బీసీలు సీఎం ఎందుకు కావొద్దు?

ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి రెండు రాష్ట్రాలుగా విడిపోయే వరకు 58 ఏండ్లలో ఉమ్మడి రాష్ట్రాన్ని16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. వారందరిలో ఒకే ఒక్కరు ఎస్సీ. ఆయనే దామోదరం సంజీవయ్య. ఆయన కూడా కేవలం 2 ఏండ్ల 2 నెలలు మాత్రమే పదవిలో ఉన్నారు. మిగిలిన15 మంది అగ్రవర్ణాల సీఎంలే. టి.అంజయ్య విషయంలో బీసీ అని కొందరు, కాదు.. రెడ్డి అని కొందరు అంటారు. ఏది ఏమైనా 50 శాతం కంటే ఎక్కువ ఉన్న బీసీలు ముఖ్యమంత్రి పదవికి ఇంకా దూరంగానే ఉండాల్సి వస్తోంది. బీసీలు ఇప్పటికైనా మేల్కొని అనైక్యత, కుల వైషమ్యాలను ఛేదించి రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. 

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్​లో 51 శాతం, తెలంగాణలో 56 శాతం బీసీ జనాభా ఉంది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేనంత ఎక్కువ శాతం బీసీలు తెలంగాణలో ఉన్నారు. 2023 లేదా 2024లో ఎన్నికలు రావొచ్చు. ఈసారి ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా సాగనుంది. ప్రధాన పార్టీలు మూడూ.. ‘మాదే అధికారం, మాదే ప్రభుత్వం’ అని ఇప్పటి నుంచే చెప్పుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితిని పరిశీలిస్తే ప్రజల్లో కొంత వరకు వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే. కారణం కుటుంబ పాలన, అవినీతి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు టీఆర్ఎస్​ బస్తీ లీడర్లపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటం. ఆయా శాఖల ఉద్యోగుల్లో కూడా పారదర్శకత లోపించింది. ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇప్పుడు పీకల లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఉప ఎన్నికల ముందే దళిత బంధు లాంటి కీలక పథకాల ప్రకటనలు ప్రజలు గమనిస్తున్నారు. ఓటుకు పదివేలు ఇచ్చైనా సరే కొనుక్కునే స్థోమత ఆ పార్టీకి ఉందనేది విశ్లేషకుల మాట. టీఆర్ఎస్ కు 40 శాతం ఓట్లు వచ్చి, మిగిలిన 60 శాతం కాంగ్రెస్​, బీజేపీల మధ్య చీలితే.. తిరిగి అధికారంలోకి వచ్చింది అనుకుందాం. అప్పుడు రాష్ట్రంలో ఉన్న ఒక బీసీ నేత ముఖ్యమంత్రి కాగలరా? కలలో కూడా అది జరగదు. అయితే కేసీఆర్ లేదంటే ఆయన కుమారుడు కేటీఆర్ సీఎం అవుతారు. ఇద్దరు ముగ్గురు బీసీలు మంత్రులు అయినా, వాళ్లు గెస్ట్​ఆర్టిస్టులుగానే ఉంటారు. ఇది టీఆర్​ఎస్ లో బీసీల పరిస్థితి.

కాంగ్రెస్​లో అవకాశం ఉందా?

