షాకింగ్ ఘటన.. ఇంటి ముందు భర్త శవం.. ఇంట్లో భార్య దారుణ హత్య

షాకింగ్ ఘటన.. ఇంటి ముందు భర్త శవం.. ఇంట్లో భార్య దారుణ హత్య

ముంబై నగరంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ ముందు ఒక వ్యక్తి శవమై పడి ఉండగా, ఇంట్లో అతని భార్య కూడా అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. ఈ ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. ముంబైలోని జవహర్నగర్లో ఉన్న టోపీవాలా మాన్షన్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. టోపీవాలా మాన్షన్ అపార్ట్మెంట్ ఫ్లాట్లో కిషోర్ పెడ్నేకర్ అనే 58 ఏళ్ల వృద్ధుడు తన భార్యతో కలిసి ఉంటున్నాడు. జిమ్ ఎక్విప్మెంట్కు సంబంధించిన సేల్స్మెన్గా కిషోర్ పనిచేస్తుండేవాడు. ఆయన భార్య పేరు రాజశ్రీ. 57 సంవత్సరాల వయసున్న ఆమె థెరపిస్ట్గా పనిచేస్తుండేది. వీళ్ల కొడుకు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఏం జరిగిందో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం తాను ఉంటున్న అదే అపార్ట్మెంట్ ముందు కిషోర్ రక్తపుమడుగులో పడి ఉన్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన కిషోర్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన భార్యకు కిషోర్ చనిపోయిన విషయం చెబుదామని ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో.. పోలీసులకు అనుమానం వచ్చి కిషోర్ ఫ్లాట్కు వెళ్లి చూశారు. డోర్ లోపలి వైపు లాక్ చేసి ఉంది.

కిషోర్ మెడలో రెండు కీస్ను పోలీసులు గమనించారు. ఆ కీస్తో ట్రై చేసి చూడగా ఫ్లాట్ డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్లి చూడగా విస్తుపోయే దృశ్యం పోలీసులకు కనిపించింది. హాల్లో రాజశ్రీ మృతదేహం కనిపించడంతో ఆమెను కిషోర్ హత్య చేసి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు  అనుమానిస్తున్నారు. కొంత కాలంగా కిషోర్ డిప్రెషన్తో బాధపడుతున్నాడని ఇంట్లో మెడిసిన్స్ చూశాక అర్థమైంది. చనిపోయే ముందు ఢిల్లీ నుంచి ముంబైకి తన కొడుకుకు కిషోర్ ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఆయనకు అప్పులేమైనా ఉన్నాయేమోననే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.