- డిపోల నుంచి వైన్స్, బార్లకు భారీగా లిఫ్టింగ్
- న్యూ ఇయర్ వేడుకల కోసం ముందస్తు కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు : కొత్త ఏడాది వేడుకల కోసం ముందస్తుగానే లిక్కర్ స్టాక్స్‌ను వైన్స్, బార్లు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో లిఫ్ట్ చేసుకున్నాయి. ఆదివారం మద్యం డిపోలకు సెలవు అయినప్పటికీ లిక్కర్ స్టాక్ పంపిణీ చేసేందుకు వాటిని ఓపెన్ పెడుతున్నారు. మూడు రోజుల్లోనే అంటే ఈ నెల 26, 27, 28 తేదీల్లోనే రూ.565 కోట్ల మద్యం డిపోల నుంచి స్టాక్ వైన్‌షాపులు, బార్లకు చేరింది.
శనివారం ఒక్కరోజే ఈ అమ్మకాలు రూ.187 కోట్లకు రీచ్ అయినట్లు ఎక్సైజ్ వర్గాలు వెల్లడించాయి. సాధారణ రోజుల్లో యావరేజ్‌గా వంద కోట్ల నుంచి రూ.120 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతాయి. ఇయర్ ఎండ్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఈవెంట్లకు లిక్కర్‌తో కూడిన పర్మిషన్లు ఉంటాయి. దీంతో భారీగా లిక్కర్, బీర్లు అవసరం పడుతాయి.
Also Read :- కేటీఆర్‌కు ఈడీ సమన్లు
‘నో స్టాక్’ అనే బోర్డు లేకుండా ఉండేందుకు నిర్వాహకులు ముందస్తుగానే భారీగా లిక్కర్‌ను కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ఈ నెలలో ఇప్పటికే మద్యం అమ్మకాలు రూ.3 వేల కోట్లు దాటాయి. నెలఖారుకు ఇంకో వెయ్యికోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.