ఆంధ్రప్రదేశ్​ఏర్పడిన1956 నుంచి 1982 వరకు కాంగ్రెస్​ అధికారంలో ఉంది. ఈ 26 ఏండ్లలో 9 మంది ముఖ్యమంత్రులు అయినా, అందులో ఒక్క బీసీ నేత కూడా లేకపోవడం గమనార్హం. ఒకరు ఎస్సీ తప్ప మిగతా వాళ్లందరూ అగ్రవర్ణ నాయకులే. ఇక తెలుగు దేశం ఆవిర్భవించిన తర్వాత1983 నుంచి 2014 వరకు 31 ఏండ్లలో టీడీపీ అయితే కమ్మ, కాంగ్రెస్​అయితే రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారే తప్ప బీసీ నేత కాలేదు. 1956 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీని పరిశీలిస్తే, పార్టీ పటిష్టతకు, అధికారంలోకి రావడానికి బీసీలు ఎంతో శ్రమించారు కానీ, ముఖ్యమంత్రి పదవికి ఎక్కడా పనికిరాలేదు. ఉదాహణకు 2004 ఎన్నికలు ముందు డి.శ్రీనివాస్​ కాంగ్రెస్​అధ్యక్షుడిగా ఊరూరూ తిరిగి పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశారు. ఫలితాలు కాంగ్రెస్​కు అనుకూలంగా వెలువడ్డాయి. అందరూ డి.శ్రీనివాసే ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. కానీ ఢిల్లీలో ఏం జరిగిందో తెలియదు కానీ వై.ఎస్.రాజ శేఖర్​రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే వంట అంతా ఒకరు చేస్తే, ఇంకొకరు వచ్చి భోజనం చేసినట్టు. ఇలాంటి ఎన్నో సంఘటనలు బీసీ నేతలను సీఎం పదవికి దూరం చేశాయి. కాంగ్రెస్​ పార్టీలో డా.లక్ష్మీ నరసయ్య, జగన్నాథం, వి. హన్మంతరావు, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ ఇలా ఎంతోమంది నాయకులు కాంగ్రెస్​ పార్టీలో మంచి స్థితిలో ఉండి కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్​ మునిపోతున్న పడవ. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్​అధ్యక్షుడు కాగానే కేసీఆర్​ను మోడీని పచ్చిగా విమర్శించడం మొదలు పెట్టారు. తెలుగు దేశంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్​కంటే కూడా ఆయనే కాంగ్రెస్​ను ఎక్కువ తిట్టారు. కాకపోతే ఆయన చమత్కారమైన ప్రసంగాలతో సభికులను ఆకర్షించడంలో దిట్ట. కాంగ్రెస్​రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా? అనే ప్రశ్న కాసేపు పక్కన పెడితే.. బీసీ నేత ముఖ్యమంత్రి కాగలరా? రేవంత్​ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్​రెడ్డి, జగ్గారెడ్డి లాంటి వారు ఒక బీసీని సీఎంగా ఒప్పుకోగలరా? 

బీజేపీలో ?

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆ పార్టీ నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఒక బీసీ నేత అయిన మోడీ గుజరాత్​ముఖ్యమంత్రిగా తనను తాను నిరూపించుకొని, ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయనకు దేశంలోని అన్ని రాష్ట్రాలు సహా విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్​ఉంది. అమెరికా అధ్యక్షుడు ‘మోడీ ఇస్​అవర్​ హీరో’ అన్నాడు. రష్యా ప్రధాని ‘మోడీ ఈజ్ నంబర్​వన్ పొలిటీషియన్​ ఇన్​ది వరల్డ్​’ అన్నాడు. బ్రిటన్​ప్రధాని ‘మోడీ ఈజ్​అట్రాక్టివ్ పొలిటీషియన్​ఇన్ ది వరల్డ్’ అన్నాడు. ఇలా ప్రపంచ దేశాల నాయకులు మోడీని మెచ్చుకుంటున్నారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఇమ్రాన్​ఖాన్, పాకిస్తాన్​ ప్రజలు కూడా ఒక సందర్భంలో మోడీకి జిందాబాద్ ​కొట్టారు. సెప్టెంబరు 9న భద్రతా మండలిలో మోడీ అధ్యక్షోపన్యాసం ఇస్తున్నారు. మొదటిసారి ఓ భారతీయుడికి ఈ గౌరవం దక్కబోతోంది. ఒక బీసీ నేతగా ఆయన నిజాయితీ, నిడారంబరతలే ఎక్కువ మంది ప్రజలను ఆకట్టుకోగలుగుతోంది. నరేంద్ర మోడీ చరిష్మా, రాష్ట్ర బీజేపీ నేతల పోరాటాల వల్ల బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరవుతారు? అంటే బండి సంజయ్, ఈటల రాజేందర్​, డా.లక్ష్మణ్ అయినా, అర్వింద్​ తదితర బీసీ నేతల పేర్లు చాలా ఉన్నాయి. 

బీసీలు మారాలె..

రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలు ఎప్పుడూ పాలితులుగానే ఉంటున్నారు తప్ప పాలకులుగా మారడం లేదు. కొన్ని అగ్రకులాలే అధికారాన్ని, పాలనను తమ గుప్పిట్లో పెట్టుకొని బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. పార్టీ ఏదైనా, సంఘం ఏదైనా బీసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని డిమాండ్​చేయాలి. మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా, అవసరమైతే సీఎం పదవి బీసీలకు కేటాయించేలా పార్టీ అధినాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే రాజ్యాధికారం సిద్ధించి బీసీల బతుకులు మారతాయి. 
- మునిగంటి శతృఘ్నాచారి,
కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం