
కాబుల్: ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ దేశ సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించింది. శనివారం (ఏప్రిల్ 19) మధ్యాహ్నం సంభంవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల నేపథ్యంలో ఆప్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంభందించిన వివరాలు తెలియాల్సి ఉంది.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం.. ఈ భూకంపం శనివారం (ఏప్రిల్ 19) మధ్యాహ్నం 12:17 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూమికి 86 కి.మీ లోతులో ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. ఇది టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంప కార్యకలాపాలకు గురయ్యే ప్రాంతమని తెలిపింది.
ఈ భూకంప ప్రభావం భారత్ పైన చూపించింది. కాశ్మీర్, ఢిల్లీ -ఎన్‌సీఆర్ సహా ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలలో స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.