- భువనగిరి డివిజన్లో 64 ఎకరాలు సేకరించాలని మరో గెజిట్
- భూములు ఇవ్వబోమన్న - రైతుల పోరాటం వృథా
- మంత్రి జగదీశ్‌రెడ్డిని అడ్డుకోవడంతో నాన్‌బెయిలెబుల్ కేసులు ఎదుర్కున్న రైతులు
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా మీదుగా 59.33 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా ఆందోళన చేసి జైలుకు వెళ్లి వచ్చినా న్యాయం జరగలేదు. ముందు అనుకున్న దానికన్నా ఎక్కువ భూమిని సేకరించాలని ప్రభుత్వం మరో గెజిట్‌ను రిలీజ్ చేసింది.
జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి మున్సిపాలిటీ, వలిగొండ, చౌటుప్పల్ మండలాల మీదుగా రోడ్డు నిర్మాణం కానుంది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డును జిల్లా రైతులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రోజుల తరబడి ఆందోళనలు నిర్వహించారు. గతంలో పలుమార్లు భూములు కోల్పోయామని, మళ్లీ కోల్పోవడానికి సిద్ధంగా లేమని వాపోయారు. పోలీసుల సహకారంతో రెవెన్యూ ఆఫీసర్లు సర్వే చేశారు. రైతుల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి గతేడాదిలో నిర్వహించిన సమావేశాల్లోనూ తాము భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అయినా ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ పై రై తుల అభ్యంతరాలను అధికారులు తోసిపుచ్చారు.
జైలుకు రైతులు...
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చే స్తూ రైతులు మే 30న యాదాద్రి కలెక్టరేట్‌కు వచ్చిన మంత్రి జగదీశ్‌రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయడంతో నలుగురు రైతులు 14 రోజుల పాటు జైలులో ఉండాల్సి వచ్చింది. వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. రైతుల చేతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకొని రావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
గతంలో వైటీడీఏ, బస్వాపురం, నేషనల్ హేవే, విద్యుత్ టవర్ల కోసం భూములు ఇచ్చామని ఈసారి తమను మినహాయించాలని కోరతూ రాష్ట్రపతి,ప్రధానికి విజ్ఞప్తులు పంపారు.
రైతుల పోరాటం వృథా!
ట్రిపుల్ ఆర్ అలైన్మైంట్ మార్చాలన్న రైతుల డిమాండ్ నెరవేరలేదు. గత నెలలో వెలువడిన త్రీ ఏ గెజిట్ నోటిఫికేషన్‌కు అనుబంధంగా ఈ నెల 12న అనుబంధ గెజిట్‌ను సెంట్రల్ ట్రాన్స్పోర్ట్, నేషనల్హేవే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ గెజిట్‌లో గతంలో ప్రతిపాదించిన భూముల కంటే అదనంగా మరో 64. 8125 ఎకరాలను సేకరిస్తామని పేర్కొంది.
దీంతో భువనగిరి డివిజన్లోని రాయగిరి, పెంచికల్ పహాడ్, గౌస్‌నగర్, కేసారం, తుక్కాపూర్, ఎర్రంబెల్లిలో 14.99 కిలోమీటర్లు నిర్మించే రోడ్డు కోసం 491 ఎకరాలను సేకరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1917 ఎకరాలను సేకరించనున్నారు.
త్వరలో త్రీడీ నోటిపికేషన్
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ట్రిపుల్ ఆర్కు ఎన్ని ఎకరాలను సేకరించనున్నారో స్పష్టత వచ్చింది. త్రీ డీ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మూడేండ్లలో ఏడాది భూముల ధరలు ఏఏ స్థాయిలో మారాయో పరిశీలిస్తారు. ఆ తర్వాత పూర్తి వివరాలను నేషనల్ హైవే ఆఫీసర్లకు పంపిస్తారు.
ఆ తర్వాత అవార్డును ఖరారు చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. నేషనల్ హైవే ఆఫీసర్లు కన్ఫామ్ చేసిన అనంతరం రైతులు, ఇతరులకు పరిహారం అందిస్తామని చెప్పారు.
అనుబంధ గెజిట్ విడుదలైంది
భువనగిరి డివిజన్ పరిధిలోని ట్రిపుల్ ఆర్ కోసం సేకరించే భూముల పూర్తి వివరాలతో అనుబంధ గెజిట్ విడుదలైంది. త్వరలోనే త్రీ డీ నోటిఫికేషన్ విడుదలవుతుంది.
- భూపాల్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో