
60 సంవత్సరాలు వచ్చాక చాలా మంది ఉద్యోగాలకు, బిజినెస్ ఇలా అన్నింటికీ గుడ్ బై చెప్పి ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, మనువళ్లు, మనువరాళ్లతో ఆనందంగా గడిపేందుకు ఇష్టపడుతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఏజ్‌ను లెక్క చేయకుండా ఈ వయస్సులోనూ తమకు నచ్చిన పనులు చేస్తారు. అలాంటి వారిలో ఒకరే వసంతి చెరువువీట్టిల్. కేరళ రాష్ట్రానికి చెందిన వసంతి చెరువువీట్టిల్ 59 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ సోలో ట్రెక్ పూర్తి చేసి రికార్డ్ సృష్టించారు. ఇందులో ఇంకా హైలెట్ ఏంటంటే.. యూట్యూబ్‌లో వీడియోస్ చూసి ఆమె ట్రెక్కింగ్ నేర్చుకోవడం.
వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన వసంతి చెరువువీట్టిల్ 59 ఏళ్ల వయస్సులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని డిసైడ్ అయ్యారు. వసంతి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు, తెలిసిన వారు వ్యతిరేకించారు. ఈ వయస్సులో ట్రెక్కింగ్ ఏంటి అంటూ మరికొందరు అవమానించారు. ట్రెక్కింగ్ గురించి కనీస అనుభవం కూడా లేకుండా ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నించారు. కానీ విమర్శలు, అవమానాలకు తలొగ్గని వసంతి.. మెక్కవోని ధైర్యంతో ముందుకు సాగారు.
నాలుగు నెలల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రతిరోజూ మూడు గంటలు నడవడం, సౌకర్యానికి అలవాటు పడటానికి ట్రెక్కింగ్ బూట్లు ధరించడం.. సాయంత్రం 5-6 కిలోమీటర్లు నడవటం వంటివి చేశారు. అలాగే.. ట్రెక్కింగ్ గురించి తెలుసుకోవడానికి ఆమె యూట్యూబ్‌లో వీడియోలు చూశారు. ట్రెక్కింగ్ పద్ధతులు, చిట్కాలకు సంబంధించిన అనేక వీడియోలు యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ట్రెక్కింగ్ మొదలుపెట్టాక ఆమెకు అసలైన సవాళ్లు ఎదురయ్యాయి.
Also Read :- టేస్టీ అట్లాస్ ర్యాంకింగ్స్.. వరల్డ్ బెస్ట్ రోటీగా..బటర్ గార్లిక్ నాన్
నేపాల్ చేరుకున్న తర్వాత ఎవరెస్ట్‌కు వెళ్లే మార్గంలో కీలక గమ్యస్థానమైన లుక్లాకు వెళ్లేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో ఆమె విమాన ప్రయాణం రద్దు అయ్యింది. చాలా మంది ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తారు.. కానీ బసంతి ముందు అలాగే ముందుకు వెళ్లారు. ప్రతి రోజు కొత్త సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. మధ్యలో పరిచయమైన కొందరు ట్రెక్కర్లు వసంతికి మద్దతుగా నిలిచారు. కొన్ని సార్లు వాతావరణం అనుకూలించకపోవడం, మరికొన్ని సార్లు అనారోగ్య సమస్యలు ఎలా ఎన్నో అవరోధాలను దాటుకుంటు చివరకు తన లక్ష్యాన్ని చేరుకున్నారు వసంతి చెరువువీట్టిల్.
ఎట్టకేలకు ఎవరెస్ట్ శిఖర అంచులకు చేరుకుని పలువురు అసాధ్యం అన్న తన కలను సాధ్యం చేసి చూపించారు. ఎవరెస్ట్ శిఖరంపై తన కేరళ మూలాలకు చిహ్నంగా భావించే సాంప్రదాయ కసవు చీరను ధరించి భారత జెండాను గర్వంగా ఊపింది. ఆ అద్భుతమైన చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వసంతి గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టి.. చివరకు ఆమె సక్సెస్ స్టోరీ తెలుసుకుని హ్యాట్సాఫ్ అంటున్నారు. 59 ఏళ్ల వయస్సులో యూబ్యూట్ వీడియోలు చూసి ఎవరెస్ట్ శిఖరం ఎక్కడం అనేది సాధారణ విషయం కాదని.. గ్రేట్ ఉమెన్ అని.. డ్రీమ్ అచీవర్ అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.