వరంగల్, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ టైంలో రాళ్ల వాన కారణంగా వేలాది మంది రైతులు పంట నష్టపోయారు. దీంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలని చెప్పడంతో పంట నష్టం అంచనాకు వచ్చామని చెప్పారు. రేపో ఎల్లుండో ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు చేరుతుందని.. త్వరలోనే రైతులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. తీరా చూస్తే.. సంక్రాంతి పోయి దసరా వచ్చింది.. నేటికీ రైతులకు పరిహారం మాత్రం అందలేదు.
ఓరుగల్లులో జనవరి 11న కురిసిన అకాల వానలకు మొక్కజొన్న, మిర్చి, పత్తి, వేరుశనగ, జొన్నలు, మినుములు, సన్ ఫ్లవర్, పండ్ల తోటలు నీట మునిగాయి. ఇంకొన్ని వారాల్లో చేతికొచ్చే పంట రాళ్లవానతో రాత్రికి రాత్రి నేలమట్టమైంది. చాలాచోట్ల ఇండ్లు కూలాయి. హోరుగాలికి కరెంట్వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. ట్రాన్స్ ఫార్మర్లు కిందపడి సబ్ స్టేషన్లలో సర్వీస్ ఆగింది. చాలా గ్రామాలు చీకట్లోనే గడిపాయి. కండ్లముందే పాలిచ్చే పశువులు చనిపోయాయి. వేలాది మంది రైతన్నలు పండుగ పూట పస్తులతో గడిపారు. వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి జయశంకర్ జిల్లాల పరిధిలో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 56 వేల ఎకరాల్లో చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు పేర్కొన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాలు, 402 గ్రామాల్లోని 26,388 మంది బాధిత రైతులున్నట్లు అంచనా వేశారు.
మంత్రుల కాళ్లు మొక్కి.. కన్నీరు పెట్టిన రైతులు
ఉమ్మడి ఆరు జిల్లాల్లో వేలాది మంది రైతులు పంట నష్టపోవడంతో సీఎం కేసీఆర్ జనవరి 18న తానే స్వయంగా పంట నష్టం చూడటానికి రానున్నట్లు తెలిపారు. ఆపై తన పర్యటనను రద్దు చేసుకుని.. మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‍రావుతో పాటు రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, జడ్పీ చైర్‍పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‍రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి బృందాన్ని పంపారు. తమను ఆదుకోవాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేల కాళ్ల మీద రైతులు పడ్డారు. పరకాల మండలం నాగారానికి చెందిన మహిళ నేలరాలిన మిర్చి పంట చూపుతూ కన్నీరు పెట్టారు. ‘మీ కాల్మొక్తం సార్.. మమ్మల్ని ఆదుకోవాలి’ అంటూ వెక్కివెక్కి ఏడ్చారు. ఈ సందర్భంగా మంత్రులు, లోకల్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ‘మీకు సాయం చేయడానికే సీఎం సార్ మమ్మల్ని పంపిండు. కేసీఆర్ మనసున్న మారాజు. త్వరలోనే మిమ్మల్ని తప్పకుండా ఆదుకుంటాం’ అని హామీ ఇచ్చి వెళ్లారు.
మన రైతుల్ని వదిలేసి.. పంజాబ్లో సాయం
సాగు చట్టాల రద్దు కోసం పోరాడి మరణించిన దాదాపు 600 మంది పంజాబ్ రైతులు, జవాన్ కుటుంబాలకు సాయం చేస్తామని సీఎం కేసీఆర్ఐదు నెలల క్రితం ప్రకటించారు. మే నెలలో చండీగఢ్ వెళ్లిన కేసీఆర్ఒక్కో రైతు కుటుంబానికి రూ. 3 లక్షల చొప్పున తెలంగాణ సర్కారు తరఫున పంపిణీ చేశారు. అదే సమయంలో రాష్ట్ర రైతుల గోసను, వారికిచ్చిన మాటను మాత్రం మరిచారు. మన రైతుల పంట నష్ట సాయానికి సంబంధించి జిల్లా కలెక్టరేట్లలో రివ్యూలు నిర్వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు రేపుమాపు అంటూ సంక్రాంతి నుంచి దసరా పండుగ వరకు కాలం వెళ్లదీస్తూ వచ్చారు. కానీ పరిహారం మాత్రం ఇవ్వడం లేదు.
ఇంకా పరిహారం ఇయ్యలే
పోయినేడాది చివర్లో రూ. 5 లక్షలు ఖర్చుచేసి మూడు ఎకరాల్లో మిర్చి పంట వేశా. రాళ్ల వానకు చేతికొచ్చిన పంట మొత్తం నాశనమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మా దగ్గరకొచ్చిన్రు. సీఎం సార్ ఆదుకోడానికి రెడీగా ఉన్నారని.. నష్టపరిహారం త్వరగా ఇప్పించే బాధ్యత వారిదేనని మాటిచ్చారు. ఇప్పటికి తొమ్మిది నెలలు దాటింది. మంత్రులు, మా ఎమ్మెల్యే చెప్పినట్లు సాయం మాత్రం అందలేదు.
- రాచమల్ల రవి, పరకాల