దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కేసులు రోజురోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆరుగురు చనిపోయారనే వార్తలు వినిపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం కేవలం ఇద్దరే మృతి చెందినట్టుగా చెబుతోంది. ఇక పలు రాష్ట్రాల్లో అమాంతం పెరుగుతున్న ఇన్‌ఫ్లుయెంజా కేసులు మరింత దడ పుట్టిస్తున్నాయి. హాంకాంగ్ వైరస్ పిలుచుకునే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ కారణంగా జనవరి 2 నుంచి మార్చి వరకు 5,451 కేసులు నమోదైనట్టు సమాచారం. తాజాగా ఒడిశాలో గత రెండు నెలల్లోనే 59 హెచ్3ఎన్2 (H3N2) ఇన్‌ఫ్లుయెంజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో మొత్తం 225 నమూనాలను సేకరించామని, అందులో 59 మందికి వైరస్ నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. వారిలో సాధారణంగా సీజనల్ వ్యాధుల్లానే వారిలో లక్షణాలు ఉన్నాయని, వాటికి తోడు జర్వం, దగ్గు కూడా ఉన్నాయని వెల్లడించారు.
కరోనా తరహా లక్షణాలు కలిగిన ఇన్‍ఫ్లుయెంజా దేశ వ్యాప్తంగా అలజడి రేపుతోంది. ఇతర రకాల వైరస్ లతో పోల్చుకుంటే ఈ హెచ్3ఎన్2 సబ్‍టైప్ కాస్త తీవ్రంగా వ్యాపిస్తోంది. దీని వల్లే దేశంలో జర్వం కేసులు నానాటికీ పెరుగుతున్నాయని కేంద్రం భావిస్తోంది. హెచ్3ఎన్2 ప్రాణాంతకం కాదని నిపుణులు చెబుతున్నప్పటికీ.. తగిన జాగ్రత్తలు మాత్రం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.