)లోని  గంజాయి వ్యాపారి నుంచి కొనుగోలు చేసి భద్రాచలం, హైదరాబాద్​ మీదుగా కర్నాటకకు తరలిస్తున్నారు. వాహనంతో పాటు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగరాజురెడ్డి వెల్లడించారు.

30 కేజీల గంజాయి పట్టివేత

జూలూరుపాడు: కొత్తగూడెం నుంచి తల్లాడ వెళ్లే రోడ్డు మార్గంలో  అక్రమంగా గంజాయి తరలిస్తున్న కారును పట్టుకున్నారు.   అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి దాదాపు 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.